గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2022-07-05T05:38:06+05:30 IST

సరదాగా ఈతకు వెళ్లి సంగం పెన్నానది సుడిగుండాల నీటిలో చిక్కుకుని గల్లంతైన జంగాలదొరువుకు చెందిన యువకుల మృతదేహాలను

గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం

సంగం, జూలై 4: సరదాగా ఈతకు వెళ్లి సంగం పెన్నానది సుడిగుండాల నీటిలో చిక్కుకుని గల్లంతైన జంగాలదొరువుకు చెందిన యువకుల మృతదేహాలను సోమవారం ఉదయం స్కూబా ప్రో రిస్క్‌ టీమ్‌ సాయంతో వెలికి తీశారు. జంగాలదొరువు గ్రామానికి చెందిన డి శ్యామ్‌ప్రసాద్‌, గుర్రం చరణ్‌, గుర్రం భవానీప్రసాద్‌లు సంగం పెన్నానది నీటిలో గల్లంతైన విషయం విదితమే. ఆత్మకూరు ఆర్డీవో బాపిరెడ్డి, బుచ్చి సీఐ కోటేశ్వరరావు, తహసీల్దారు జయవర్థన్‌లు ఉదయాన్నే గల్లంతైన ప్రదేశం వద్దకు చేరుకున్నారు. అప్పటికే నీటిపై తేలాడుతున్న శ్యామ్‌ప్రసాద్‌ మృతదేహాన్ని గజ ఈతగాడి ద్వారా ఒడ్డుకు చేర్చారు. అనంతరం కృష్ణపట్నం నుంచి పిలిపించిన ప్రత్యేక రిస్క్‌ టీమ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. వారు ఆక్సిజన్‌ సాయం తో నీటి అడుగున గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట తరువాత నీటి అడుగున ఉన్న చరణ్‌, భవానీప్రసాద్‌ మృతదేహాలను గుర్తించి ఒడ్డుకు చేర్చారు.

మిన్నంటిన ఆర్తనాదాలు

కుమారుల మృతదేహాలను చూసిన వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువుల  ఆర్తనాదాలు మిన్నంటాయి. వారిని ఆపడం ఎవరితరం కాలేదు. పిల్లలను ఉత్నత చదువులు చదివించి గొప్ప ప్రయోజకులను చేయాలనుకున్న వారి ఆశలు ఆవిరవడంతో శోకసముద్రంలో మునిగిపోయారు. అప్పుడే నూరేళ్లు నిండాయా కొడుకా అంటూ వారి పెడుతున్న ఆర్తనాదాలు  చూపరుల కంట కన్నీరు పెట్టించాయి. మృతదేహాలకు సంగం, బుచ్చి పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెం మార్చురీకి తరలించారు. 

Read more