జగనన్న లేఅవుట్లలో వసతులు శూన్యం

ABN , First Publish Date - 2022-06-08T02:59:25+05:30 IST

జగనన్న లేఅవుట్లలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో ఇళ్లు కట్టుకునేవారు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా

జగనన్న లేఅవుట్లలో వసతులు శూన్యం
ఆనందపురం లేఅవుట్‌లో క్యూరింగ్‌ లేక ఎండిపోతున్న గృహాలు


ముగిసిన  కాంట్రాక్టర్ల ఒప్పంద గడువు

నిర్వహణ మాది కాదంటున్న వివిధ శాఖలు

నీళ్లు లేక లబ్ధిదారుల అవస్థలు

కందుకూరు, జూన్‌ 7 : జగనన్న లేఅవుట్లలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో ఇళ్లు కట్టుకునేవారు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గృహాల నిర్మాణానికి నీటిలభ్యత లేకపోవటంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  నీటి కోసం ఏర్పాటుచేసిన సింటెక్స్‌ బాక్సులకు నీరు సరిగా సరఫరా కావటం లేదని, అరకొరగా వచ్చిన నీరు ఏమాత్రం సరిపోవటం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇళ్లకు సరిగా క్యూరింగ్‌ చేయలేకపోతున్నామన్నారు. 


ముగిసిన కాంట్రాక్టర్‌ ఒప్పందం


ఈ లేఅవుట్లలో గృహ నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ప్రభుత్వమే తీసుకున్న విషయం తెలిసిందే. లేఅవుట్లలో మెరక చేయడం, కచ్చా రోడ్ల అభివృద్ధితోపాటు గృహ నిర్మాణానికి అవసరమైన నీటికోసం  బోర్లు వేసి పైప్‌లైన్ల ద్వారా ప్రతి ఇంటికి ఒక సింటెక్స్‌ బాక్సు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  సింటెక్స్‌ బాక్సులకు నిరంతరం నీటి సరఫరా జరిగేలా  చూసేందుకు ఓ వాచ్‌మన్‌ను నియమించారు. ఈ పనులన్నీ ఏడాదిపాటు ఒప్పందంతో కాంట్రాక్టర్లకు అప్పగించారు. కందుకూరు మున్సిపాలిటీలో మహదేవపురం, వరాల సాయి నగర్‌, దివివారిపాలెం, ఆనందపురం, కొండికందుకూరు, దూబగుంట లేఅవుట్లు ఉండగా, వీటన్నింటి నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించారు. నెలక్రితమే వీరి ఒప్పందం  ముగియటంతో వాచ్‌మెన్‌కు జీతాలు, విద్యుత్‌ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులను నిలిపివేశారు. జీతాలు రావని వాచ్‌మెన్‌లు పనిమానేయగా, బిల్లులు రావటం లేదని కాంట్రాక్టర్లు బోరు మోటార్లకు తాళాలు వేశారు. దీంతో నీరు విడుదల చేసేనాఽథుడు లేక లబ్ధిదారులు అల్లాడిపోతున్నారు.  ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తంగా పదిశాతం నిర్మాణాలు కూడా జరగలేదు.


 మాకు సంబంధం లేదు...

 

ఈ సమస్యపై మాకు సంబంధం లేదంటే, మాకు సంబంధం లేదని వివిధ శాఖల అధికారులు తప్పించు కుంటున్నారు. గృహ నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న హౌసింగ్‌ అధికారులు మాత్రం మా పాత్ర కేవలం నిర్మాణ పురోగతిని పరిశీలించి, వారికి బిల్లులు పెట్టడంవరకేనని దాట వేస్తున్నారు. లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులను పర్యవేక్షించిన ప్రజారోగ్యశాఖ అధికారులు, తమకు ప్రభుత్వం నిర్థేశించిన ఏడాదికాలం పూర్తయి నందున ఇక తాము చేయగలిగింది ఏమీ లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎండలకు నిర్మాణ పనులు సాగిస్తున్న లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు.


 పురోగతి శూన్యం


హౌసింగ్‌ లేఅవుట్లలో గృహాల పురోగతి అంతంత మాత్రంగానే ఉంది.  మహదేవపురం లేఅవుట్‌లో వెయ్యి మందికి పట్టాలు ఇవ్వగా, వారిలో కేవలం 225 మంది మాత్రమే గృహనిర్మాణాలను ప్రారంభించారు. దివివారిపాలెం లేఅవుట్‌లో కూడా 24 గృహాలు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. ఇక్కడ  317 మంది నిర్మాణాలనే ప్రారంభించలేదు. ఇక దూబగుంట లేఅవుట్‌, వరాలసాయినగర్‌, ఆనందపురం లేఅవుట్లలో గృహ నిర్మాణాలు కొంచెం ఫర్వాలేదనిపించేలా జరుగుతున్నాయి. అయినా వీటిన్నింటిలోనూ నీటి సమస్య వెంటాడుతోంది.




Updated Date - 2022-06-08T02:59:25+05:30 IST