నీట్‌లో మనోళ్ల మెరుపులు

ABN , First Publish Date - 2022-09-09T08:56:45+05:30 IST

నీట్‌లో మనోళ్ల మెరుపులు

నీట్‌లో మనోళ్ల మెరుపులు

కీర్తి తేజకు 12వ ర్యాంకు

హర్షవర్థన్‌కు 25, హర్షిత్‌కు 36వ ర్యాంకులు

రాష్ట్రం నుంచి 40,344 మంది అర్హత

వారం రోజుల్లో ఏపీ ర్యాంక్‌లు విడుదల


అమరావతి, విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి), ఉండ్రాజవరం, తిరుపతి (విద్య), సెప్టెంబరు 8: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 40,344 మంది అర్హత సాధించారు. 2022-23 ఏడాదికిగానూ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ ఏడాది జూలై 17న నీట్‌ నిర్వహించింది. మొత్తం 17.64 లక్షల మంది పరీక్ష రాశారు. బుధవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. ఏపీ నుంచి 68 వేల మంది విద్యార్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 65 వేల మంది పరీక్ష రాశారు. వారిలో 40,344 మంది అర్హత సాధించారు. అయితే ఏపీ నుంచి ఈసారి ఒక్కరు కూడా టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు. తాడేపల్లిగూడేనికి చెందిన మట్టా దుర్గాసాయి కీర్తితేజ జాతీయ స్థాయిలో 12వ ర్యాంక్‌ సాధించగా.. విశాఖపట్నానికి చెందిన హర్షవర్థన్‌నాయుడు 25వ ర్యాంక్‌, చిత్తూరుకి చెందిన ఎం.హర్షిత్‌రెడ్డి 36వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. జాతీయస్థాయి ర్యాంక్‌ల జాబితా వారంలో ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి అందనుంది. ఆ తర్వాత ఏపీ ర్యాంక్‌లను విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. కాగా.. రాజస్థాన్‌కు చెందిన తనిష్క్‌ జాతీయ స్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా.. ఢిల్లీకి చెందిన ఆశిష్‌ రెండో ర్యాంక్‌ సొంతం చేసుకున్నాడు.


న్యూరాలజిస్ట్‌నవుతా:దుర్గాసాయి కీర్తి తేజ

న్యూరాలజిస్ట్‌ అయ్యి పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని నీట్‌లో ఆలిండియా 12వ ర్యాంకు సాధించిన మట్టా దుర్గాసాయికీర్తితేజ అన్నాడు.  తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన కీర్తితేజ ఇంత మంచి ర్యాంకు వస్తుందని ముందే ఊహించానన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అఽధ్యాపకుల సహకారం, యాజమాన్యం తోడ్పాటుతో ఈ ర్యాంకు సాధించానని చెప్పాడు. కీర్తితేజ తండ్రి మట్టా పరాత్పరరావు వైఎ్‌సఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. తల్లి మట్టా నాగ అంబిక ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలు.


ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరుతా..: హర్షవర్థన్‌

నీట్‌లో విశాఖకు చెందిన జి.హర్షవర్థననాయుడు ఓపెన్‌ కేటగిరీలో 25వ ర్యాంకు (ఓబీసీ కేటగిరీలో 3వ ర్యాంకు) సాధించాడు. ఆయనకు 720కి 705 మార్కులు వచ్చాయి. ఈ సందర్భంగా తాను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరతానని హర్షవర్థన్‌ చెప్పాడు. కాగా హర్షవర్థన్‌ ఏపీఈఏపీసెట్‌లో 38వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో 59వ ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి శంకరరావు వ్యాపారి. తల్లి లక్ష్మికామేశ్వరి గృహిణి. అక్క జాహ్నవి చెన్నై ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతోంది. 


కార్డియాలజిస్ట్‌ అవుతా..: హర్షిత్‌ రెడ్డి

నీట్‌ ఫలితాల్లో తిరుపతి నారాయణ విద్యాసంస్థల విద్యార్థి ఎం.హర్షిత్‌రెడ్డి 720కి 705 మార్కులు సాధించి జాతీయస్థాయి ఓపెన్‌ కేటగిరీలో 36వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పోలవరానికి చెందిన హర్షిత్‌రెడ్డి తండ్రి నరసింహ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఈ సందర్భంగా హర్షిత్‌ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచీ డాక్టర్‌ కావాలన్నది తన ఆశయమని, ఆ దిశగా ఇంటర్‌లో చేరిన తొలిరోజుల నుంచే ప్రణాళిక ప్రకారం చదివానని చెప్పాడు. స్టేట్‌ సిలబ్‌సతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు కూడా చదివానని తెలిపాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదివి కార్డియాలజిస్ట్‌ అవుతానని అన్నాడు.


Read more