భారంగా.. దూరంగా..!

ABN , First Publish Date - 2022-04-05T06:06:37+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం ఉదయం జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వర్చువల్‌ మీటింగ్‌లో గంభీరోపణ్యాసం చేశారు.

భారంగా..  దూరంగా..!

జిల్లాలో విచ్ఛిన్న సందడి

జిల్లా నుంచి పయనమైన అధికారులు,ఉద్యోగులు 

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శాఖాధిపతులు

కందుకూరులో నిరసనలు

గూడూరు, రాపూరులలో మౌనరోదనలు


సహచరులతోపాటు ఎంతోమందితో సన్నిహిత సంబంధాలు... రేయ్‌.. మామా అంటూ కలుపుగోలుతనం.. బంధాలు, బంధుత్వాలతో ముడిపడిన బంధం.. ఇలా సుదీర్ఘకాలం ‘సింహపురి’తో మమేకమైన అధికారులు, ఉద్యోగులు ‘విచ్ఛిన్న’ పుణ్యమా జిల్లాను వీడుతున్నారు. తల్లీబిడ్డలు విడిపోయిన ఫీలింగ్‌.. భారమైన హృదయాలతో జిల్లాను వదిలి వెళ్లే ఉద్యోగులు.. కొత్త అధికారులకు స్వాగతాలు... పాత అధికారులకు వీడ్కోలు. జిల్లాల విభజనతో జరిగిన నష్టాన్ని లెక్కలు వేసుకొంటున్న ప్రజలు. నెల్లూరు నుంచి విడిపోతున్నందుకు వేదనలు.. నెల్లూరులో కలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు.. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా మూడు నియోజకవర్గాలను కోల్పోయిన నెల్లూరు జిల్లాలో సోమవారం కనిపించిన దృశ్యాలు.


నెల్లూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం ఉదయం జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వర్చువల్‌ మీటింగ్‌లో  గంభీరోపణ్యాసం చేశారు. ఆ తరువాత కలెక్టర్‌ చక్రధర్‌బాబు 38 మండలాలతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే అతి పెద్దదిగా అవతరించిందని వెల్లడించారు. అయితే ఆ సంతోషం మాత్రం జిల్లా ప్రజల్లో కనిపించలేదు. పునర్వ్యవస్థీకరణ ద్వారా జిల్లా నుంచి విడిపోయిన నియోజకవర్గాల ప్రజలతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, కోల్పోయిన ఉపాధి, ఆదాయ వనరుల గురించి లెక్కలు వేసుకొంటూ గంభీరంగా కనిపించారు. ప్రభుత్వ శాఖలన్నింటిలో విచ్ఛినం తాలూకు సందడి కనిపించింది. అన్ని శాఖల్లో 30 శాతం మందిని తిరుపతి జిల్లాకు కేటాయిస్తూ బదిలీ చేశారు. కలెక్టరేట్‌లోని 64 మంది ఉద్యోగుల్లో 22 మందిని తిరుపతికి బదిలీ ఉత్తర్వులు చేతికిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అదనపు డీఎంహెచ్‌ఓ పోస్టులను రద్దు చేసి వారిని పక్క జిల్లాలకు బదిలీ చేశారు. ఈ శాఖ పరిధిలో వివిధ కేడర్లకు చెందిన 24 మందిని తిరుపతికి బదిలీ చేశారు. సోమవారం మొత్తం జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో బదిలీల సందడే కనిపించింది. ఆర్టీసీ విషయానికి వస్తే జిల్లా ఐదు డిపోలను కోల్పోయింది. సుమారు 1500 మంది ఉద్యోగులు తిరుపతి రీజియన్‌కు కేటాయించారు. పరిశ్రమల శాఖలో ఉద్యోగులు 30శాతం మంది బదిలీ అయితే 70శాతం పరిశ్రమలు తిరుపతిలో కలిసిపోయాయి. ఆర్టీయే పరిధిలో ప్రధాన ఆదాయవనరులుగా ఉన్న తడ చెక్‌పోస్టు, గూడూరు ఆర్టీయే కార్యాలయాలు తిరుపతిలోకి వెళ్లిపోయాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది మొత్తాన్ని తిరుపతికి కేటాయించారు. జిల్లా విద్యార్థులు గురుకులాల్లో చేరాలంటే నాన్‌ లోకల్‌ కోటా కింద ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా నుంచి బదిలీ అయి వెళ్లేవారు వెళుతుంటే పలుశాఖల అధిపతులు జిల్లా అధికారులుగా బాధ్యతలు తీసుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌గా జాహ్నవి, వ్యవసాయ శాఖ జేడీగా సుధాకర్‌ రాజు బాధ్యతలు తీసుకున్నారు. 


