ఇంకెన్నాళ్లు!

ABN , First Publish Date - 2022-07-05T05:39:16+05:30 IST

2019, మార్చిలో తొలి కరోనా కేసు జిల్లాలో నమోదయింది. అయితే మృతుల సంఖ్య తక్కువగానే ఉంది.

ఇంకెన్నాళ్లు!

కరోనా మృతులకు పరిహారం చెల్లింపులో జాప్యం

ఇప్పటివరకు 3,337 దరఖాస్తులు 

పరిహారం చెల్లించింది 1,866 మందికే 

వివిధ కారణాలతో 167 తిరస్కరణ 

6 నెలలుగా బాధిత కుటుంబ సభ్యుల ఎదురుచూపు



వింజమూరుకు చెందిన వెంకట రామారావు గత ఏడాది సెప్టెంబరులో కరోనా బారిన పడి కోలుకోలేక మృతి చెందాడు. అలాంటి మృతులకు రూ.50 వేల నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మృతుడి పేరును కుటుంబ సభ్యులు నమోదు చేయించారు. ఇప్పటికి 8 నెలలు గడుస్తున్నా పరిహారం అందకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


అల్లూరుకు చెందిన వెంకట్రావు గతేడాది ఆగస్టులో కరోనాతో నెల్లూరులోని ప్రభుత్వం జనరల్‌ ఆసుపత్రిలోనే మృతి చెందాడు. అయితే బాధిత కుటుంబానికి నేటికి పరిహారం అందలేదు. 6 నెలలుగా పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూనే ఉన్నారు.  


నెల్లూరు నగరం బాలాజినగర్‌కు చెందిన ఓ దంపతులు గత ఏడాది అక్టోబరులో  కరోనాతో మృతి చెందారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారానికి కుటుంబ సభ్యులు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇప్పటికీ పరిహారం అందలేదు. 


కరోనా చేసిన విలయం అంతా ఇంతా కాదు.. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు కొందరైతే.. కడదాకా తోడుంటానన్న భర్తను కొందరు... భార్యను ఇంకొందరు... కన్నపేగును పోగొట్టుకున్నవారు మరికొందరు ఉన్నారు. కనీసం కడచూపునకు చూసుకోలేని దౌర్భాగ్యస్థితిని మహమ్మారి వైరస్‌ కల్పించింది. ఆప్తులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో ఉన్న వారికి సాంత్వన కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధిత కుటుంబాల్లో ఆనందం నింపింది. కరోనా బారిన పడి కోలుకోలేక మృతి చెందిన వారి కుటుంబానికి రూ.50వేల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పరిహారం కోసం ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పైసా అందలేదు.


నెల్లూరు(వైద్యం) జూలై 4 : 2019, మార్చిలో తొలి కరోనా కేసు జిల్లాలో నమోదయింది. అయితే మృతుల సంఖ్య తక్కువగానే ఉంది.  ఆ తర్వాత వైరస్‌ సెకండ్‌వేవ్‌లో కరోనా విజృంభించడంతో జనం పిట్టల్లా రాలిపోయారు. ప్రభుత్వం లెక్కల కంటే  రెండింతలకుపైగా బాధితులు మృత్యువాత పడ్డట్టు సమాచారం. కరోనా మృతులకు సంబంధించి పరిహారం కోసం 3,337 దరఖాస్తులు జిల్లా యంత్రాంగానికి చేరాయి. వీటిలో కేవలం 1866 మంది కుటుంబ సభ్యులకు మాత్రమే రూ.50 వేల పరిహారం అందించారు. మిగిలిన 1471 దరఖాస్తుదారులకు మాత్రం ఎదురుచూపులు తప్పలేదు. ఇందుకు సంబంధించి కేంద్రం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల పరిహారం చెల్లింపులో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. మరోవైపు కరోనాకు సంబంధించి దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో ఉన్నా వాటిలో 167 మాత్రం వివిధ కారణాలతో తిరస్కరించారు. అంతేగాక అనేక మంది కరోనాతో మృత్యువాతపడ్డా వారికి ఉన్న ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కారణంగా మృతి చెందినట్లు వైద్యాధికారులు నిర్ధారిస్తున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు వైద్యాధికారులు ఇలా చెబుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారితోపాటు డీసీహెచ్‌ఎ్‌స, ప్రభుత్వం వైద్య కళాశాల నుంచి మరో ఇద్దరు కమిటీ సభ్యులు ఈ దరఖాస్తును పరిశీలించడం జరుగుతుంది. అక్కడ నుంచి డీఆర్‌వో ద్వారా జేసీ పరిశీలించి తుదిజాబితాను కలెక్టర్‌ ఆమోదిస్తారు. ఈ లెక్కన 3170 మందికి నష్టపరిహారం రావాల్సి ఉండగా వందలాది మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఇదిలాఉంటే ప్రభుత్వం నుంచి పరిహారం డబ్బులు వచ్చాయని, త్వరలో ఇస్తామని జిల్లా యంత్రాంగం చెప్పడం కొసమెరుపు.


తల్లిదుండ్రులను కోల్పోయా

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయా. దిక్కులేని పరిస్థితి మాది. మా నాన్న నెల్లూరు కార్పొరేషన్‌లో ఆర్‌ఐగా పని చేసినా ఇప్పటికీ కారుణ్య నియామకం కింద ఉద్యోగం రాలేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రభుత్వ నుంచి రావాల్సిన పరిహారం కూడా అందలేదు. ఇప్పటికే తల్లిదుండ్రులకు అవసరమైన వైద్యసేవల కోసం రూ. లక్షలు అప్పు చేసాం. వాటిని ఎలా తీర్చాలో అంతుపట్టడం లేదు. 

- యశ్వంత్‌, మృతుల కుమారుడు, నెల్లూరు


అందరికీ పరిహారం అందిస్తాం 

కరోనా మృతులకు సంబంధించి అందరికీ పరిహారం అందుతుంది. మాకు చేరిన దరఖాస్తుల పరిశీలనలో కొంత జాప్యం జరగవచ్చు. అంతేగాని మరే పొరపాటు లేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ.50వేలు అందరికీ అందేలా చూస్తాం. 

- డాక్టర్‌ పెంచలయ్య, డీఎంహెచ్‌వో  

Updated Date - 2022-07-05T05:39:16+05:30 IST