ఆ క్షణం.. జయించండి!

ABN , First Publish Date - 2022-09-10T05:48:07+05:30 IST

గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్న సమయంలో ఒకరి బాధలు మరొకరు పంచుకునేవారు. ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులతోనూ, కుటుంబ పెద్దతోనూ మాట్లాడేవారు.

ఆ క్షణం..  జయించండి!

సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు!

పోరాడుతూ విజేతలుగా నిలవండి!

నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం              


కుటుంబ కలహాలతో కొందరు.. అప్పులు ఎక్కువయ్యాయని, ఆర్థిక ఇబ్బందులతో ఇంకొందరు.. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని మరికొందరు... ప్రేయసి దూరమయ్యిందనో... ప్రియుడు మోసం చేశాడనో... వేధింపులతోనో... ఇలా కారణాలు ఏవైనా క్షణికావేశం నిండు జీవితాన్ని మింగేస్తోంది. ఆ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం అయినవారిని, కన్నవారిని పుట్టెడు దుఃఖంలోకి నెట్టేస్తోంది. సమస్య ఏదైనా దాని పరిష్కారం వైపు అడుగులు వేయాలే తప్ప భయపడి బలవన్మరణానికి పాల్పడితే నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటో గ్రహించాలి. బలవన్మరణానికి దారితీసే ఆ క్షణాన్ని జయిస్తే నిండు నూరేళ్లు బంధుమిత్రులతో సంతోషంగా గడిపేయచ్చు. శనివారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం..


నెల్లూరు (క్రైం), సెప్టెంబరు 9 : గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్న సమయంలో ఒకరి బాధలు మరొకరు పంచుకునేవారు. ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులతోనూ, కుటుంబ పెద్దతోనూ మాట్లాడేవారు. ఆ మేరకు కొంత సాంత్వన దొరికేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పరుగు ప్రపంచంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు గల కుటుంబాలు ఎక్కువయ్యాయి. దీంతో చిన్న సమస్యకు కూడా మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. కుటుంబ కలహాలు తలెత్తినప్పుడు మరొకరితో వారి బాధలు చెప్పుకోలేక వారిలో వారే కుమిలిపోతూ బలవన్మరణం వైపు అడుగులు వేస్తున్నారు. చిన్న కుటుంబమైనా అందరూ ఒకే దగ్గర కూర్చొని అరగంట కూడా మాట్లాడుకోవడం లేదు. అదేమిటంటే సమయం లేదు బిజీ అంటున్నారు. అదే సెల్‌ఫోనను మాత్రం క్షణం కూడా వదిలిపెట్టకుండా దాంతో కాలక్షేపం చేస్తున్నారు. 


 వారి వేదన వర్ణణాతీతం


సమస్యకు పరిష్కారం ఆత్మహత్యే అనుకుంటే ఈ భూమిపై ఒక్కరు కూడా మిగలరు. ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు పరిష్కారం కాకపోగా కుటుంబసభ్యులపై మరింత భారం పడుతుంది. మరణించిన వారు సమస్యను తప్పించుకుంటారే తప్ప బతికి ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం వర్ణణాతీతం. జీవితంలో ఎదురైన సమస్యను పోరాడి పరిష్కరించుకోవాలే తప్ప సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలను విడవాలనుకోవడం సరైన నిర్ణయం కాదని నిపుణులు సూచిస్తున్నారు. మన రాజ్యాంగం జీవించే హక్కును కల్పించింది. దీనిని ఉల్లంఘిస్తూ ఆత్మహత్యకు యత్నించిన వారు సెక్షన 309 ప్రకారం శిక్షార్హులు. ఈ నేరానికి పాల్పడిన వారికి ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు.


జిల్లాలో నెలకు ఇరవైకిపైగా.. 


