దొరువు ఆక్రమణ అడ్డగింత

ABN , First Publish Date - 2022-10-12T05:02:12+05:30 IST

మండలంలోని కోడూరు పంచాయతీ బిట్‌-1 రెవెన్యూ పరిధిలో పాముదొరువు కండ్రిగలో ఉన్న ప్రభుత్వ పోరంబోకు దొరువును రొయ్యల సాగుగా మార్చేందుకు ప్రయత్నించడంతో జిల్లా అట్రాసిటీ కమిటీ సభ్యులు, స్థానిక గిరిజనులు మంగళవారం అడ్డుకున్నారు.

దొరువు ఆక్రమణ అడ్డగింత
దొరువును రొయ్యలు చెరువుగా చేస్తున్న ఎక్స్‌కవేటర్‌

తోటపల్లిగూడూరు, అక్టోబరు 11 : మండలంలోని కోడూరు పంచాయతీ బిట్‌-1 రెవెన్యూ పరిధిలో పాముదొరువు కండ్రిగలో ఉన్న ప్రభుత్వ పోరంబోకు దొరువును రొయ్యల సాగుగా మార్చేందుకు ప్రయత్నించడంతో జిల్లా అట్రాసిటీ కమిటీ సభ్యులు, స్థానిక గిరిజనులు మంగళవారం అడ్డుకున్నారు. వివరాల మేరకు పాముదొరువు కండ్రిగలో దాదాపు 50కి పైగా గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడి వారంతా తమ అవసరాల కోసం ఎప్పటి నుంచో ఈ దొరువును ఉపయోగింకుంటున్నారు. స్థానిక రైతు రంగినేని కిరణ్‌ ఈ దొరువులోని ఎకరా 10 సెంట్లను రొయ్యల గుంటలుగా  మార్చేందుకు  సోమవారం భారీ యంత్రాలతో వచ్చి పనులు ప్రారంభించాడు. స్థానిక గిరిజనులు, రైతులు ప్రతిఘటించారు.  అయినా రైతు వెనక్కి తగ్గలేదు. వారిచ్చిన సమాచారంతో అట్రాసిటీ కమిటీ సభ్యుడు కొప్పోలు రఘు, మిగతా సభ్యులు వచ్చి పనులను అడ్డుకోవడంతో ఆపేశారు. ఆక్రమణపై ఆ రైతును ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతోపాటు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారు. కలెక్టర్‌, స్థానిక తహసీల్దారు తగిన చర్య తీసుకుని పోరంబోకు దొరువును కాపాడి ఆక్రమణదారులను కట్టడి చేయాలని కోరారు.

Updated Date - 2022-10-12T05:02:12+05:30 IST