చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-09-11T05:14:22+05:30 IST

ఇద్దరు విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నెల్లూరు(క్రైం): సెప్టెంబరు 10: ఇద్దరు విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం  ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు ఎన్‌టీఆర్‌నగర్‌ ఆర్చ్‌ సెంటర్‌లో తిరుమల సురేష్‌ అలియాస్‌ మార్కెట్‌ సురేష్‌(34), శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. సురేష్‌ లారీడ్రైవర్‌. ఖాళీ సమయాల్లో కరెంట్‌పనులు చేస్తుండేవాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా ఆ పనులు మానేశాడు. అతడు ఎన్‌టీఆర్‌నగర్‌ ఆటోస్టాండ్‌ వద్ద ఈ నెల 10న టీ దుకాణం ప్రారంభించనున్న నేపథ్యంలో 8వ తేదీ రాత్రి ఎన్‌టిఆర్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ వెంకయ్య అలియాస్‌ వెంకీ, అతని అన్న మురగన్‌ లకు పార్టీ ఇచ్చాడు. అనంతరం సురేష్‌ ఇంటికి వచ్చేశాడు. కొద్ది సేపటికే వెంకీ, మురగన్‌ బైక్‌పై సురేష్‌ ఇంటికి వచ్చి మమ్మల్ని ఎందుకు అరమోడా అంటున్నావు అంటూ సురేష్‌తో గొడవకు దిగారు. అనంతరం బలవంతంగా  సురేష్‌ను బైక్‌పై ఎక్కించుకొని వారి ఇంటికి తీసుకెళ్లారు. వెంకీ చెక్కపీటతో,  మురగన్‌ కర్రతో సురేష్‌ తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో అతని తలకు తీవ్రగా యాలయ్యాయి. వెంబడిస్తూ వెళ్లిన అతని భార్య శాంతి పెద్దగా కేకలు వేయడంతో నిందితులు పరారైయ్యారు. సురేష్‌ను భార్య 108 సహాయంతో జీజీహెచ్‌లో చేర్పించింది. పరిస్థితి విషమయంగా ఉండటంతో మెడికవర్‌  ఆసుపత్రిలో చేర్పించారు.  ఈనెల 9 అర్ధరాత్రి సురేష్‌ మృతిచెందారు. సమాచారం అందుకున్న బాలాజీనగర్‌ సీఐ మధుబాబు వైద్యశాలకు చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read more