కంటోన్మెంట్‌ రోడ్లకు సమరయోధులు, అమర జవాన్ల పేర్లు

ABN , First Publish Date - 2022-01-03T08:40:11+05:30 IST

కంటోన్మెంట్‌ రోడ్లకు సమరయోధులు, అమర జవాన్ల పేర్లు

కంటోన్మెంట్‌ రోడ్లకు సమరయోధులు, అమర జవాన్ల పేర్లు

  • బ్రిటిషర్ల పేర్ల మార్పునకు రంగం సిద్ధం..
  • 20-25 రోడ్లు గుర్తించిన అధికారులు


సికింద్రాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఏళ్ల తరబడి బ్రిటిషర్ల పేరిట కొనసాగుతున్న రోడ్ల పేర్ల మార్పునకు రంగం సిద్ధమైంది. ఆయా రోడ్లకు స్వాతంత్య్ర సమరయోధులు, యుద్ధాల్లో అమరులైన ఆర్మీ అధికారులు, జవాన్ల పేర్లను పెట్టనున్నారు. గత నెల 17న జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు సమావేశంలో బ్రిగేడియర్‌ అభిజిత్‌ చంద్ర ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించగా.. అధికారులు పేర్లమార్పు కోసం 20-25 రోడ్లను గుర్తించినట్లు తెలిసింది. నిజానికి కంటోన్మెంట్‌లో 2017లో మొట్టమొదటి సారి నికోల్సన్‌ రోడ్డు పేరును అరుణ్‌ ఖేతర్‌పాల్‌ రోడ్డుగా మార్చారు. ఆ తర్వాత పేర్లమార్పుపై పలువర్గాల నుంచి ప్రతిపాదనలు, డిమాండ్లు వచ్చినా.. అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై చకచకా చర్యలు సాగుతున్నాయి.


ఈ అంశంపై కొద్ది రోజుల క్రితం కేంద్ర రక్షణశాఖ విస్తృత చర్చలు జరిపింది. దేశంలోని 65 కంటోన్మెంట్లలో ఉన్న రోడ్లకు పేర్లు మార్చాలని తీర్మానించింది. ఆ మేరకు రక్షణశాఖ నుంచి ఢిల్లీలోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌(డీజీడీఈ)కి ఆదేశాలు వెళ్లాయి. డీజీడీఈ నుంచి ప్రతిపాదనలు పంపాలంటూ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అధ్యక్షుడు బ్రిగేడియర్‌ అభిజిత్‌ చంద్ర, సీఈవో బి.అజిత్‌రెడ్డికి గత నెల ఆదేశాలు అందాయి. దాంతో ఎస్టేట్స్‌ విభాగం అధికారులు బ్రిటిషర్ల పేర్లతో ఉన్న రోడ్ల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలో వెల్లింగ్టన్‌, మార్నింగ్టన్‌, గాఫ్‌, రాబర్ట్‌, హిస్‌లాప్‌, ఆమ్‌హర్స్ట్‌, స్టీవర్డ్‌, బటన్‌.. ఇలా పాతిక దాకా రోడ్లు ఉన్నట్లు సమాచారం. కేంద్రం ఆమోదముద్ర వేయగానే.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఈ రోడ్ల పేర్లను మారుస్తారు.


కత్తిమీద సామేనా?

కంటోన్మెంట్‌ రోడ్ల పేర్ల మార్పు అధికారులకు ఒక విధంగా కత్తిమీద సాముగా కనిపిస్తోంది. కంటోన్మెంట్‌ చట్టం-2021 ప్రకారం కీలక నిర్ణయాల అమలు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయం కుదురుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పైగా.. హైదరాబాద్‌ రాష్ట్రం నిజాం వ్యతిరేక పోరాటాలకు, తెలంగాణ సాయుధ పోరాటాలకు నిలయం. అలాంటప్పుడు.. సాయుధ పోరాట యోధులైన దాశరథి కృష్ణమాచార్య, కొండా లక్ష్మణ్‌ బాపూజీ వంటి వారి పేర్లను పరిగణనలోకి తీసుకుంటారా? అనేది చర్చనీయాంశమైంది. ఇక అమర జవాన్ల జాబితా కూడా పెద్దగానే ఉంది. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన ఆచార్య పద్మపాణితోపాటు.. ఇండో-పాక్‌, ఇండో-చైనా యుద్ధాల్లో అమరులు కూడా ఉన్నారు. తాజాగా లద్దాఖ్‌లో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో అమరుడైన సంతో్‌షబాబు వంటి వారు ఉన్నారు. అలాంటప్పుడు 20-25 పేర్లను గుర్తించడం అధికారులకు కొంత ఇబ్బందికర పరిణామమే..!

Updated Date - 2022-01-03T08:40:11+05:30 IST