-
-
Home » Andhra Pradesh » Nellore » central govrnment swascha purskhar-MRGS-AndhraPradesh
-
పాఠశాలల్లో స్వచ్ఛత ఎంత..?
ABN , First Publish Date - 2022-02-20T03:54:45+05:30 IST
పాఠశాలలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 2021-22 అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.

జిల్లాలో కేంద్ర పురస్కారానికి ఇప్పటికే 4,156 దరఖాస్తులు
ఉదయగిరి రూరల్, ఫిబ్రవరి 19: పాఠశాలలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 2021-22 అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. మార్చి నెల 20 లోగా ఆన్‌లైన్లో, యాప్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో మొత్తం 4,582 పాఠశాలలు ఉండగా ఇప్పటికే 4,156 పాఠశాలలకు దరఖాస్తు చేయగా మరో 426 పాఠశాలలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి పాఠశాల ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి. తాగునీటి వసతి, మరుగుదొడ్లు నిర్వహణ భేషుగ్గా ఉండాలి. పాఠశాలలో వసతులు ఎంత కీలకమో పురస్కారం దక్కాలంటే వాటి నిర్వహణ కూడా అంతే కీలకం. ఇలాంటి అంశాల్లో ఏ పాఠశాల అయితే మెరుగైన ప్రగతి సాధిస్తే ఆ పాఠశాలలు కేంద్ర పురస్కారం దక్కించుకోవచ్చు. అందుకు సంబంధించి తాగునీరు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణ, చేతుల శుభ్రత, చెట్ల పెంపకం తదితర అంశాలకు సంబంధించి ఫొటోలు దరఖాస్తుకు జత చేయాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ పరిశీలించి పురష్కార్‌కు ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే 90 శాతం పాఠశాలలు దరఖాస్తు చేసుకోవడాన్ని పరిశీలిస్తే ఏ పాఠశాలలో కూడా ఎలాంటి సమస్యలు లేనట్లుగా ఉంది. కానీ జిల్లాలో మనబడి నాడు-నేడు పథకం కింద 1060 పాఠశాలల్లో వసతులను మెరుగుపర్చడంతోపాటు విద్యార్థులకు శుద్ధిజలం అందజేస్తున్నారు. వీటిని మినహాయిస్తే మిగిలిన పాఠశాలల పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశం అయింది.
సద్వినియోగం చేసుకోవాలి
స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు పొందేందుకు పాఠశాల యాజమాన్యాలు సద్వినియోగం చేసుకోవాలి. పాఠశాలలో వసతులు, పరిశుభ్రత పురస్కారాల ఎంపికలో కీలకంగా మారుతుంది. ప్రతిఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి.
- షేక్ మస్తాన్‌వలి, ఇన్‌చార్జి ఎంఈవో, ఉదయగిరి
