‘మాండస్‌’తో ఈదురు గాలులు, వాన

ABN , First Publish Date - 2022-12-09T23:07:10+05:30 IST

మాండస్‌ తుఫాను ప్రభావంతో మండలంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురి సింది. మధ్యాహ్నం ఈదురు గాలులు వీయడంతో కోవూరులో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

‘మాండస్‌’తో ఈదురు గాలులు, వాన
కోవూరులో కురుస్తున్న వర్షం

కోవూరు, డిసెంబరు9: మాండస్‌ తుఫాను ప్రభావంతో మండలంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురి సింది. మధ్యాహ్నం ఈదురు గాలులు వీయడంతో కోవూరులో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కురియడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. వరినారు దెబ్బతింటుందేమౌనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుచ్చిరెడ్డిపాళెం : మాండస్‌ తుపాను ప్రభావంతో మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జోరుగా కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 20రోజులుగా మండలంలో వరినాట్లు సాగుతున్నాయి. ఇంకొందరు రైతులు పొలాలను నాట్లకు సిద్ధం చేసుకుంటున్నారు. నారుమళ్లు, వరినాట్లు వరదలొచ్చి ముంపునకు గురౌతాయోననే ఆందోళనలో రైతులు ఉన్నారు. ఉదయం నుంచి ఓ మోస్తరు గాలులు వీస్తుండడానికి తోడు మధ్యాహ్నం నుంచి వర్షం జోరుగా కురుస్తోంది.

విడవలూరు : మాండస్‌ ప్రభావంతో మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ సముద్రం సుమారు 8 అడుగుల మేర ముందుకొచ్చింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇటీవల నాట్లు వేసిన వరిపైర్లు నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంతాల్లోని మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంత గ్రామాలైన ముదివర్తి, ఊటుకూరు, రామతీర్థం, రామచంద్రాపురం ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

వెంకటాచలం : ‘మాండస్‌’ ప్రభావం మండలంలో వేకువజాము నుంచి తీవ్రంగానే కనిపించింది. కలెక్టర్‌ చక్రధర్‌ బాబు ఆదేశాలతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు. తుఫాన్‌ కారణంగా ఓ పక్క చలి గాలులు రావడం, మరో పక్క భారీగా వర్షం కురవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి జలమ యమయ్యాయి. కొన్ని గ్రామాల్లో రోడ్లు, వీధులు చిత్తడిగా మారడంతో పాదచారులు నడిచేందుకు అవస్థలు పడ్డారు. వర్షంతో చెరువుల్లోకి నీరు భారీగా చేరి నిండుకుండలా మారాయి. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టడంతోపాటు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

మనుబోలు : శుక్రవారం వేకువ నుంచి మండలంలో ఈదురుగాలులు, చలిగాలులు ధాటికి జనం ఇళ్లలోంచి రాలేక వణికిపోయారు. కొంతసేపటికి భారీ వర్షం మొదలుకావడంతో ఈదురుగాలులు ఆగి విడతల వారీగా కుండపోత వర్షం కురిసింది. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న చెరువులు 90శాతం నిండి ఉన్నాయి. భారీ వర్షాలతో చెరువులు, కాలువలు, వాగులు మరింతగా పొంగాయి. దీంతో చెరువుల తూములను తెరచి కిందకు వదిలారు. చాలాచోట్ల వరినాట్లు నిలిచిపోగా, వర్షపునీటితో పంటపొలాలు, నారుమళ్ళు మునిగాయి. గ్రామాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురుగుకాలువలు మునిగి నీరు పోయే అవకాశం లేకపోవడంతో మనుబోలు ప్రధానరహదారిపై రెండుమార్గాల్లో నీరు నిలిచిపోయింది.

రాపూరు : రాపూరులో తుఫాన్‌ ప్రభావంతో ఉదయం నుంచి సా యంత్రం వరకూ ముసురు పట్టింది. అప్పుడప్పుడు తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రికి వాన జోరెత్తింది. పెద్ద పెద్ద చినుకులతో కూడిన వర్షం కురిసింది. గాలులు వేగంగా వీచాయి. బజారువీధి రాత్రి కాలువలా మారింది. కండలేరు జలాశయంలోకి వరద నీరు చేరుతోంది.

ఆత్మకూరు, డిసెంబరు 9 : మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి చల్లని గాలులతో మోస్తారు జల్లులు ప్రారంభమయ్యాయి. ఎలాంటి విపత్తు సంభవించినా తక్షణ చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో ఆర్డీవో, మండల కార్యాలయాల్లో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. వరినారు మళ్లు, మిరప, మినుము, పొగాకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. మెట్టప్రాంతంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ముసరు పట్టడంతో తెగుళ్ల ఉధృతి అధికమై దిడగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు తుఫాన్‌ ప్రభావం ఉండడంతో భారీ వర్షాలు కురిస్తే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందు తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. ముఖ్యంగా పెన్నానది పరివాహక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం కావాలని కోరారు. లోతట్టు ప్రాంతాల వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు.

సంగం : మండలంలో మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో మధ్యాహ్నం నుంచి గాలివాన మొదలైంది. ఉదయం కేవలం గాలి మాత్రమే వీచింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి చిన్న తుంపర్లతో వర్షం ప్రారంభమైంది. వానతోపాటు చలిగాలి వీచడంతో ప్రజలు వణికిపోయారు. కలెక్టర్‌ ఆదేశాలతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు. స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

Updated Date - 2022-12-09T23:07:12+05:30 IST