ఎంపీ మాధవ్‌.. గోబ్యాక్‌

ABN , First Publish Date - 2022-08-16T07:55:52+05:30 IST

నగ్న వీడియో కాల్‌ వ్యవహారం బయటపడ్డాక తొలిసారి..

ఎంపీ మాధవ్‌.. గోబ్యాక్‌

  • హిందూపురంలో ఎంపీకి చుక్కెదురు..
  • అడుగడుగునా అడ్డుకున్న టీడీపీ నేతలు
  • వైసీపీ నేతలకు సహకరించిన పోలీసులు
  • టీడీపీ శ్రేణులపై ఉక్కుపాదం.. తీవ్ర ఉద్రిక్తత


హిందూపురం, ఆగస్టు 15: నగ్న వీడియో కాల్‌ వ్యవహారం బయటపడ్డాక తొలిసారి.. సోమవారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి వచ్చిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డుకున్నారు. ‘మాధవ్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే, టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని స్టేషన్లకు తరలించారు. దీంతో రోజంతా హిందూపురం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూపురం మండలంలోని చౌళూరులో జెండా ఆవిష్కరణకు వెళ్తున్న ఎంపీ వాహనానికి పట్టణంలోని చిన్నమార్కెట్‌ వద్ద టీడీపీ పట్టణ కన్వీనర్‌ రమేశ్‌, కౌన్సిలర్‌ రాఘవేంద్ర, నవీన్‌, చంద్ర, మురళి, శ్రీనివాసరెడ్డి తదితరులు అడ్డుపడ్డారు. 


ఎంపీ వెంట వస్తున్న పోలీసులు అప్రమత్తమై.. టీడీపీ నాయకులను పక్కకు తోసేసి కాన్వాయ్‌ని పంపించేశారు. ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌తో కలిసి ఎంపీ హిందూపురం మండలంలోని చౌళూరుకు వెళ్లి, అక్కడ జెండాను ఆవిష్కరించారు. చెరువుకు జలహారతి ఇచ్చి, హిందూపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే  టీడీపీ నాయకులు సంతేబిదునూరు గేటు వద్దకు చేరుకున్నారు. ఎంపీ మాధవ్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు వేచి ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని, పరిస్థితిని గమనించి, మాధవ్‌ను కొంత ఆలస్యంగా రావాలని సూచించారు. వైసీపీ నాయకులు కొంతమంది సంతేబిదునూరు గేటు వద్దకు చేరుకున్నారు. టీడీపీ నాయకులు.. ‘గోరంట్ల మాధవ్‌ డౌన్‌డౌన్‌’ అని నినాదాలు చేశారు. ‘ఏ మొహం పెట్టుకుని హిందూపురానికి వచ్చావం’టూ నిలదీశారు. ఇదే సమయంలో అక్కడున్న వైసీపీ నాయకులు మాధవ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు టీడీపీ నాయకులను వాహనాల్లో అక్కడ నుంచి తరలించారు. తర్వాత మాధవ్‌ వాహనం వెళ్లిపోయింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మ, పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోరంట్ల మాధవ్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Read more