ముందంజలో జిల్లా రెడ్‌క్రాస్‌

ABN , First Publish Date - 2022-09-17T05:30:00+05:30 IST

రాష్ట్ర స్థాయిలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ ముందంజలో ఉందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు.

ముందంజలో జిల్లా రెడ్‌క్రాస్‌
కృత్రిమ అవయవాల అమరికను పరీక్షిస్తున్న కలెక్టర్‌, నేతలు

కృత్రియ అవయవాల పంపిణీలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(వైద్యం)సెప్టెంబరు 17 : రాష్ట్ర స్థాయిలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ ముందంజలో ఉందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు. శనివారం రెడ్‌క్రాస్‌లో ఎంపిక చేసిన దివ్యాంగులకు జైపూర్‌ కృత్రిమ అవయవాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  రక్తనిధి, కేన్సర్‌ ఆసుపత్రుల ద్వారా, తలసీమియా బాధిత చిన్నారులకు రెడ్‌క్రాస్‌ చేస్తున్న సేవలు నిరూపమానమన్నారు. దాదాపు 200 మంది దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు అందిం చటంతో పాటు ఫించన్లు, ఇతరత్రా పరికరాలు దివ్యాంగుల శాఖ సమన్వయంతో అందిస్తామన్నారు. ప్రతి 3నెలలకు ఒకసారి జైపూర్‌ కృత్రిమ అవయవాల శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేలకు పైగా వైద్య సేవలు అందిస్తున్నారన్నారు.  నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి సేవలు అభినందనీయమని,  కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. భారీ వర్షాల బాధితులకు సహాయ సహకారాలు అందించటంలో రెడ్‌క్రాస్‌ చేసిన సేవా అభినందనీ యమన్నారు. అనంతరం దివ్యాంగుల కృత్రిమ అవయవాల ఏర్పాటును పరీక్షించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, కమిటీ సభ్యులు దాసరి రాజేంద్రప్రసాద్‌, రవిప్రకాష్‌, వెంకటేష్‌, రంగయ్యనాయుడు. సురేష్‌కుమార్‌ జైన్‌, పెద్ద సంఖ్యలో వలంటీర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-17T05:30:00+05:30 IST