గూడెంపై ‘నాటు’ విషం

ABN , First Publish Date - 2022-03-16T08:47:08+05:30 IST

రాష్ట్రంలో నాటుసారా ఎక్కువగా లేదని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) లెక్కలకు పొంతన కుదరడం లేదు. ప్రభుత్వం ఎంత దాచాలని ప్రయత్నించినా అధికారిక

గూడెంపై ‘నాటు’ విషం

దాడుల్లో భారీగా పట్టుబడుతున్న నాటుసారా

ఒక్క జంగారెడ్డిగూడెంలోనే 6,288 లీటర్లు

బయటకొచ్చిన గత ఏడాది తాగుడు లెక్క

అయినా అక్కడక్కడా సారా అంటున్న జగన్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో నాటుసారా ఎక్కువగా లేదని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) లెక్కలకు పొంతన కుదరడం లేదు. ప్రభుత్వం ఎంత దాచాలని ప్రయత్నించినా అధికారిక లెక్కలు అవన్నీ ఒట్టి మాటలేనని తేల్చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటుసారా ఏరులై పారుతోందని పట్టుబడిన సారా లెక్కలు నిరూపిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో మరణాల నేపథ్యంలో ఎస్‌ఈబీ నాటుసారా స్థావరాలపై దాడులు ముమ్మరం చేయగా వేల లీటర్లలో సారా, లక్షల లీటర్లలో సారాకు ఉపయోగించే బెల్లం ఊట పట్టుబడుతున్న విషయం వెలుగులోకి వస్తోంది. గత శనివారం ఒక్కరోజు రాష్ట్రవ్యాప్తంగా చేసిన దాడుల్లో 3722 లీటర్ల నాటుసారా పట్టుబడింది. 1,39,720 లీటర్ల బెల్లం ఊట దొరికింది. ఇక మరణాలు సంభవించిన జంగారెడ్డిగూడెం ప్రాంతాన్నే తీసుకుంటే 2021 క్యాలెండర్‌ సంవత్సరంలో 6288 లీటర్ల నాటుసారా, 2,44,950 లీటర్ల బెల్లంఊట పట్టుబడింది. ఇక పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 29,919 లీటర్ల సారా, 10,43,960 లీటర్ల బెల్లం ఊట దొరికింది.


ఇన్ని వేల లీటర్ల నాటుసారా, దానికి ఉపయోగించే పదార్థాలు దొరుకుతున్నా ప్రభుత్వం మాత్రం నాటుసారా అక్కడక్కడ మాత్రమే ఉందని, నాటుసారాపై ఉక్కుపాదం మోపామని ప్రచారం చేసుకుంటోంది. ప్రధానంగా తూర్పుగోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నాటుసారా విచ్చలవిడిగా తయారవుతోంది. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే నాటుసారా స్థావరాలు  కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం నాటుసారా లేనేలేదని చెప్పడం, మరోవైపు నాటుసారా విచ్చలవిడిగా తయారుకావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ మద్యం షాపుల విధానాన్ని తెరపైకి తెచ్చాక స్థానిక నాయకులకు మద్యంపై వచ్చే ముడుపులు పూర్తిగా స్తంభించాయి. అదే సమయంలో ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. దీంతో తొలుత ఎక్కడికక్కడ అక్రమ మద్యం వ్యాపారులు నాటుసారా స్థావరాలు స్థాపించారు. ఆ వెంటనే అందులోకి నేతలు ప్రవేశించి, వాటిని కొనసాగించేందుకు అండగా నిలుస్తున్నారని ఎప్పటినుంచో ప్రచారం సాగుతోంది. వారి అండదండలతోనే సుదీర్ఘకాలంగా నాటుసారా స్థావరాలు కొనసాగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు మరింత బలం చేకూర్చేలా ఎక్సైజ్‌ ఎంత ప్రయత్నించినా మద్యం అమ్మకాలు అనుకున్న స్థాయిలో పెరగడం లేదు. దీనికి నాటుసారాయే అడ్డంకి అని ఉన్నతాధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.


