టీచర్ల పదోన్నతుల్లో గందరగోళం

ABN , First Publish Date - 2022-10-14T05:47:19+05:30 IST

జాతీయ విద్యావిధానం అమల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు.

టీచర్ల పదోన్నతుల్లో గందరగోళం

ఎస్‌ఏలుగా 51 మంది ఎస్‌జీటీలు

బదిలీ స్థానాలు కేటాయించని వైనం

ఉన్నచోటే కొనసాగింపు.. అయోమయంలో టీచర్లు 


ఉపాధ్యాయుల పదోన్నతుల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పదోన్నతులు పొందుతున్న ఉపాధ్యాయులకు స్థానాలను కేటాయించకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు స్కూల్‌ అసిస్టెంట్లు మారినా ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ విధానాలపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరిగే సాధారణ బదిలీల్లో ఏర్పడే ఖాళీల ద్వారా పదోన్నతులు పొందిన వారికి స్థానాలు కేటాయింపులు ఉంటాయని ఉపాధ్యాయ వర్గాలు చెబుతుండటం విశేషం.


నెల్లూరు (విద్య), అక్టోబరు 13 : జాతీయ విద్యావిధానం అమల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రాఽథమిక స్థాయిలో విద్యార్థులకు కూడా సబ్జెక్ట్‌ టీచర్లు బోధిస్తే మేలు జరుగుతుందని భావించి ఉన్నత పాఠశాలలు, యూపీ స్కూళ్లకు కొత్త స్టాఫ్‌ ఫ్యాట్రనను ప్రకటించింది. దీనికోసంగా ఉపాధ్యాయుల పునర్విభజన చేపట్టింది. ఈ క్రమంలో ఉన్నత పాఠశాలల్లో కొత్తగా గ్రేడ్‌-2 హెచఎంలు, స్కూల్‌ అసిస్టెంట్‌ సబ్జెక్ట్‌ టీచర్ల పోస్టులను ప్రతిపాదించింది. ఈ మేరకు పదోన్నతుల ద్వారా ఖాళీలను భర్తీ చేసేందుకు సీనియారిటీ జాబితాను ప్రకటించి కౌన్సెలింగ్‌ చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. ప్రభుత్వ యాజమాన్యంలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఉర్దూకు ఒకరు, ఇంగ్లీ్‌షకు ఒకరి పదోన్నతి కల్పించారు. జడ్పీ యాజమాన్యంలో స్కూల్‌ అసిస్టెంట్‌ సంస్కృతం ఒకరు, ఉర్దూకు 10 మంది, ఇంగ్లీ్‌షకు 38 మందికి పదోన్నతులు కల్పించారు. మొత్తం రెండు యాజమాన్యాల్లో 51 మంది ఎస్‌జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతులు కల్పించారు. అయితే, ఏ పాఠశాలల్లో విధులు నిర్వహించాలన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి వారు పనిచేసే పాఠశాలల్లోనే విధులు నిర్వహించాలని, కొత్త మార్గదర్శకాలు వచ్చిన వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని విద్యా శాఖ అధికారులు చెప్పడం గమనార్హం.


మార్గదర్శకాలపై అయోమయం


ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) రెండు సబ్జెక్ట్‌లలో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టుకు అర్హత ఉంది. ఇప్పటి వరకు రెండు సబ్జెక్ట్‌లకు అర్హత ఉన్న వారు ఏదో ఒకటి కోరుకుంటే ఆ పోస్టుకు పదోన్నతి కల్పించేవారు. కానీ ప్రస్తుతం ఒక పోస్టుకు ప్రమోషన తిరస్కరిస్తే రెండో సబ్జెక్ట్‌ కోసం ఏడాదిపాటు ఎదురు చూడాల్సిందే. ఎవరైనా పదోన్నతి పొంది ఆ స్థానంలో చేరకపోతే వారికి ఏడాదిపాటు మధ్యలో పదోన్నతులు ఇవ్వకూడదని కొత్త ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఎయిడెడ్‌ టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమైన తేదీ నుంచే వారి సీనియారిటీని పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అడహాక్‌ పదోన్నతులను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. ముందుగా ఖాళీలను ప్రకటించకుండా పదోన్నతులు కల్పించడం ఏమిటని  ప్రశ్నిస్తున్నారు. త్వరలో జరిగే సాధారణ బదిలీల్లో ప్రభుత్వం ఎన్ని మెలికలు పెడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.


విధుల నుంచి టీచరు తొలగింపు


కొండాపురం మండలం తూర్పు బ్రాహ్మణపల్లిలో పనిచేసే ఎస్‌జీటీ వేణుగోపాల్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈవో రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం సేవించి పాఠశాలకు హాజరు కావడం తదితర కారణాలతో ఆయనపై ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. కొండాపురం ఎంఈఓ చేపట్టిన విచారణలో వాస్తవాలని నిర్ధారణ కావడంతో సదరు టీచరును విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. 

Read more