ntr health university name change: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై స్పందించిన నందమూరి కుటుంబం

ABN , First Publish Date - 2022-09-22T03:59:55+05:30 IST

విజయవాడలోని ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరు మార్చుతూ (ntr health university name change) ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై..

ntr health university name change: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై స్పందించిన నందమూరి కుటుంబం

హైదరాబాద్: విజయవాడలోని ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరు మార్చుతూ (ntr health university name change) ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై నందమూరి కుటుంబం (Nandamuri Family) అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామంపై స్పందిస్తూ.. నందమూరి రామకృష్ణ పేరుతో నందమూరి కుటుంబం ప్రెస్ నోట్ విడుదల చేసింది. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని ప్రెస్‌ నోట్‌లో ఎన్టీఆర్ కుటుంబం పేర్కొంది. హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని, 1986లో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీని స్థాపించారని నందమూరి కుటుంబం గుర్తుచేసింది. నాడు ప్రజలు, పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారని.. అప్పటి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారని తెలిపింది.


వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద గౌరవంతో 'డాక్టర్'.ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేశారని, ఆ పేరును‌ నేడు జగన్ మార్చడం దురదృష్టకరమని నందమూరి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ పేరును తొలగించటం తెలుగు జాతిని అవమానించినట్లేనని, హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని నందమూరి కుటుంబం డిమాండ్ చేసింది.



హెల్త్‌ వర్సిటీ పేరు కథ..

వైద్య విద్యార్థులకు అప్పట్లో ఏపీలో ప్రత్యేక వర్సిటీ లేదు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలే వైద్య విద్యార్థులకు గుర్తింపు ఇచ్చేవి. ఈ క్రమంలో అనేక అక్రమాలు జరిగేవి. తగిన పర్యవేక్షణ ఉండేది కాదు. ఆయా వర్సిటీల పేరుతో నకిలీ ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో.. వైద్య విద్యలో నాణ్యత పెంచి, పర్యవేక్షణ, నియంత్రణ సాధించేందుకు ఒక స్వయంప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థ ఉండాలని ఎన్టీఆర్‌ భావించారు. ప్రత్యేకంగా... హెల్త్‌ వర్సిటీని ఎన్టీఆర్‌ ప్రారంభించారు. అప్పట్లో అన్ని సంస్థలూ హైదరాబాద్‌ కేంద్రంగానే ఏర్పడి పని చేసేవి. కానీ, తెలంగాణతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికీ చేరువలో ఉండేలా... విజయవాడలో హెల్త్‌ వర్సిటీ ఏర్పాటు చేయాలని 1983లో నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మూడేళ్లకు... 1986 ఏప్రిల్‌లో వర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే ఏడాది నవంబరు 1 నుంచి అడ్మిషన్లు స్వీకరించడం మొదలైంది. అప్పట్లో దీనికి తొలుత పెట్టిన పేరు యునివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌. 


1998 ఫిబ్రవరిలో, అంటే ఎన్టీఆర్‌ చనిపోయిన రెండేళ్లకు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని ప్రతిపాదించారు. ఎన్టీఆర్‌ చొరవతో ఏర్పడిన విశ్వవిద్యాలయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం 1998లో యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌సగా ఉన్న పేరును ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా మార్చుతూ వర్సిటీ యాక్ట్‌ను సవరించారు. అనంతరం కొన్ని రోజులకు ప్రస్తుతం అంతా పిలుచుకుంటున్న డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా టీడీపీ ప్రభుత్వం పేరు మార్చింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును తొలగించి.. వైఎస్సార్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు (సెప్టెంబర్ 21, 2022) డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చుతూ ఏపీ ప్రభుత్వం శాసనసభలో తీసుకొచ్చిన బిల్లుకు ఆమోద ముద్ర పడింది.

Updated Date - 2022-09-22T03:59:55+05:30 IST