జిల్లాలో ఇటీవల కాలంలో ఆత్మహత్యల సంఖ్య అధిక మవుతోంది. ఈ యేడాది ప్రతి నెల 20కిపైగా ఆత్మహత్య కేసులు నమోదువుతున్నాయి. భార్యాభర్తల నడుమ గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, తీవ్ర అనారోగ్యం ఇలా అనేక కారణాలతో ఎంతోమంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఇక రైలుకింద పడి ప్రాణాలు వదిలే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.                                

తనతో భార్య సజావుగా కాపురం చేయడం లేదని, అందుకు కారణం ఆమె కుటుంబసభ్యులే అని స్నేహితుడికి ఫోన ద్వారా వాయిస్‌ రికార్డ్‌ పంపి ఈ నెల 1వ తేదీని నెల్లూరు వేదాయపాలెం పోలీసు స్టేషన పరిధిలో రంగస్వామి తన పెద్ద కుమారుడు సంజయ్‌కుమార్‌తో కలిసి నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ నెల 1వ తేదీన వింజమూరులో క్షణికావేశంలో గీత అనే వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తనూ బలవన్మరణానికి పాల్పడింది. 

గత నెల 12వ తేదీన నగరంలోని శెట్టిగుంటరోడ్డులో స్నేహితురాలి ఇంట్లో ఎ శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. అదేరోజు కావలిలో దంపతుల మధ్య ఏర్పడిన వివాదాలతో నాయబ్‌ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గత నెల 22వ తేది ఉలవపాడులో ప్రేమికుడు మోసగించాడని ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 27న కుటుంబ కలహాలతో కావలి మండలం కోనేటివారిపాళెంలో రాజా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 29న కుటుంబ కలహాలతో ఇందుకూరుపేట మండలం డేవి్‌సపేటలో సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు మాత్రమే. వెలుగులోకి రానికి ఎన్నో ఉన్నాయి.


క్షణికావేశం వద్దు 

సమస్యకు పరిష్కారం మృతువు మాత్రమే కాదు. క్షణికావేశంతో కారణాలు ఏవైనా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చిన ప్రశాంతగా ఆలోచించి దగ్గరి వ్యక్తులకు తెలియజేయడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి చనిపోయి సాధించేది ఏమి లేదు.

- అబ్దుల్‌ సుబహాన, నగర్‌ ఇనచార్జి డీఎస్పీ


ఆ భావన నుంచి ఇలా బయటపడండి!


ధైర్యం, ఆత్మవిశ్వాసం, మంచి ఆలోచనలు, భవిష్యతను చక్కగా ఊహించుకోవాలి.

ఆత్మహత్య భావనలో ఉన్న వారిని ఒంటరిగా ఉంచకూడదు. వీలైనంత వరకు ఇంట్లో వారందరి మధ్య  మెలిగేలా చూసి, వారిలో ధైర్యం నింపాలి.

సాధారణంగా ఆత్మహత్య భావన ఉన్నవారు చావు గురించి మాట్లాడటం, డైరీ, ఇతర పుస్తకాల్లో ఎలా చావాలో వంటి ఆంశాలను రాస్తుంటారు. వాటిని గమనిస్తూ ఉండాలి

ఆత్మవిశ్వాసం, పాజిటివ్‌ థింకింగ్‌ పుస్తకాలు, బిహేవియర్‌ థెరిఫీ, కౌన్సెలింగ్‌ ప్రక్రియలు శక్తివంతంగా ఉపయోగపడుతాయి.

వీలైనంత వరకు ఆత్మహత్య భావన ఉన్న వారికి ఆత్మహత్యకు సహకరించే వస్తువులను అందుబాటులో లేకుండా చూడాలి. ఆత్మహత్యకు పాల్పడతారనే అనుమానం ఉన్న వారిని నా వద్దకు తీసుకువస్తే కౌన్సెలింగ్‌ నిర్వహించి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తా. పూర్తి వివరాలకు 9346708090 నెంబర్‌కు ఫోన చేయాలి.

- డాక్టర్‌ సురే్‌షబాబు, మానసిక వైద్యనిపుణులు, నెల్లూరు

Read more