రాష్ర్టాన్ని శ్మశానంగా మార్చే దిశగా అడుగులు

ABN , First Publish Date - 2022-08-31T09:15:55+05:30 IST

‘తెలంగాణకు కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకముందు మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ వాసులు ముంబై, సూరత్‌లకు వలస వెళ్లేవారు. ఇప్పుడు ఏపీ

రాష్ర్టాన్ని శ్మశానంగా మార్చే దిశగా అడుగులు

ఉద్యోగులపై ఉక్కుపాదం దారుణం: ఎంపీ రఘురామ


న్యూఢిల్లీ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి) : ‘తెలంగాణకు కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకముందు మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ వాసులు ముంబై, సూరత్‌లకు వలస వెళ్లేవారు. ఇప్పుడు ఏపీ ప్రజలు తెలంగాణకు వలస వెళ్తున్నారు. ఆంధ్రాను శ్మశానంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామేమో’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన రఘురామ.. రాష్ట్ర ప్రజలంతా నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధార్మిక పరిషత్‌ విషయంలోనూ కోర్టుకు వెళ్లి న్యాయాన్ని పొందాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.


విగ్రహాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధించడం గురించి తాను మాట్లాడిన తర్వాత, బీజేపీ నాయకులు కూడా స్వరం పెంచారని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఉక్కు పాదం మోపాలని చూడడం దారుణమని, ఉపాధ్యాయులపై దురాగతాలకు పాల్పడుతోందని రఘురమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ నెరవేర్చాలని అడిగితే.. ఈ రకమైన వేధింపులు ఎందుకని ప్రశ్నించారు. సీపీఎస్‌ రద్దు, సంపూర్ణ మధ్య నిషేధం వంటి హామీలను అమలు చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ సానుభూతిపరులు వాసిరెడ్డి కృష్ణారావు, సునీత దంపతుల హత్య ఘటనకు వైసీపీ సోషల్‌ మీడియా ఉన్మాదులే కారణమా? అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అప్పులపై వడ్డీలకే సరిపోతోందని, అందువల్లే ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌, మరో అధికారి విజయ్‌పాల్‌ తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై న్యాయం కోరుతూ తన కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌ కోర్టులో లిస్ట్‌ అయిందని, ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.


రాష్ట్రంలోని ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు తమ హక్కుల గురించి మాట్లాడాలని రఘురామ సూచించారు. 12మంది సీనియర్‌ ఐపీఎ్‌సలను కాదని తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి తాత్కాలిక డీజీపీ హోదాను జగన్‌ కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు మాట్లాడడం లేదన్నారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకోలేని అధికారులు... ఇక ప్రజల సమస్యలను ఏమి పరిష్కరిస్తారని ప్రశ్నించారు.

Updated Date - 2022-08-31T09:15:55+05:30 IST