ఏడాదిలోపే కమిటీని కప్పేశారు!

ABN , First Publish Date - 2022-08-17T04:36:32+05:30 IST

గతేడాది వరకు విపరీతంగా చెరువుల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతుండేవి.

ఏడాదిలోపే  కమిటీని కప్పేశారు!
కావలి మండలం రుద్రకోట చెరువులో మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు (ఫైల్‌)

చెరువుల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు నిబంధనల రూపకల్పన

‘మాగుంట’ వ్యవహారం తర్వాత అమల్లోకి..

ఏడాది కాకముందే ఆ నిబంధనలు హుష్‌కాకి

జేసీ నేతృత్వంలో అధికారుల కమిటీకీ నిర్ణయాధికారం

ఇప్పుడు ఇరిగేషన ఎస్‌ఈ అనుమతిస్తే చాలట

‘అధికార’ ఒత్తిళ్లతో తలొగ్గిన యంత్రాంగం 


అంతన్నారు.. ఇంతన్నారు.. కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు..  చెరువుల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు జిల్లా కమిటీ నుంచి అనుమతులు తీసుకోవాలని కొత్త నిబంధనలు విధించారు.. ఇక బాగుపడిందిలే అనుకుని ఏడాది తిరిగే లోపే తూచ అన్నారు.. కమిటీ అవసరం లేదని, కేవలం ఎస్‌ఈ దగ్గర తెల్లకాగితంపై తీసుకున్నా సరిపోతుందని నిబంధనలు సడలించారు.. ఫలితంగా అక్రమార్కులకు మార్గం సుగుమం చేశారు.. ఇదీ మట్టి, గ్రావెల్‌ తవ్వకాల విషయంలో జిల్లా అధికారుల తీరు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వారు రూపొందించుకున్న నిబంధనలను పక్కన పడేశారు. 


నెల్లూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : గతేడాది వరకు విపరీతంగా చెరువుల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే సర్వేపల్లి రిజర్వాయర్‌ నుంచి మాగుంట ఆగ్రోఫార్మ్‌కు మట్టి అవసరమంటూ ఎం శ్రీనివాసులురెడ్డి తండ్రి రాఘవరెడ్డి పేరుతో అనుమతులు మంజూరయ్యాయి. దీంతోపాటు మరికొన్ని అనుమతులు కూడా ఇరిగేషన అధికారులు ఇచ్చారు. వీటిని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారం తవ్వకాలు జరిపారు. విపక్షాలు ఆందోళనతో అధికారులు విచారణ జరిపారు. అనుమతులకు మించి తవ్వకాలు జరిపినట్లు గుర్తించి జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంటికి నోటీసులు వెళ్లాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కేసులు, విచారణలు అంటూ అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఇలా వరుస ఘటనలు జరుగుతుండడంతో జిల్లా అధికారులు స్పందించారు. మట్టి, గ్రావెల్‌ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. అప్పటి వరకు చెరువుల్లో తవ్వకాలకు ఇరిగేషన ఎస్‌ఈ ఒక్కరే అనుమతిస్తే సరిపోయేది. కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు దరఖాస్తు చేసుకుంటే జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా కమిటీకి సిఫార్సు చేస్తారు. ఆ కమిటీలో ఇరిగేషన, రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు, విజిలెన్స విభాగాల పాత్ర ఉండేది. ఎవరు దరఖాస్తు చేసుకున్నారు? ఏ అవసరం కోసం దరఖాస్తు చేసుకున్నారు? ఎంత మొత్తం తవ్వకాలకు అనుమతులు అవసరం? ఏ ఏ వాహనాల్లో ఎన్ని రోజులు తవ్వి తరలిస్తారు? వంటి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారుల కమిటీ ఆ వివరాలను పరిశీలించి నిజంగా అవసరమైన మేర మాత్రమే అనుమతులు జారీ చేసేది. ఇది అక్రమార్కులకు ఇబ్బందికరంగా మారింది. 


మళ్లీ పాత పద్ధతే..!


గతేడాది సెప్టెంబరులో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఏడాది కూడా గడవక ముందే వాటిని పక్కన పెట్టేసి పాత పద్ధతిలోనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఏ జిల్లాలో లేని నిబంధనలు ఇక్కడెందుకని, కమిటీ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని పక్కన పెట్టాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో అధికారులు చేతులెత్తేశారు. ఇటీవల కాలంలో ఇష్టానుసారంగా చెరువుల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అది కూడా పేరుకే కొంత క్వాంటిటీ అనుమతులు పొంది ఆ పేరుతో ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్‌ నుంచి ఓ బీరు ఫ్యాక్టరీకి భారీగా మట్టిని తరలించారు. అనుమతులు లేకుండా తవ్వుతుండటంతో ఇరిగేషన అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఆ వెంటనే వారు అడ్డుకున్నారు. తర్వాత సంబంధిత వ్యక్తులు కొంత క్వాంటిటీకి అనుమతులు తీసుకున్నారు. దీని మాటున భారీగా తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావలిలోని రుద్రకోట చెరువులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిబంధనలు సడలించడంతో మళ్లీ ఇరిగేషన అధికారులకు తలనొప్పులు మొదలయ్యాయి. అది తప్పు.. అని తెలిసినా ఏం చేయలేకపోతున్నారు. ఉన్నతాధికారులే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినప్పుడు తామెంత అంటూ కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు మట్టి తవ్వకాలపై కన్నెత్తి కూడా చూడడం లేదు. కాగా దీనిపై ఇరిగేషన ఎస్‌ఈ కృష్ణమోహనను వివరణ కోరగా కొత్త నిబంధనల అమలు నిలిపివేసిన మాట వాస్తవమేనని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-17T04:36:32+05:30 IST