రాష్ట్రంలో దుర్మార్గపు పాలన : మాజీ ఎమ్మెల్యే బొల్లినేని

ABN , First Publish Date - 2022-02-20T03:59:30+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పేర్కొన్నారు

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన : మాజీ ఎమ్మెల్యే బొల్లినేని
విజేత జట్టుతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని, నాయకులు

ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పేర్కొన్నారు. శనివారం స్థానిక దిలావర్‌భాయ్‌వీధిలో పొన్నెబోయిన చెంచురామయ్య మెమోరియల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు ఉదయగిరిలో రూ.4.80 కోట్లతో స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపట్టానన్నారు. 70 శాతం పనులు సైతం పూర్తయ్యాయన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాని నిర్మాణానికి అడ్డుకట్ట వేసిందన్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో పాలనంతా రివర్స్‌ విధానంలో జరుగుతుందన్నారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నించివారిపై కేసులు బనాయించడం వైసీపీ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందన్నారు. తన హయాంలో ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టిన దాఖలాల్లేవన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, 2024లో ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చెంచలబాబుయాదవ్‌, రవికుమార్‌చౌదరి, మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు, నాయకులు బయ్యన్న, రియాజ్‌, బొజ్జా నరసింహులు, వెంకటస్వామి, ఓబులరెడ్డి, గయాజ్‌, సందానీ, శివకృష్ణ, కాకి ప్రసాద్‌, సాయి, ఖాదర్‌బాషా, మాబాషా తదితరులు పాల్గొన్నారు.

Read more