శ్మశానం ఆక్రమణపై గ్రామస్థుల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-19T04:08:11+05:30 IST

మండలంలోని ఉలపాళ్ల గ్రామంలోని వడ్డిపాళెం శ్మశానం ఆక్రమణ గురవుతోందని స్థానికులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు.

శ్మశానం ఆక్రమణపై గ్రామస్థుల ఆందోళన
శ్మశానంలో రోడ్డు పనులు అడ్డుకున్న గ్రామస్థులు

దగదర్తి, జూలై 18: మండలంలోని ఉలపాళ్ల గ్రామంలోని వడ్డిపాళెం శ్మశానం ఆక్రమణ గురవుతోందని స్థానికులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. శ్మశానంలో వేస్తున్న రోడ్డు పనులను అడ్డుకున్నారు. అనంతరం నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆక్రమణలపై జేసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డిపాళేనికి ఉన్న శ్మశానం చుట్టూ నివాసితులు ఒక్కొక్కరిగా చాలా వరకు స్థలాన్ని ఆక్రమించారని తెలిపారు. దాదాపు అర ఎకరా ఉన్న శ్మశానం ఇప్పుడు పది సెంట్లు కూడా లేదని తెలిపారు. ఇప్పుడు స్థానిక సర్పంచు బంధువు ఒకరు శ్మశానంలో సమాధులపై రోడ్డు వేస్తున్నారని మండిపడ్డారు. ఇక శ్మశానం లేకపోతే ఇళ్ల వద్దే తాము అంత్యక్రియలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి శ్మశానం ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు బెల్లంకొండ శ్రీనివాసులు, బెల్లంకొండ మల్లికార్జున, చినవెంగయ్య, బాబు, చల్లా రామ్‌బాబు, లక్ష్మయ్య, చల్లా గోవిందమ్మ, బెల్లకొండ ప్రభావతి, రజనీ, బత్తల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-19T04:08:11+05:30 IST