జిల్లాల విభజన పూర్తయినా ప్రజల నిరసనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడాన్ని నిరసిస్తూ కందుకూరు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రాపూరును తిరుపతిలో కలపకుండా నెల్లూరులోనే ఉంచినందుకు, పక్కనున్న నెల్లూరు నుంచి విడదీసి తిరుపతిలో కలపడం పట్ల గూడూరు ప్రజలు మౌనంగా రోదించారు. పునర్వ్యవస్థీకరణ పేరుతో దశాబ్దాల అనుబంధాలను తెగొట్టడానికి జీర్ణించుకోలేక నాయకులు, ప్రజలు మౌన నిరసన వ్యక్తం చేశారు. 


నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహేబ్‌ విశాఖపట్నం ఆర్డీవోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నియమితులైన పి.కొండయ్య సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.


జిల్లాలోని 59 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, మినిస్ర్టీయల్‌ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిన తిరుపతికి కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కందుకూరు నుంచి జిల్లాకు 16 మందిని కేటాయించడంతో వారిలో ముగ్గురు ఎస్‌ఐలు ఎస్పీ విజయరావు వద్ద రిపోర్టు చేసుకున్నారు.

 

విద్యాశాఖలో.... 

నెల్లూరు (విద్య) : జిల్లా విద్యాశాఖలో అధికారులు, ఉద్యోగులు బదిలీ అయ్యారు. విద్యా శాఖ కార్యాలయంలో పనిచేసే 60 మంది సిబ్బందిలో 31 మందిని, ఆరు వేకెన్సీలను జిల్లాకు కేటాయించగా, 17 మందిని, ఆరు ఖాళీ పోస్టులను తిరుపతి జిల్లాకు కేటాయించారు. అసంతృప్తులు, ఆవేదనల నడుమ బదిలీ అయిన సిబ్బంది భారంగా కొత్త జిల్లాలో అడుగుపెట్టారు. జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు తిరుపతి జిల్లాలో కలవడంతో ఆ మేరకు విద్యా శాఖలో పనిచేసే 30 శాతం మంది సిబ్బందిని  కొత్త జిల్లాకు కేటాయిస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.రామారావు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఆర్‌.గ్లోరీకుమారి, డి.ఉదయ్‌కుమార్‌, సూపరింటెండెంట్లు ముగ్గురు, ఓ ఆడిటర్‌, ఏఎ్‌సఓ, ఏపీఓ, సీనియర్‌ అసిస్టెంట్‌లు 10 మంది, టైపిస్ట్‌ ఒకరు, ఏడుగూరు జూనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు అటెండర్లు, వాచ్‌మన్‌ ఒకరు కలిపి నెల్లూరు జిల్లాకు 31 మంది సిబ్బందిని, రెండు టైపిస్ట్‌ పోస్టులు, 2 అటెండర్‌ పోస్టులు, ఒక డ్రైవర్‌, ఒక స్వీపర్‌ పోస్టులను నెల్లూరుకు కేటాయించారు. అలాగే  17 మంది సిబ్బందిని తిరుపతి జిల్లాకు కేటాయించగా, 3 టైపిస్టు, రెండు అటెండర్‌, ఒక డ్రైవర్‌ పోస్టును తిరుపతి జిల్లాకు కేటాయించారు. సోమవారం వీరంతా కొత్త జిల్లాకు వెళ్లి విధుల్లో చేరారు. 


సిబ్బంది అసంతృప్తి

జిల్లా నుంచి తిరుపతికి వెళ్లిన సిబ్బందిలో అత్యధికశాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ పక్కనపెట్టి అనుకూలంగా ఉన్న సిబ్బందిని బదిలీ చేయకుండా తమను బదిలీ చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ కార్యాలయంలో కొంతమంది సిబ్బంది అధికారులను తప్పుదోవ పట్టిస్తూ తమను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసే ఓ ఉద్యోగి పదవీకాలం పూర్తయినా ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగించింది. కక్షపూరితంగానే ఆ ఉద్యోగిని తిరుపతి జిల్లాకు బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా వినతిపత్రం అందచేస్తానని ఆ ఉద్యోగిని తెలిపారు. ఇలాగే కొంతమందిని  తిరుపతికి బదిలీ చేశారని ఆరోపిస్తున్నారు. 


