లారీ చక్రాల కింద నలిగిన కూలీ ప్రాణం

ABN , First Publish Date - 2022-10-02T04:04:05+05:30 IST

పొట్ట నింపుకునేందుకు కూలి పనికి వెళ్లిన కూలీ ప్రాణం రోడ్డు ప్రమాదంలో లారీచక్రాల కింద నలిగిపోయింది. ఈ ఘటన

లారీ చక్రాల కింద నలిగిన కూలీ ప్రాణం
ప్రమాదంలో మృతి చెందిన పాలమాని హరికృష్ణ

 మరొకరికి గాయాలు

 మనుబోలు, అక్టోబరు 1: పొట్ట నింపుకునేందుకు కూలి  పనికి వెళ్లిన కూలీ ప్రాణం రోడ్డు ప్రమాదంలో లారీచక్రాల కింద నలిగిపోయింది. ఈ ఘటనలో పాలమాని హరికృష్ణ (39) దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మనుబోలు మండలం  కృష్ణపట్నం పోర్టు క్రాస్‌రోడ్డు సమీపంలో శనివారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా  నాయుడుపేట మండలం అగ్రహారంపేటకు చెందిన పాలమాని హరికృష్ణ ఇటుకబట్టీల వద్ద కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రోజువారీ పనుల్లో బాగంగా హరికృష్ణ సహచర కూలీలతో కలిసి లారీలో ఇటుకలు నింపుకుని నెల్లూరుకు వెళ్లాడు. అక్కడ ఇటుకలను దింపి అదే లారీలో కృష్ణపట్నం పోర్టు రోడ్డు వరకు వచ్చాడు. అక్కడ కూలీలను దింపేసి లారీ పోర్టుకు వెళ్లింది. దీంతో హరికృష్ణతోపాటు ఉన్న నలుగురు కూలీలు కలిసి నాయుడుపేట వెళ్లేందుకు చెన్నై వెళుతున్న మరోలారీ ఎక్కారు. లారీ 100మీటర్ల దూరం వెళ్లగానే అదేమార్గంలో చెన్నై వెళ్లే లారీ వేగంగా వచ్చి కూలీలున్న లారీని వెనుకభాగంలో ఢీకొట్టింది. లారీలో నిలుచుకుని ప్రయాణిస్తున్న హరికృష్ణ ఢీకొట్టగానే ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. సెకన్ల వ్యవధిలోనే ఢీకొట్టిన లారీ హరికృష్ణ ఛాతీపై దూసుకెళ్లింది. దీంతో హరికృష్ణ తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లముందే  హరికృష్ణ చనిపోవడం సహచరకూలీలను కంటతడి పెట్టించింది. రోడ్డుపై మృతుడి వద్ద వారు చేరి రోదించసాగారు. ఈ ప్రమాదంలో మరో కూలి బాలకృష్ణకు స్వల్పగాయమైంది. మృతుడికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ. కే. ముత్యాలరావు తెలిపారు.


Read more