భేటీ బచావో.. భేటీ పడావో ఎక్కడుంది!

ABN , First Publish Date - 2022-09-25T05:21:31+05:30 IST

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం దావెలె విమర్శించారు.

భేటీ బచావో.. భేటీ పడావో ఎక్కడుంది!
నగరంలో ఐద్వా మహిళల ప్రదర్శన

బీజేపీ పాలనలో మహిళలకు కరువైన రక్షణ

ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం దావెలె


నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 24 : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం దావెలె విమర్శించారు. శనివారం నెల్లూరులోని నర్తకి సెంటర్‌లో జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ భేటీ బచావో భేటీ పడావో అంటారని ఎక్కడ భేటీ బచావో, పడావో ఉందని ప్రశ్నించారు. గుజరాతలో అత్యాచార నిందితులను ప్రభుత్వ విడుదల చేయడంపై సుప్రీం కోర్డులో ఐద్వా కేసు వేసిందని, బాధిత మహిళల పక్షాన పోరాడతామని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, మత కలహాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పోరాటాలకు పురిటి గడ్డ అని, దూబగుంట రోశమ్మ స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చారని నేడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐద్వా పోరాటాలు చేస్తుందని వెల్లడించారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిళలకు 33 శాతం రిజర్వేషన కావాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం నిరంతరం పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారని, సీపీఎస్‌ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఈ సభలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి, తెలంగాణ ఐద్వా కార్యదర్శి వరలక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమారి, మస్తానబీ, మహిళలు పాల్గొన్నారు. కాగా, ఐద్వా మహిళలు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.Read more