‘వైద్యం’లో ఎన్నో సిత్రాలో ..

నెల్లూరు (వైద్యం) : వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో మార్పులు జరిగాయి. ఏకంగా కొన్ని జిల్లా అధికారుల కేడర్‌లను రద్దు చేయడంతో అధికారులపై భారం పడింది. దీనికితోడు కొన్ని పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం ఉద్యోగులను కుదించి తిరుపతి, నెల్లూరు జిల్లాలకు కేటాయించింది. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న రెండు అదనపు డీఎంహెచ్‌వో పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. రెండు రోజుల క్రితం అదనపు డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ పద్మావతినితోపాటు స్వర్ణలతను గోధావరి జిల్లాలకు డీఎంహెచ్‌వోగా బదిలీ చేశారు.  అలాగే పీవోడీటీటీ పోస్టును కూడా రద్దు చేసి వాటి బాధ్యతలను డీఐవోకు కేటాయించారు. ఇక్కడ పనిచేస్తున్న పీవోడీటీటీని గోధావరి జిల్లాలో డీఐవోగా బదిలీ చేశారు. జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్‌కు అదనంగా  కుష్ఠు, హెచ్‌ఐవీ నియంత్రణ బాధ్యతలు అప్పగించారు. అలాగే రెండు గణాంక అధికారుల పోస్టులలో ఒకటి,  మూడు సూపరింటెంటెంట్ల పోస్టులలో ఒకటి రద్దు చేసి దాన్ని తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. క్షయ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టును రద్దు చేసి ఇక్కడున్న వైద్యుడిని కోనసీమ జిల్లాకు బదిలీ చేశారు. మలేరియా విభాగంలో  పైలేరియా విభాగాన్ని విలీనం చేశారు. మొత్తం మీద 95 మంది నెల్లూరు జిల్లాలోను, 64 మంది తిరుపతి జిల్లాకు కేటాయించారు. వీరిలో 13 మంది కాంట్రాక్టు, ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు.


25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తిరుపతికి 

జిల్లాలో ఉన్న 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 25  కేంద్రాలను తిరుపతికి బదలాయింపు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సుమారు వంద మంది వైద్యులు, సిబ్బంది కూడా తరలివెళ్లారు. అలాగే కందుకూరుతోపాటు లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాళెం మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు నెల్లూరులో కలిశాయి. 


‘సంక్షేమ’ శాఖల్లో...

నెల్లూరు (వీఆర్సీ) : జిల్లాలోని సంక్షేమ శాఖల ఉద్యోగులను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఐసీడీఎ్‌సలోని బాలల సంరక్షణ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులను పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేయడంతో  వారిలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది.  తమ గోడును ఆ శాఖ డైరెక్టర్‌కు విన్నవించుకుంటే ఫలితం ఉంటుందేమోనని ఆశగా ఉన్నారు. సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉద్యోగులు సోమవారం తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్లిపోయారు. మంగళవారం డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి సెలవు రోజు కావడంతో సోమవారమే తమ కార్యాలయాల నుంచి రిలీవ్‌ అయ్యారు.


సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీ యూ. చెన్నయ్య, కార్యాలయ సూపరింటెండెంట్‌ లూకాస్‌, జూనియర్‌ సహాయకులు ఎన్‌సీ సుధాకర్‌, సి సింధు, డీ జయకృష్ణ టైపిస్టు, ఆఫీసు సబార్డినేట్‌లు డీ హైమ, కేసీ ఓమ్‌ బహదూర్‌, పీ సురేష్‌ తిరుపతికి బదిలీ అయ్యారు.


జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా) ఐసీడీఎస్‌ పీడీ కే ఎం రోజ్‌మండ్‌ సూళ్లూరుపేట ఆర్డీవోగా బదిలీ అయ్యారు. ఏపీడీ ఉమామహేశ్వరి పీడీగా బాధ్యతలు స్వీకరించారు.  జిల్లా బాలల సంరక్షణ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, బీసీ వెల్ఫేర్‌, సాంఘిక సంక్షేమ శాఖలలో అధికారులు, ఉద్యోగులకు స్థానం చలనం జరిగింది. 


