ప్లీనరీకి పోవాలా.. బస్సులు కావాలె...!

ABN , First Publish Date - 2022-07-08T04:49:34+05:30 IST

చదువులు కన్నా తమ పార్టీ మీటింగ్‌నే ఎక్కువ అన్నట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు. శుక్ర, శనివారాల్లో గుంటూరులో జరగనున్న వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశానికి వెళ్లేందుకు బస్సులు పంపాలంటూ కొంతమంది నేతలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

ప్లీనరీకి పోవాలా..  బస్సులు కావాలె...!

వైసీపీ ప్లీనరీకి బస్సుల కోసం వేట

ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై ఒత్తిళ్లు

రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు

మహానాడుకు నై.. ఇప్పుడు సై అంటున్న ఆర్టీసీ


నెల్లూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : చదువులు కన్నా తమ పార్టీ మీటింగ్‌నే ఎక్కువ అన్నట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు. శుక్ర, శనివారాల్లో గుంటూరులో జరగనున్న వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశానికి వెళ్లేందుకు బస్సులు పంపాలంటూ కొంతమంది నేతలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై మూడు రోజులు కూడా కాలేదని, అప్పుడే బస్సులన్నీ పంపేస్తే తల్లిదండ్రుల నుంచి సమస్య వస్తుందని ఆయా యాజమాన్యాలు మొరపెట్టుకుంటున్నా నేతలు పట్టించుకోవడం లేదు. ఎలాగైనా తమకు బస్సులు ఇవ్వాల్సిందేనంటూ గొంతు మీద కత్తి పెడుతున్నారని పాఠశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో రవాణా శాఖాధికారులు కూడా రంగంలోకి దిగారు. అసలు పని వదిలి, స్వామిభక్తిని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. రవాణా శాఖ అధికారులు కూడా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారు. సాధారణంగా పాఠశాల, కళాశాల బస్సులు ఎక్కడంటే అక్కడ తిరిగేందుకు నిబంధనలు ఒప్పుకోవు. ప్రతి బస్సుకు పరిమిత పరిధిలో మాత్రమే తిరగాలని నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా 40 కిలోమీటర్లకు మించి ఆ బస్సులు వెళ్లకూడదు. ఈ నిబంధన ఉందని, బస్సులు పంపితే తర్వాత తాము ఇబ్బందులు పడాల్సి ఉంటుందని రవాణా శాఖాధికారులకు వివరిస్తున్నా పట్టించుకోవడం లేదని కొందరు యజమానులు చెబుతున్నారు. నిబంధనలన్నీ పర్యవేక్షించేది తామేనని, అవన్నీ తాము చూసుకుంటాం.. మీరు ప్లీనరీకి బస్సులు పంపండి.. అంటూ యాజమాన్యాలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. జిల్లాలో దాదాపు 600 వరకు పాఠశాలల బస్సులు ఉన్నాయి. వీటిలో కనీసం సంగం బస్సులనైనా పంపాలని ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. జిల్లా నుంచి దాదాపు 500 కిలోమీటర్లు పోను, రాను బస్సు ప్రయాణించాల్సి ఉండడంతో మధ్యలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయేమోనని ప్రైవేటు పాఠశాలల యజమానులు ఆందోళన చెందుతున్నారు.


40 ఆర్టీసీ సర్వీసులు


వైసీపీ ప్లీనరీకి ఆర్టీసీ బస్సులను కూడా ఉపయోగించనున్నారు. ఇప్పటికి అన్ని డిపోల నుంచి బస్సులను వైసీసీ నేతలు బుక్‌ చేసుకుంటున్నారు. గురువారం సాయంత్రానికి 40  బస్సులను లీజుకు తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సంఖ్య శుక్రవారానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడుకు ఆర్టీసీ బస్సులను ఇవ్వకపోవడం గమనార్హం. 

Updated Date - 2022-07-08T04:49:34+05:30 IST