నకిలీ బంగారం తాకట్టు ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-04-25T04:32:08+05:30 IST

నకిలీ బంగారం తయారు చేసి తాకట్టు పెట్టే ముఠాను కావలి పోలీసులు ఆరెస్టు చేశారు.

నకిలీ బంగారం తాకట్టు ముఠా అరెస్టు
నిందితుల వివరాలు వెళ్లడిస్తున్న ఏఎస్పీ ప్రసాద్‌

రూ.లక్ష స్వాధీనం

కావలి రూరల్‌, ఏప్రిల్‌ 24: నకిలీ బంగారం తయారు చేసి తాకట్టు పెట్టే ముఠాను కావలి పోలీసులు ఆరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం కావలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ దేవరకొండ ప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. నెల్లూరు గుప్తాపార్కు ప్రాంతానికి చెందిన వేలమూరు మహేష్‌, మూలాపేటకు చెందిన పనబాక మధు బంధువులు. బంగారు ఆభరణాలు తయారు చేయడంలో మధుకు నైపుణ్యం ఉంది. అలాగే మహేష్‌కు స్నేహితులైన కామాటివారివీధికి చెందిన వింజమూరు హరిబాబు, డ్రైవర్స్‌ కాలనీకి చెందిన లెక్కల మణికంఠలు నకిలీ పత్రాల తయారీలో సిద్ధహస్తులు. వీరంతా ముఠాగా ఏర్పడి కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సులువుగా డబ్బు సంపాదనకు నకిలీ బంగారం తయారీని ఎంచుకున్నారు. వీరు నకిలీ బంగారం తయారుచేసి నకిలీ హోల్‌ మార్క్‌తో, నకిలీ ఆధార్‌ కార్డులు చూపి కుదువ పెట్టి నగదు సంపాదించడం వృత్తిగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో కావలి పట్టణంలోని తుమ్మలపెంట రోడ్డులో ఉన్న చంద్ర పాన్‌ బ్రోకర్స్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన, మార్చి 7వ తేదీన రెండు దఫాలుగా రెండు బంగారు చైనులు తాకట్టు పెట్టి రూ.1,12,000 తీసుకువెళ్లారు. ఆ తరువాత బంగారం తనిఖీ చేసే క్రమంలో నకిలీదిగా గుర్తించిన కుదవ వ్యాపారి చంద్రశేఖర్‌ ఈ నెల 22వ తేదీన 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ బాజిబాబు, సిబ్బంది శ్రీహరి, ఖాదర్‌ వలి, హరిబాబు కలసి ఒక టీంగా ఏర్పడి నిఘా ఉంచారు. వారిని ఆదివారం అరెస్టు చేసి వారి నుంచి లక్ష రూపాయలు, సెల్‌ఫోన్‌, ఒక బంగారు ఉంగరం, నకిలీ హోల్‌ మార్కు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు నెల్లూరులోని కాపువీధి, ఆచారివీధి, మండపాల వీధిల్లోని సుమారు 20 బంగారు షాపుల్లో నకిలీ వస్తువులు తాకట్టు పెట్టి రూ.10 లక్షలు, కావలిలో సుమారు 5 చైన్లు తాకట్టు పెట్టి  రూ.2.5 లక్షలు తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకుని కేసు ఛేదించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ బాజిబాబు, సిబ్బందిని ఏఎస్పీ ప్రసాద్‌ అభినందించారు.

Updated Date - 2022-04-25T04:32:08+05:30 IST