20 గురుకులాలు తిరుపతికి..

పేద విద్యార్థులకు వర ప్రసాదినిలుగా ఉన్న గురుకులాలు జిల్లాలో 44 ఉన్నాయి. వీటిలో 20వరకు తిరుపతిలో కలసిపోయాయి. 

 

రెవెన్యూలో..

నెల్లూరు (హరనాథపురం) : జిల్లాలో పలువురు తహసీల్దార్లు, స్పెషల్‌ తహసీల్దార్లు, డీటీలు,  సీనియర్‌, జూనియర్‌ సహాయకులను తిరుపతి, నెల్లూరు జిల్లాలకు కేటాయించి బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ  చేసింది. తహసీల్దార్లలో జి.వెంకటేశ్వర్లు, టి.వెంకటసునీల్‌, బి. రజనీకాంత్‌, ఎస్‌.హేమాద్రిరాజు, టి.విజయకుమార్‌ తదితరులను నెల్లూరు జిల్లాకే కేటాయించారు. ఎస్‌.చంద్రశేఖర్‌, పి.శాంతకుమారి, పి.సుబ్రహ్మణ్యం తదితరులను  తిరుపతికి బదిలీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు పి.పద్మావతి, ఎల్‌.రామమోహన్‌, కే.డానియల్‌ పీటర్‌రావు, కె గీత, బి. ప్రభావతిలను నెల్లూరు జిల్లాలోనే ఉంచారు. పి.రాజేష్‌ అనే డీటీని, ఐదుగురు సీనియర్‌ సహాయకులను తిరుపతికి, మరో 8 మందిని నెల్లూరు జిల్లాకు కేటాయించారు. జూనియర్‌ సహాయకులలో 11 మందిని నెల్లూరుకు, ఆరుగురిని తిరుపతికి కేటాయించారు. 16 మంది ఆఫీస్‌ సబార్డినేట్‌లలో ఆరుగురిని తిరుపతికి బదిలీ చేశారు. మొత్తమ్మీద అన్ని కేటగిరీలలో 64 మంది అధికారులు,  ఉద్యోగులు బదిలీ అయ్యారు.


జిల్లా ట్రెజరీలో ఏడీగా పనిచేస్తున్న వి. స్వామినాథన్‌ను పల్నాడు జిల్లా నరసారావుపేటకు, ఏటీఓ ఏ.రాజశేఖర్‌తోపాటు ఎస్‌టీఓలు పి.అనీల్‌కుమార్‌, పి.శరత్‌, ఎం.ద్రాక్షాయని, జి. రేవతి, టి.శ్రీనివాసరావు తిరుపతికి బదిలీ అయ్యారు.

  

వ్యవసాయశాఖ డిఏఓగా సుధాకర్‌రాజు

నెల్లూరు, (వ్యవసాయం) : వ్యవసాయ శాఖ జిల్లా  అధికారిగా (డీఏఓ)గా సుధాకర్‌రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌, జేసీలను మర్యాద పుర్వకంగా కలిశారు. జిల్లా వ్యవసాయశాఖ జేడీ వై.ఆనందకుమారి కోనసీమ జిల్లా వ్యవసాయ అధికారిగా బదిలీ అయ్యారు. జిల్లా హెడ్‌ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏడి ధనుంజయరెడ్డిని, జిల్లా వనరుల కేంద్రంలో ఏడీగా ఉన్న శ్రీనివాసులు తిరుపతికి బదిలీ అయ్యారు. జిల్లా వనరుల కేంద్రం (డీఆర్సీ) ప్రాజెక్టు డైరెక్టరు పి.సత్యవాణిని డీఆర్పీ ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు.

జిల్లా ఉద్యానశాఖ అధికారిగా ఎల్‌.శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆత్మకూరులో ఉన్న ఆయన నెల్లూరుకు బదిలీ అయ్యారు. నెల్లూరులో ఉన్న ప్రదీ్‌పకుమార్‌ ఆత్మకూరు సహాయ సంచాలకులుగా బదిలీ అయ్యారు. నెల్లూరు సహాయ సంచాలకుల క్యాడర్‌ను జిల్లా ఉద్యానశాఖ అధికారిగా మర్చారు.





Updated Date - 2022-04-05T06:06:37+05:30 IST