పోలీసుల జోక్యంతో వైసీపీ, టీడీపీ సవాళ్లకు తెర!

ABN , First Publish Date - 2022-09-20T04:02:22+05:30 IST

బోగోలు మండలంలో ఐదు రోజులుగా వైసీపీ, టీడీపీ మండల నేతల మధ్య జరుగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లకు పోలీసుల జోక్యంతో తెరపడింది.

పోలీసుల జోక్యంతో వైసీపీ, టీడీపీ సవాళ్లకు తెర!
టీడీపీ నేతలతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసులు

వివాదాలకు పాల్పడితే కఠిన చర్యలు : డీఎస్పీ

బిట్రగుంట, సెప్టెంబరు 19: బోగోలు మండలంలో ఐదు రోజులుగా వైసీపీ, టీడీపీ మండల నేతల మధ్య జరుగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లకు పోలీసుల జోక్యంతో తెరపడింది. ఆయా ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి, పనుల్లో అవినీతిపై ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. ఈ ఆరోపణలను రుజువు చేయాలని, అందుకు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాళ్లు విసురుకున్నారు. దీంతో టీడీపీ మండల కన్వీనర్‌ మాలేపాటి నాగేశ్వరావు బహిరంగ చర్చకు సిద్ధమని, కొండబిట్రగుంటలో వెలసిన ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వేదికగా వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, అక్కడే ప్రమాణాలు చేయాలని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అనుమతులు లేకుండా బహిరంగ చర్చలు, ప్రమాణాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని రెండు పార్టీల నాయకులకు ముందస్తు హెచ్చరికలు చేశారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  టీడీపీ, వైసీపీ మండల నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో వేర్వేరుగా ఉంచారు. అక్కడికి ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసులు, ఉదయగిరి, కలిగిరి సీఐలు గిరిబాబు, సాంబశివరావులు ఇరుపార్టీల నాయకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వివాదాలకు తెరదించారు. వివాదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. అనంతరం ఇరువర్గాల నుంచి సొంతపూచీకత్తుపై సంతకాలు సేరించి వదిలిపెట్టారు. టీడీపీ నేతల వెంట కావలి తెలుగు తమ్ముళ్లు గుత్తికొండ కిశోర్‌, జ్యోతి బాబురావు, అన్నపూర్ణ శ్రీనివాసులు, శ్రీహరినాయుడు ఉండగా, వైసీపీ నేతల వెంట కావలి ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో బోగోలు, దగదర్తి ఎస్సైలు చినబలరామయ్య,  సుమన్‌తో పాటు కావలి 1, 2వ టౌన్‌, రూరల్‌, కొండాపురం, వరికుంటపాడు, దత్తులూరు, జలదంకి ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-09-20T04:02:22+05:30 IST