జవాబు లేని ప్రశ్నలెన్నో!?

ABN , First Publish Date - 2022-04-05T06:00:57+05:30 IST

జిల్లాలో పట్టుబడిన గోవా మద్యం కేసు విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జవాబు లేని ప్రశ్నలెన్నో!?
గోవా మద్యం సీసా (ఫైల్‌)

గోవా మద్యం కేసు విచారణలో లొసుగులు

సూత్ర, పాత్రధారులెవరు?

అధికార పార్టీ నాయకుల ప్రమేయంపైనా అనుమానాలు

సెబ్‌ను దోషిగా చూపి  కేసు మూసేస్తారా..


నెల్లూరు (క్రైం), ఏప్రిల్‌ 4 :  జిల్లాలో పట్టుబడిన గోవా మద్యం కేసు విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గోవా నుంచి చీప్‌ లిక్కర్‌ జిల్లాకు రావడం అంత సులభమేమి కాదని కొందరు అంటుండగా,  సముద్ర మార్గం గుండా ఈ మద్యం వచ్చిందని మరికొందరు చెబుతున్నారు. పోలీసులు మాత్రం ఇది గోవా మద్యమేనని, భారీ తారులోడు లారీలో (10 చక్రాల వాహనం) రోడ్డు మార్గాన గోవా నుంచి ఇందుకూరుపేటకు చేరుకుందని  తెలిపారు. అయితే ఆ వాహనం నెంబరు, సీసీ ఫుటేజ్‌లో ఆ వాహనం చిత్రాలు నమోదు కాలేదు. గోవాలో మద్యం అమ్మిన వ్యక్తులదే ఆ వాహనమని, వారే మద్యం నెల్లూరుకి చేరేందుకు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు.  అయితే, ఆ ఇద్దరిని, వాహనాన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నిస్తున్నామని పోలీసులు ఎక్కడా చెప్పలేదు. మరోవైపు ఈ మద్యం ఏ ప్రాంతం నుంచి నెల్లూరుకు చేరింది.. ఎంత ధరకు విక్రయించారు..  విక్రేతలను అదుపులోకి  తీసుకున్నారా? ఇలా అనేక ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.  దీన్ని బట్టి చూస్తే సెబ్‌ అధికారులు ఈ కేసును పైపైనే విచారణ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


సూత్రధారులెవరు?

చెన్నై, బెంగళూరు, తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లాకు వివిధ మార్గాల ద్వారా మద్యం వస్తున్న సమయంలో సెబ్‌ అధికారులు దాడులు నిర్వహించి, పట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే రోడ్డు మార్గం  ద్వారా ఓ భారీ వాహనంలో  గోవా  మద్యం తరలిస్తుంటే సెబ్‌, ఇంటెలిజెన్స్‌, విజిలెన్స్‌, సివిల్‌ పోలీసులు గుర్తించలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ క్రమంలోనే అసలు ఈ చీప్‌ మద్యం గోవా నుంచే వస్తుందా.. లేదా మరో ప్రాంతం నుంచి వస్తుంటే గోవా స్టిక్కర్లు అతికిస్తున్నారా? మారుమూల ప్రాంతం మైపాడు నుంచి అనంతసాగరానికి ఈ మద్యం ఎలా తరలించారు. వేల బాటిళ్ల మద్యాన్ని ఎలా నిల్వ ఉంచగలిగారు. సెబ్‌, సివిల్‌ పోలీసులు ఏం చేస్తున్నారు. ఈ రాకెట్‌కు సూత్రధారి ఎవరు..? వివిధ శాఖల అధికారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గోవా మద్యాన్ని విక్రయిస్తున్నారా... ఇలా వందలాది ప్రశ్నలు జిల్లా ప్రజలను వేధిస్తున్నాయి.


ప్రముఖుల ప్రమేయం?  

గోవా మద్యం కేసులో 8 మందిని సెబ్‌ అఽధికారులు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో సూత్రధారులు ఎవరన్నదానిపై లోతుగా విచారణ సాగడం లేదు. అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రమేయం ఉండటంతోనే సెబ్‌ అధికారులు ఈ కేసులో అసలు సూత్రధారులను కాపాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద మాఫియా సాగుతుంటే అటు సెబ్‌ అధికారులు, ఇటు సివిల్‌ పోలీసులు గుర్తించలేక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

Read more