అవినాశ్‌ రెడ్డి పిలుస్తున్నారు తోట దగ్గరికి రా!

ABN , First Publish Date - 2022-02-23T07:55:18+05:30 IST

‘‘పదెకరాలా... ఇరవై ఎకరాలా? ఎంత భూమి కావాలి! ఎంత డబ్బు కావాలి! నేను ఇప్పిస్తా! మెజిస్ర్టేట్‌ ముందు ఏం చెప్పావో ఆ వివరాలన్నీ మాకు చెప్పు’’... అప్రూవర్‌గా మారిన దస్తగిరికి అందిన భారీ ‘ఆఫర్‌’ ఇది!

అవినాశ్‌ రెడ్డి పిలుస్తున్నారు తోట దగ్గరికి రా!

  • పొలమా.. డబ్బులా.. ఎంత కావాలో చెప్పు
  • వాంగ్మూలంలో ఏం చెప్పావో మాకు తెలియాలి
  • అప్రూవర్‌ దస్తగిరికి భరత్‌ యాదవ్‌ ఆఫర్‌
  • పలుమార్లు దస్తగిరి నివాసానికి భరత్‌
  • గంగిరెడ్డితో, అవినాశ్‌తో మాట్లాడాలని ఒత్తిడి
  • సెప్టెంబరు 30న సీబీఐకి దస్తగిరి ఫిర్యాదు
  • నాకు భద్రత కల్పించండి.. దస్తగిరి విన్నపం
  • హత్య కేసు కడప సెషన్స్‌ కోర్టుకు బదిలీ

కడప, ఫిబ్రవరి 22 (ఆంధ్ర‌జ్యోతి): ‘‘పదెకరాలా... ఇరవై ఎకరాలా? ఎంత భూమి కావాలి! ఎంత డబ్బు కావాలి! నేను ఇప్పిస్తా! మెజిస్ర్టేట్‌ ముందు ఏం చెప్పావో ఆ వివరాలన్నీ మాకు చెప్పు’’... అప్రూవర్‌గా మారిన దస్తగిరికి అందిన భారీ ‘ఆఫర్‌’ ఇది! ఇదే కేసులో నిందితుడైన సునీల్‌ యాదవ్‌ బంధువు భరత్‌ యాదవ్‌... పలుమార్లు దస్తగిరిని కలిశారు. ‘వాంగ్మూలంలో ఏం చెప్పావ్‌’ అని అడిగారు. అంతేకాదు... కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డితో మాట్లాడాలి, తోటవద్దకు రా... అని కూడా ఒకసారి పిలిచారు. ఈ పరిణామాలతో దస్తగిరి ఆందోళనకు గురయ్యారు. మొత్తంవివరాలతో గత ఏడాది సెప్టెంబరు 30న సీబీఐ ఎస్పీకి లేఖ రాశారు. ఆ లేఖతోపాటు వాచ్‌మ్యాన్‌ రంగన్న, హార్డ్‌వేర్‌ షాప్‌ యజమాని కృష్ణమాచారి ఇచ్చిన వాంగ్మూల ప్రతులు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఈ కేసులోని నిందితులు కోర్టు ద్వారానే వీటిని పొందారు. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారగానే... నిందితులతోపాటు, పలువురు పెద్దల గుండెల్లో దడ మొదలైంది. ఆగస్టు 30వ తేదీన దస్తగిరి ప్రొద్దుటూరులో మేజిస్ట్రేట్‌ ముందు తొలి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే... నిందితుల్లో టెన్షన్‌ మొదలైంది. ఆ వివరాలను దస్తగిరి నుంచే రాబట్టాలని ప్రయత్నించారు. రకరకాలుగా ప్రలోభాలకు గురి చేశారు. దీనిపై సీబీఐకి దస్తగిరి రాసిన లేఖ ప్రకారం... 


వాంగ్మూలం ఇచ్చిన రోజు నుంచే...

గత ఏడాది ఆగస్టు 30వ తేదీన దస్తగిరి ప్రొద్దుటూరు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చి... ఇంటికి చేరుకున్నారు. భరత్‌యాదవ్‌ అక్కడికి వచ్చి... ‘మనం శంకర్‌రెడ్డి (దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి)ని కలవాలి’ అన్నాడు. అందుకు దస్తగిరి ‘సరే’ అన్నారు. ఆ తర్వాత మరో రోజు ఉదయం 5.30 గంటలకు దస్తగిరి ఇంటికి భరత్‌ వచ్చారు. ‘‘అవినాశ్‌రెడ్డి పిలుస్తున్నాడు.  నీవు తోటకాడికి రా’’ అన్నారు. అయితే... తాను సీబీఐ అధికారుల దగ్గరికి వెళ్తున్నానని, ఎక్కడికీ రాలేనని దస్తగిరి బదులిచ్చారు. ఇంకోరోజు భరత్‌యాదవ్‌ ఫోన్‌ చేసి, ‘‘మా ఇంటి వెనకాల ఉన్న హెలిప్యాడ్‌ దగ్గరికి రా’’ అని దస్తగిరిని పిలిచారు. అక్కడికి వెళ్లేసరికి భరత్‌తోపాటు ఓబులరెడ్డి అనే న్యాయవాది కూడా ఉన్నారు. ‘‘వైఎస్‌ భాస్కర్‌రెడ్డి (ఎంపీ అవినాశ్‌ తండ్రి), శంకర్‌ రెడ్డి వాళ్లు నీతో మాట్లాడమని పంపించారు. నువ్వు మేజిస్ట్రేట్‌ ముందు ఏమి చెప్పావో మాకు చెప్పు. నీకు ఏమి కావాలో.. ఇంత ఇవ్వాలో అడుగు. 10-20 ఎకరాల భూమి కానీ, ఎంత డబ్బైనా ఇప్పిస్తాం’’ అన్నారు.


ఏ అవసరమున్నా తనను కలవాలని భరత్‌ సూచించారు. ఆ తర్వాత భరత్‌ యాదవ్‌ ఇంకోసారి దస్తగిరి ఇంటికి వచ్చారు. ‘‘నీకు డబ్బు అవసరమైతే చెప్పు. వాళ్లను అడిగి రెండు మూడు లక్షలు తీసుకొస్తా’’ అని చెప్పారు. భరత్‌ యాదవ్‌ తనను గమనిస్తూ, అనుసరిస్తున్నారని దస్తగిరి సీబీఐకి రాసిన లేఖలో తెలిపారు. ‘‘నా దగ్గర ఇన్ఫర్మేషన్‌ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బయపురెడ్డిని సీబీఐ వాళ్లు ఎంక్వయిరీకి పిలిచిన తర్వాత భరత్‌ యాదవ్‌ మా ఇంటి వద్దకు వచ్చాడు.  నువ్వు ఒకసారి బయపురెడ్డిని కలవాలంట అన్నాడు.  మాఇంటి వద్దకు వచ్చి నేను ఎక్కడికి వెళ్లానో చెప్పాలని నా భార్యను అడుగుతున్నారు’’ అని దస్తగిరి వివరించారు. 

Read more