కేంద్రం సొమ్ము.. రాష్ట్రం సోకు!

ABN , First Publish Date - 2022-10-02T04:55:53+05:30 IST

ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ హాస్టల్‌ భవన నిర్మాణాలకు రివర్స్‌ టెండరింగ్‌లో ప్రొద్దుటూరుకు చెందిన కేసీపీ కనస్ట్రక్షన యాజమాన్యం రూ.48.50 కోట్లతో పనులు దక్కించుకుంది.

కేంద్రం సొమ్ము..  రాష్ట్రం సోకు!
వైద్య విద్య కళాశాలలో హాస్టల్‌ భవనాలు

వైద్య విద్య కళాశాలలో పీజీ విద్యార్థుల కోసం భవన నిర్మాణాలు

ఏడాది కిత్రమే రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్రం

రివర్స్‌ టెండర్‌ పేరుతో  రూ.48.50 కోట్లకు పనుల అప్పగింత

మిగిలిన సొమ్ము తన పథకాలకు మళ్లించుకున్న రాష్ట్ర సర్కారు


ఎప్పుడో ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులవి. నెల్లూరులోని ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలో భవన నిర్మాణాలు చేపట్టవలసి ఉంది. అయితే, సంవత్సరం తర్వాత తీరిగ్గా టెండరు పిలిచి ఓ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు. ఏడాది తర్వాత అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించినందుకు సంబరపడదామనుకునేలోపు ఓ నమ్మలేని నిజం వెలుగు చూసింది. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిధులు ఆదా చేశామంటున్న రాష్ట్ర సర్కారు కేంద్రం విడుదల చేసిన నిధుల్లో సగానికి సగం తన సంక్షేమ పథకాలకు మళ్లించేసింది. అదెలాగో ఈ కథనం చదవండి.


నెల్లూరు (వైద్యం), అక్టోబరు 1 : ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ హాస్టల్‌ భవన నిర్మాణాలకు రివర్స్‌ టెండరింగ్‌లో ప్రొద్దుటూరుకు చెందిన కేసీపీ కనస్ట్రక్షన  యాజమాన్యం రూ.48.50 కోట్లతో పనులు దక్కించుకుంది.  ఇందులోనే ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని సెల్లార్‌లో నీరు నిల్వ లేకుండా సీవేజ్‌ నిర్మాణాలను కూడా రూ.కోటి వ్యయంతో నిర్మించనున్నారు. ఏడాది క్రితమే ఈ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఈ నిర్మాణాలు చేపట్టనుంది. అయితే ఇందులో మిగులు నిధులు రూ.50 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలను మళ్లించినట్లు తెలుస్తోంది. మరోవైపు రూ.100 కోట్ల విలువైన పనులను సగానికిపైగా రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో తగ్గించి ఇవ్వడం వల్ల నిర్మాణ పనుల్లో  నాణ్యత ఎలా ఉంటుందోనన్న అనుమానం కలుగుతోంది. కాగా, వైద్య కళాశాలలో యువతి, యువకులకు విడివిడిగా హాస్టల్‌ భవనాలు నిర్మించనున్నారు. అలాగే ప్రస్తుతం పల్మనాలజీ వార్డుపైన మరో బ్లాక్‌ను, డెర్మటాలజీ విభాగానికి చెందిన మరో బ్లాక్‌ను, సీనియర్‌ రెసిడెంట్‌ క్వార్టర్‌ను కాంట్రాక్టు సంస్థ నిర్మించ నుంది. 


ప్రతిపాదనల్లోనే జీజీహెచలో పనులు


ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పలు పరికరాలు, అభివృద్ధి పనులు, ఆసుపత్రి నిర్వాహణ పనులకు రూ.9 కోట్లతో ప్రతిపాదనలను అధికారులు రూపొందించారు. అయితే, ఈ ప్రతిపాదనలు నెలలు గడుస్తున్నా నేటికి  అనుమతులు మంజూరు కాలేదు. నిధుల విడుదలలో  రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. రేడియాలజీ విభాగంలో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 6 పీజీ సీట్లను మంజూరు చేసింది. ఈ విభాగంలో ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ నిధులు ఎప్పుడు వస్తాయో తెలియకపోవడంతో అధికారుల్లో అయోమయం నెలకొంది. అలాగే కొవిడ్‌ వంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు రోగులు ఇబ్బంది పడకుండా క్రిటికల్‌ యూనిట్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందుకు రూ.3.50 కోట్ల మంజూరు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం జూలై 12వ తేదీన నెల్లూరు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి వచ్చి స్థల పరిశీలన చేశారు. అయితే ఇవి ప్రతిపాదనలుగానే మిగిలాయి. దీంతోపాటు జీజీహెచ నిర్వాహణ కోసం ఇటీవల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి సూచనల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈ నిధులు ఎప్పుడు వస్తాయే పరికరాలు, నిర్మాణాలు ఎప్పుడు చేపడతారో అంతుపట్టని పరిస్థితి.


త్వరలో నిర్మాణాలు


ప్రభుత్వ వైద్య కళాశాలలో హాస్టల్‌ భవన నిర్మాణ పనులను రివర్స్‌ టెండర్‌ ద్వారా ప్రొద్దుటూరుకు చెందిన కేసీపీ కనస్ట్రక్షన కంపెనీ దక్కించుకుంది. త్వరలో ఈ నిర్మాణాలు జరగనున్నాయి. అయితే మరికొన్ని నిర్మాణ పనులకు ప్రతిపాదనలు రూపొందించాం. ఈ పనులకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. 

- విజయభాస్కర్‌, ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ

Read more