ఎలా మొదలైంది?

నాటుసారా అనేది ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. గత ప్రభుత్వాల్లోనూ నాటుసారా వినియోగంలో ఉంది. అయితే అది పరిమిత స్థాయిలో ఉండగా వైసీపీ ప్రభుత్వంలో కట్టలు తెంచుకుంది. అందుకు ప్రధాన కారణం ఏపీలో కరోనాలో పెంచిన మద్యం ధరలు. ఆ తర్వాత కొంత తగ్గించినా.. చౌకగా దొరికే నాటుసారా అప్పటికే గ్రామాల్లో పాతుకుపోయింది. దీనికితోడు ఇప్పటికీ రాష్ట్రంలో మద్యం ధరలు పక్క రాష్ర్టాలతో పోలిస్తే కొంతమేర ఎక్కువగా ఉండటం నాటుసారా ఉత్పత్తి కొనసాగడానికి కారణమవుతోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం పాపులర్‌ బ్రాండ్లను మాయం చేయడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఎవరికీ తెలియని పిచ్చి బ్రాండ్లను ప్రవేశపెట్టడంతో, డబ్బు పెట్టినా కావాల్సిన బ్రాండ్లు దొరకడం లేదనే కారణంతో మందుబాబు క్రమంగా నాటుసారావైపు వెళ్లారు. ఇలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు నాటుసారా పెరగడానికి దోహం చేశాయి.


ఎస్‌ఈబీకి సవాలక్ష పనులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మద్యం, నాటుసారాపై నిఘా కొరవడింది. ఎక్సైజ్‌ను రెండు ముక్కలు చేయడమే దీనికి ప్రధాన కారణం. గతంలో ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేకంగా మద్యం అక్రమాలపైనే పనిచేసేది. దాన్ని 30:70 నిష్పత్తిలో ఎక్సైజ్‌, ఎస్‌ఈబీలుగా విడగొట్టి ఎస్‌ఈబీకి మద్యం అక్రమాలు సహా ఇసుక, గ్యాంబ్లింగ్‌, గుట్కా లాంటి అనేక బాధ్యతలు అప్పగించారు. అందులోనూ 30శాతం యంత్రాంగం ఎక్సైజ్‌లోనే మిగిలిపోవడంతో 70శాతం ఎస్‌ఈబీకి ఇన్ని పనులు కష్టంగా మారాయి. అందులోనూ ఇసుక అక్రమాలు ఎక్కువగా ఉండటంతో నాటుసారాపై దృష్టిపెట్టే అవకాశం ఎస్‌ఈబీకి లేకుండా పోయింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న అక్రమార్కులు నాటుసారా ఉత్పత్తిని పెంచి ఏరులై పారిస్తున్నారు. 


ఎందుకింత నాటు..?

  • - జగన్‌ సర్కారు ఆవేశంగా మద్యం ధరలు ఒక్కసారిగా వందశాతం పెంచేయడంతో నాటుసారా వైపు మద్యం ప్రియులు మళ్లారు.
  • - రూ.90కి దొరికే క్వార్టర్‌ చీప్‌ లిక్కర్‌ పెరిగిన ధరలతో ఒకేసారి దాదాపు రూ.200కు చేరింది. ఫలితంగా తాగుడు తగ్గించామని ప్రభుత్వం ప్రచారం చేసుకోగా... క్వార్టర్‌ రూ. 50-60కు దొరికే నాటుసారాను మందుబాబులు తాగడం బాగా పెరిగిపోయింది. 
  • - మద్యం ధరలను తగ్గించినప్పుడు కూడా ఒకేసారి కాకుండా విడతలుగా తగ్గించడం నాటుసారా విక్రయాలను పెంచిందేగానీ తుంచలేకపోయింది,
  • - ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిచ్చి బ్రాండ్లు తాగలేక కూడా కొందరు నాటుసారాకు అలవాటుపడుతున్నారు.

Updated Date - 2022-03-16T08:47:08+05:30 IST