శ్రీమాత్రే నమః..!!

ABN , First Publish Date - 2022-09-27T05:50:40+05:30 IST

జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా మొదలయ్యాయి. అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులను అనుగ్రహించారు.

శ్రీమాత్రే నమః..!!
నెల్లూరు : కలశాలతో కన్యకాపరమేశ్వరి భక్తుల ప్రదర్శన

 మొదలైన దేవీ వైభవం

ఘనంగా శరన్నవరాత్రులు

వివిధ రూపాల్లో అమ్మవార్ల కటాక్షం


జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా మొదలయ్యాయి. అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులను అనుగ్రహించారు. అన్ని ఆలయాల్లో కలశస్థాపన, అంకురారోపణ, విశేష అభిషేకాలు, పూజలు, హోమాలు జరిగాయి. కరోనా వైరస్‌ విపత్తు తొలగిన తర్వాత పూర్తిస్థాయిలో జరుగుతున్న నవరాత్రులు కావడంతో భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చారు. దేవీ నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. 

నెల్లూరులోని రాజరాజేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి రోజుకొక అలంకరణతోపాటు అష్టాదశ శక్తిపీఠాలలోని అమ్మవార్ల రూపాలను రోజుకు రెండు చొప్పున ప్రతిష్ఠిస్తున్నారు. తొలిరోజు లంకాయాం శాంకరీ దేవి, కంచి కామాక్షి దేవిని ప్రతిష్ఠించారు. రూరల్‌ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజరాజేశ్వరి అమ్మవారికి తొలిరోజు చండీ అలంకారం జరిగింది. స్టోన్‌హౌస్‌పేట వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌ ఆధ్వర్యంలో తల్పగిరి రంగనాథస్వామి ఆలయం వద్ద పెన్నా జలాలతో వాసవీ దేవి నూతన వెండి రథానికి సంప్రోక్షణ జరిగింది. 1008 మంది భక్తులు 1008 కలశాలతో పెన్నా జలాలను స్వీకరించి నగరోత్సవంగా ఆలయానికి చేరుకున్నారు. పెంచలకోనలో ఆదిలక్ష్మి అమ్మవారికి, కావలి కలుగోళ శాంభవికి ప్రత్యేక అలంకరణ, పూజలు జరిగాయి

- నెల్లూరు (సాంస్కృతికం)

 





Updated Date - 2022-09-27T05:50:40+05:30 IST