భలే... భలే... బడులు

ABN , First Publish Date - 2022-02-24T04:07:51+05:30 IST

మండలంలోని పాఠశాలలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. విద్యార్థులు వీటిని చూసి ఉత్సాహంతో.. ఆనందంతో కేరింతలు వేస్తున్నారు.

భలే... భలే... బడులు
సోమరాజుపల్లెలో ప్రత్యేక బల్లల ఏర్పాట్లు

సరికొత్త అందాలతో పాఠశాలలు

ప్రతి తరగతి గది ఓ కళారూపం


ఇందుకూరుపేట, ఫిబ్రవరి 23 : మండలంలోని పాఠశాలలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. విద్యార్థులు వీటిని చూసి ఉత్సాహంతో.. ఆనందంతో కేరింతలు వేస్తున్నారు. బడి అంటే నేల మీద కూర్చోవడం, గుంతలు పడిన తూములు, విరిగిపోయిన బల్లలు, అస్తవ్యస్తంగా ఉంటున్న గదుల్లో.. ఇప్పుడు ఆహ్లాద వాతావరణంలో ఏర్పాటు చేయడమే విశేషం. ముఖ్యంగా మండలంలోని 25 పాఠశాలల్లో ప్రతి గది ఒక కళారూపంగా తీర్చిదిద్దారు. నాడు-నేడు పథకం కింద నిధులు మంజూరు కావడంతో పాఠశాలలకు కొత్త జీవం తేవాలని అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని పిల్లలు, పెద్దలు హర్షిస్తున్నారు. ప్రహరీగోడ నుంచి లోపల వరకు చిత్రాలతో అలంకరించారు. రంగురంగుల తైలవర్ణ చిత్రాలు కూడా ఎన్నో ఏర్పాటు చేశారు. బల్లలు కూడా ఒకదాని వెనుక ఒకటి ఉండే విధంగా ఒక ప్రత్యేక శైలిలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రహరీ గోడ మీద నుంచి తరగతి గది వరకు జాతీయ నాయకుల చిత్రాలను చిత్రీకరించారు.  అలాగే చదువు పట్ల జాతీయ భావం పట్ల కొన్ని విలువలు పెంచే విధంగా గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు, సూక్తులు, మంచి స్లోగన్స్‌ రాయించడం కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మండలంలోని నిడిముసలి, సోమరాజుపల్లి, పల్లెపాడు ఇలా ఎన్నో గ్రామాల పాఠశాలలు ఈ సోయగాలతో అలరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా వీటిని ఆసక్తిగా  చదువుతున్నారు.  


మరికొన్ని పాఠశాలలో పనులు 

ఇప్పటికీ 25 పాఠశాలలను కొత్త అందాలతో అలంకరించి ఉన్నాం. ప్రస్తుతం నాలుగు హైస్కూళ్లలో పనులు కూడా చేపడుతున్నామన్నారు. త్వరలో మరికొన్ని పాఠశాలల్లో ఇదే తరహా ఆహ్లాద వాతావరణాన్ని అందించేందుకు   కృషి చేస్తున్నాం.

- ఎంఈవో శ్రీహరిబాబుRead more