వైభవంగా దుర్గాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-04T04:36:53+05:30 IST

దసరా మహోత్సవాల్లో భాగంగా సోమవారం దుర్గాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

వైభవంగా దుర్గాష్టమి వేడుకలు
దుర్గాదేవి అలంకారంలో కన్యకాపరమేశ్వరి

 ఆలయాల్లో ప్రత్యేక పూజలు 


ఆత్మకూరు, అక్టోబరు 3 : దసరా మహోత్సవాల్లో భాగంగా సోమవారం దుర్గాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ అర్చకులు  శ్రీవాసవీ అష్టోత్తరములు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. శివాలయంలో అన్నపూర్ణాదేవి దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ఉత్తర బలిజవీధిలో వెలసిన జ్వాలాముఖి ఆలయంలో దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు శోభిల్లారు. తిరునాళ్లతిప్పలోని కాశీనాయన ఆశ్రమ ఆవరణలో వెలసి ఉన్న  దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీదుర్గామల్లేశ్వరి అమ్మవారు మహంకాళి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 

 

సంగం: సంగమేశ్వరాలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం దుర్గాష్టమిని పురస్కరించుకుని కామాక్షిదేవి దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాలం పద్మనాభరెడ్డి జ్ఞాపకార్థం జ్యోతమ్మ ఉభయకర్తలుగా వ్యవహరించారు. 


మనుబోలు : దసరా  శరన్నవరాత్రుల్లో  భాగంగా సోమవారం దుర్గాదేవిని మహిషాసురమర్ధినిగా అలంకరించారు. దుర్గాష్టమి రోజున భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించారు. మనుబోలుకు చెందిన దాసరి భాస్కర్‌గౌడ్‌, కోదండరామపురంలో బుడతాటి సుధాకర్‌ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.  ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.Read more