‘జెన్‌కో’ మూడో యూనిట్‌ జాతికి అంకితం

ABN , First Publish Date - 2022-10-19T05:17:36+05:30 IST

మండలంలోని నేలటూరు వద్ద నిర్మించిన ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను సీఎం జగన్మోహన్‌రెడ్డి ఈనెల 27న జాతికి అంకితం చేయనున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

‘జెన్‌కో’ మూడో యూనిట్‌ జాతికి అంకితం
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కాకాణి

మంత్రి కాకాణి

ముత్తుకూరు, అక్టోబరు 18 :  మండలంలోని నేలటూరు వద్ద నిర్మించిన ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను సీఎం జగన్మోహన్‌రెడ్డి ఈనెల 27న జాతికి అంకితం చేయనున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయరావు, ఏపీ జెన్‌కో రాష్ట్ర డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రాజులతో కలిసి మంగళవారం ఆయన సీఎం పర్యటన ఏర్పాట్లను  పరిశీలించారు. బహిరంగ సభ వేదిక, పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్‌ స్థలాన్ని, పైలాన్‌ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. మూడో యూనిట్‌ కంట్రోల్‌ పాయింట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న మత్స్యకారేతర ప్యాకేజీ ద్వారా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సీఎం రూ.25వేలు అందజేస్తారని తెలిపారు. 2019 ఏప్రిల్‌ నాటికి తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ ఈ ప్యాకేజీ అందిస్తామన్నారు. 2019 ఎన్నికలకు ముందు కొంతమందికి ఈ ప్యాకేజీ కింద రూ.14వేల సాయాన్ని  ఇచ్చారని, అలాంటి వారికి మిగిలిన మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు. అర్హత ఉండి ఎవరికైనా ఈ ప్యాకేజీ అందకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాకు సంబంధించి ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలకు,  ఈ ప్రాంతంలో మినీ ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుకు అనుమతులు తీసుకుని సీఎం శంఖుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నుడా వైస్‌ చైర్మన్‌ బాపిరెడ్డి, ఆర్‌డీవో మాలోల, ఎంపీపీ సుగుణమ్మ, తహసీల్దారు మనోహర్‌బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 
Read more