అమాత్యా.. నా గోడు వినండి!

ABN , First Publish Date - 2022-09-18T05:25:04+05:30 IST

‘‘అమాత్యులారా నేను గుర్తున్నానా!?. జిల్లావాసుల ఆరోగ్య ప్రదాయిని నేను. ముఖ్యంగా పేదోళ్లకు ధర్మాసుపత్రిని. నా పేరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల.

అమాత్యా..  నా గోడు వినండి!

ఎమ్మారై, సిటీస్కాన్‌ ఉన్నా లేనట్టే!

రేడియాలజిస్ట్‌ కావాలన్నా పట్టని పాలకులు

నా ఇంట్లో దొంగలు పడి టీవీలు, కంప్యూటర్లు తోచుకెళ్లారు!

రోగులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు!

జీజీహెచ్‌ దీనగాధ ఇది

నేడు వైద్యసిబ్బందితో మంత్రి కాకాణి సమీక్ష


నెల్లూరు(వైద్యం), సెప్టెంబరు 17 : 


‘‘అమాత్యులారా నేను గుర్తున్నానా!?. జిల్లావాసుల ఆరోగ్య ప్రదాయిని నేను. ముఖ్యంగా పేదోళ్లకు ధర్మాసుపత్రిని. నా పేరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల. అందరూ జీజీహెచ్‌గా పిలుస్తారు. ఈ రోజు (ఆదివారం) మీరు (రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి) నా దగ్గరకు వస్తున్నారని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్లకైనా నన్ను గుర్తు చేసుకున్నందుకు. నిజానికి పేరుగొప్ప ఊరుదిబ్బలా ఉంది నా పరిస్థితి. గడిచిన మూడేళ్లలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇక్కడకొచ్చారు. వార్డులన్నీ కలియ తిరిగారు.. అధికారులతో సమావేశమయ్యారు. ఇక్కడున్న సమస్యలన్నీ తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తామని ప్రగల్బాలు పలికారు. వారి మాటలు విని అందరితోపాటు నేనూ సంబరపడ్డా. రోజులు కాదు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు గడిచినా ఒక్క సమస్య కూడా తీరలేదు. ముఖ్యంగా రూ.3.60 కోట్లతో ఎమ్మారై, సిటీస్కాన్‌ ఏర్పాటు చేశారు. సంవత్సరం క్రితం వీటిని సీఎం జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారండోయ్‌. కానీ ఏం చేద్దాం.. రోగ నిర్ధారణ కోసం ఎంతో ఆశతో నా దగ్గరకు వస్తున్న రోగులకు ఉపయోగపడక ఓ గదిలో మూలుగుతున్నా. ఎందుకంటారా!? రేడియాలజిస్టులు లేకపోవడమే. ఒక ప్రొఫెసర్‌, మరో అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ముగ్గురు అసిసెంట్‌ ప్రొఫెనర్‌ స్థాయి ఐదుగురు రేడియాలజిస్టుల అవసరం ఉంది. ఇదివరకు ఇక్కడున్న  ఓ రేడియాలజిస్ట్‌ పదోన్నతిపై బంగోలుకు వెళ్లారు. మరో రేడియాలజిస్ట్‌ ఏప్రిల్‌లో ప్రసూతి సెలవుల్లో వెళ్లారు. ఐదుగురు రేడియాలజిస్టులు అవసరమని నా పాలనాధికారులు లేఖలు అందించినా ప్రయోజనం లేదు. కనీసం ఇద్దరినైనా నియమించుకోవడానికి అనుమతి కోరినా వారి విన్నపాన్ని బుట్టదాఖలు చేశారు. ఇంకో విషయం... 24 గంటలూ రోగులు, వైద్య సిబ్బంది తిరుగాడే చోట దొంగలు పడ్డారంటే మీరు నమ్మతారా!? రూ.29 లక్షలతో ఏర్పాటు చేసిన 50 టీవీలు, 15 కంప్యూటర్లు మాయం అయ్యాయి. వీటిని ఎవరెత్తుకెళ్లారో!? ఇప్పటికీ తేల్చలేదు. ఏసీలు పనిచేయడం మాని నెలలు గడుస్తోంది. వీటి అతీగతీ లేదు. లిఫ్టులు పని చేయక అవస్థలు పడుతూ మెట్లు ఎక్కుతున్న రోగులను చూసి నా గుండె తరుక్కుపోతోంది.


పురిటి బిడ్డలకే రక్షణ లేదయ్యా!?

ప్రసూతి ఆసుపత్రిలో పురిటి బిడ్డల రక్షణ కరువయ్యిందంటే మీరు నమ్ముతారా!? 2018లో రేడియా ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎ్‌ఫఐడీ) అనే పరికరాన్ని ఏర్పాటు చేశారు. తల్లి చేతికి, పురిటిబిడ్డ కాలికి ట్యాగ్‌ వేస్తారు. ఎవరైనా పురిటిబిడ్డను అపహరించేందుకు ప్రయత్నించినా, తల్లికి, బిడ్డకు మధ్య దూరం పెరిగినా సైరన్‌ మోగుతుంది. అంతటి రక్షణ కవచం ఇప్పుడు పని చేయడం లేదయ్యా!

 ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చాన్నాళ్లకు వస్తున్న మీరు నా పాలనాధికారుల విన్నపాలను సావధానంగా వినండి. అందరిలా కాకుండా కొన్ని సమస్యలనైనా పరిష్కరిస్తారని ఆశిస్తున్నా

ఇట్లు..

పేదల ఆసుపత్రి అయినా ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నెల్లూరు


 

Read more