‘ఆధార్‌’తో బ్యాంకు ఖాతాల్లో నిధులు మాయం

ABN , First Publish Date - 2022-02-20T03:52:13+05:30 IST

ఆధార్‌ నెంబర్‌తో ఖాతాదారులకు తెలియకుండానే వారి బ్యాంకుల ఖాతాల నుంచి నిధులు మాయం అవుతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.

‘ఆధార్‌’తో బ్యాంకు ఖాతాల్లో నిధులు మాయం

పోలీసులకు సీనియర్‌ న్యాయవాది ఫిర్యాదు

కావలి, ఫిబ్రవరి 19: ఆధార్‌ నెంబర్‌తో ఖాతాదారులకు తెలియకుండానే వారి బ్యాంకుల ఖాతాల నుంచి నిధులు మాయం అవుతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధితుడైన కావలికి చెందిన సీనియర్‌ న్యాయవాది కలికి శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు... ఆయనకు మూడు బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాలు ఉన్నాయి. ఆ ఖాతాల నుంచి సైబర్‌ నేరస్థులు మూడు రోజుల్లో రూ.42,670 కొట్టేశారు. ఈ నెల 11, 12వ తేదీల్లో యాక్సిస్‌ బ్యాంకు ఖాతా నుంచి రెండు పర్యాయాలు రూ.20వేలు డ్రా అయినట్లు పోన్‌కు మెసేజ్‌ రావడంతో ఆయన బ్యాంకు మేనేజర్‌, కస్టమర్‌ కేర్‌తో మాట్లాడి ఆ బ్యాంకు ఖాతాను బ్లాక్‌ చేయించారు. అలాగే ఎస్‌బీఐ ఖాతా నుంచి ఈ నెల 11, 13వ తేదీల్లో ఒక్కోసారి రూ.10వేల వంతున రెండు పర్యాయాలు రూ.20 వేలు తీసినట్లు ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో ఆ బ్యాంకు అకౌంట్‌ను కూడా బ్లాక్‌ చేయించారు. అలాగే 13వ తేదీన కెనరా బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.2,670 డ్రా చేసినట్లు మెసేజ్‌ రాగా ఆ ఖాతాను బ్లాక్‌ చేయించారు. ఇలా మూడు రోజుల్లో ఒక సీనియర్‌ న్యాయవాది బ్యాంకు ఖాతాల నుంచి రూ.42,670 సైబర్‌ నేరస్థులు కొట్టేయడంతో బ్యాంకులకు వెళ్లి విచారించగా ఆధార్‌నెంబర్‌ ఆధారంగా డ్రా చేసినట్లు తేలిందని శనివారం ఆయన విలేకర్లకు తెలిపారు. ఈ విషయమై  పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తన బ్యాంకు ఖాతా నుంచే కాకుండా ఇటీవల అనేక మంది బ్యాంకు ఖాతాల నుంచి సైబర్‌ నేరస్థులు డబ్బులు కొట్టేస్తున్నట్లు తెలిసిందన్నారు. బ్యాంకులకు ఆధార్‌ నెంబర్లు అనుసంధానం కారణంగానే వ్యక్తిగత గోప్యత బహిర్గతం అవుతోందన్నారు. బ్యాంకులు ఆధార్‌ నెంబరును ఖాతాలకు అనుసంధానం చేయకుండా చర్యలు తీసుకుని నగదుకు రక్షణ కల్పించాలన్నారు.


Read more