కందుకూరు ఏఎంసీ కార్యదర్శి బదిలీ కలకలం!

ABN , First Publish Date - 2022-09-25T05:26:58+05:30 IST

కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు కార్యదర్శి రవికుమార్‌ బదిలీ వ్యవహారం కలకలం రేపింది.

కందుకూరు ఏఎంసీ కార్యదర్శి  బదిలీ కలకలం!
కందుకూరు ఏఎంసీ కార్యాలయం

3 నెలలు తిగకనే స్థానచలనం

ముక్కుసూటి అధికారిగా గుర్తింపు

జరుగుతున్న అవినీతిపై బహిరంగ విమర్శలు


కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు కార్యదర్శి రవికుమార్‌ బదిలీ వ్యవహారం కలకలం రేపింది. కందుకూరులో ఆయన బాధ్యతలు చేపట్టి మూడు నెలలు తిరగకనే బదిలీ కావటంతోపాటు ఆయన చేసిన విమర్శలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ ఏడాది జూలై మొదటివారంలో రవికుమార్‌ బాధ్యతలు స్వీకరించిన రోజే తాను 3, 4 నెలలకు మించి ఇక్కడ ఉండబోనని, ఈలోపు తనను బదిలీ చేస్తారని వ్యాఖ్యానించారు. అన్నట్టుగానే మూడో నెల పూర్తికాకనే శుక్రవారం సాయంత్రం బదిలీ ఉత్తర్వులు చేతికందటం, వెంటనే ఆయన రిలీవ్‌ అయి వెళ్లిపోవడం జరిగిపోయాయి. అయితే ఆయన వెళ్తూ కందుకూరు ఏఎంసీ అవినీతిమయంగా మారిపోయిందని, దీనిని ప్రక్షాళన చేయాలని తాను చేసిన ప్రయత్నం ఫలించలేదని అన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయటమేగాక వారే ఓ శక్తిగా మారి తనను బదిలీ చేయించారంటే అవినీతి ఎంతలా వ్యవస్థీకృతమై ఉందో అర్థం చేసుకోవచ్చని మాట్లాడటం చర్చనీయాంశమైంది. 


కందుకూరు, సెప్టెంబరు 24 : ప్రధానంగా మార్కెట్‌ సెస్సు వసూళ్ల విషయంలో మార్కెట్‌ యార్డులో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, వారి వెనుక మాజీ ఏయంసి ఛైర్మన్లు కూడా బలంగా పనిచేస్తున్నారని రవికుమార్‌ విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడకుండా పని చేయండి మీరు వసూలు చేసే మార్కెట్‌ సెస్సులో 2 శాతం ఇన్సెంటివ్‌ ఇప్పించేలా చర్యలు తీసుకుంటానని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి చెప్పినా వారు సుముఖత వ్యక్తం చేయలేదంటే ఇక వారి చేతివాటం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని కూడా ఆయన చెప్పటం విశేషం.


నిక్కచ్ఛిగా వ్యవహరిస్తూ..


మార్కెట్‌ సెస్సు వసూళ్లు మొదలు, రైతు బజారు నిర్వహణ తదితర అంశాలలో రవికుమార్‌ నిక్కచ్ఛిగా వ్యవహరించారు. అనధికారికంగా యార్డులో పెత్తనం చెలాయిస్తున్న ఏఎంసీ మాజీ చైర్మన్లు, వారి బంధువులను కట్టడి చేశారు. లైసెన్సులు లేకుండా క్రయ, విక్రయాలు జరుపుతున్న దళారులపైనా కొరడా ఝులిపించారు. రమారమి 120 మంది ఇలాంటి వారు ఉన్నారని జాబితా సిద్ధం చేసి, లైసెన్సులు పొందాలని నోటీసులు జారీచేశారు. అలాగే రైతుబజారులో కూరగాయల ధరలపైనా దృష్టి పెట్టి కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు కాగా సెస్సు వసూళ్ల కోసం ఉండే చెక్‌పోస్టులపై దృష్టిపెట్టడం, అక్కడ పనిచేసే సిబ్బంది అవినీతిని పట్టుకుని ప్రశ్నించడంతో సమస్య మొదలైంది. తీరప్రాంతంలో ప్రస్తుతం అమ్మకాలు జరుగుతున్న వేరుశనగ కాయలకు సెస్సు కట్టకుండా సిబ్బంది చేతులు తడిపి సరుకు తరలిస్తున్నారని తెలుసుకున్న రవికుమార్‌ స్వయంగా రంగంలోకి దిగి రెండు రోజులు అక్కడే మకాం వేసి రూ.1.5 లక్షలు సెస్సు వసూలు చేశారు. ఆ మరుసటి రోజే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సహాయ నిరాకరణ ప్రారంభించడం, శుక్రవారం ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావటం చకచకా జరిగిపోయాయి.  బదిలీ అయిన అధికారి నిజాయితీపరుడే అయినా క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా చట్టపరిధిలో పనిచేయించటంలో నైపుణ్యం లేక ఇబ్బంది పడ్డాడన్న వాదనలో కూడా వాస్తవం ఉన్నప్పటికీ ఆయన చేసిన విమర్శల్లోని సారాంశాన్ని చూస్తే ఇక్కడ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, వారిని నియమించుకున్న ద్వితీయ శ్రేణి నేతలు చక్రం తిప్పుతున్నారన్న విషయం మాత్రం వాస్తవం అని తేటతెల్లమవుతోంది. ఉన్నతాధికారులు ఈ పరిస్థితులను చక్కదిద్ది అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

Read more