కిసాన్‌ క్రాఫ్ట్‌లో ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2022-12-06T23:06:23+05:30 IST

మండలంలోని ప్రభగిరిపట్నం వద్ద ఉన్న కిసాన్‌ క్రాప్ట్‌ కర్మాగారంలో అకారణంగా ఇద్దరు ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ సాటి ఉద్యోగులు మంగళవారం ఆందోళన చేశారు.

కిసాన్‌ క్రాఫ్ట్‌లో ఉద్యోగుల ఆందోళన
కిసాన్‌ క్రాఫ్ట్‌లో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

1పీడీకేఆర్‌ 6 :

పొదలకూరు, డిసెంబరు 6 : మండలంలోని ప్రభగిరిపట్నం వద్ద ఉన్న కిసాన్‌ క్రాప్ట్‌ కర్మాగారంలో అకారణంగా ఇద్దరు ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ సాటి ఉద్యోగులు మంగళవారం ఆందోళన చేశారు. పొదలకూరు మండలం ఆనాటి కండ్రిగకు చెందిన ఉమాశంకర్‌ ఏడాదిన్నర నుంచి, సంగం మండలం వెంగారెడ్డిపాలేనికి చెందిన శ్రీనాథ్‌ ఏడాది నుంచి కిసాన్‌ క్రాఫ్ట్‌లో టెక్నీషియన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. యాజమాన్యం ఎటువంటి కారణం లేకుండా ఆ ఇద్దరిని తొలగించింది. ఆ సమాచారం తెలుసుకున్న మిగిలిన సుమారు 200 మంది ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏ కారణంతో వారిని తొలగించారో చెప్పాలని నిలదీశారు. ఆ ఇద్దరి మాదిరే భవిష్యత్తులో తమనూ ఉద్యోగం నుంచి తొలగిస్తే వీధిన పడతామని, యాజమాన్యం ఇలా ఎందుకు చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో యాజమాన్యం వారితో మంతనాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు విలేఖరులతో మాట్లాడుతూ తామేమీ తప్పు చేయలేదని, అలా ఏదైనా చేసి ఉంటే తమకు చెప్పి ముందస్తు సమాచారం ఇవ్వాలని, అలాంటిదేమీ లేకుండా ఉన్నపళంగా ఉద్యోగం ఊడగొడితే ఏమి చేయాలో అర్థంకావడం లేదని వాపోయారు. ఎందుకు తొలగించారని అడిగితే ‘మాకు ఇష్టం ఇష్ట మొచ్చిన వారిని మా కంపెనీలో పెట్టుకుంటాం, మీకు సమాధానం చెప్పాలని అవసరం లేదు’ అని యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని వాపోయారు. ఇదిలా ఉండగా మీడియాను ఫ్యాక్టరీకి లోనికి కూడా అనుమతించలేదు.

Updated Date - 2022-12-06T23:06:25+05:30 IST