అమ్మకు నీరా జనం

ABN , First Publish Date - 2022-10-01T04:36:33+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆత్మకూరు పట్టణ శివాలయంలోని అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

అమ్మకు నీరా జనం
కామిరెడ్డిపాడులో దుర్గాదేవి ఆలంకరణ

వివిధ రూపాల్లో ఆదిమాత దర్శనం 


ఆత్మకూరు, సెప్టెంబరు 30 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆత్మకూరు పట్టణ  శివాలయంలోని అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి శివకుమార్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.  శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు గజలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.   అలాగే తిరునాళ్లతిప్పలోని కాశీనాయన ఆశ్రమ ఆవరణలో వెలసి ఉన్న దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కనకదుర్గాదేవి, గాయత్రీదేవీ, అన్నపూర్ణాదేవీ ప్రత్యేక అలంకరణలో  భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర బలిజవీధిలో వెలసిన జ్వాలాముఖి ఆలయంలో  ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శోభిల్లారు. కామిరెడ్డిపాడులోని దుర్గామల్లేశ్వరాలయంలో  అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. 


సంతానలక్ష్మిగా కామాక్షిదేవి

సంగం: స్థానిక సంగమేశ్వరాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం కామాక్షిదేవి సంతానలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.  కార్యక్రమానికి కాలం తిరుపతిరెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు. అదేవిధంగా గంగమ్మదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  


గజలక్ష్మి అలంకారంలో అమ్మవారు

చేజర్ల:  మండలంలోని బోడిపాడు గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి ఆలయంలోని అమ్మవారు శుక్రవారం గజలక్ష్మి అలంకారంలో ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి ఉభయకర్తలుగా నేలటూరి శ్రీనివాసులురెడ్డి, మమత దంపతులు వ్వవహరించారు. 



Updated Date - 2022-10-01T04:36:33+05:30 IST