జాతి అభివృద్ధి నిర్మాణంలో శ్రామిక శక్తిదే ప్రధాన పాత్ర: మోదీ

ABN , First Publish Date - 2022-08-26T01:39:25+05:30 IST

భారత్‌ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర

జాతి అభివృద్ధి నిర్మాణంలో శ్రామిక శక్తిదే ప్రధాన పాత్ర: మోదీ

తిరుపతి: భారత్‌ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కొనియాడారు. ఈ రకమైన ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమం కోసం నిరంతరంగా పనిచేస్తోందన్నారు. గురువారం సాయంత్రం తిరుపతి (Tirupati) వేదికగా జరిగిన జాతీయ కార్మిక సదస్సును ఆయన ఢిల్లీ (Delhi) నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎస్‌.హెచ్‌ భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాల కార్మిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కార్మిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సదస్సునుద్దేశించి మోదీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన వంటి పథకాలు కోట్లాదిమంది కార్మికులకు ఎంతోకొంత రక్షణను, భద్రతను కల్పిస్తున్నాయన్నారు. దేశాభివృద్ధికి కార్మికులు చేస్తున్న కృషి, అందిస్తున్న తోడ్పాటుకు గుర్తింపు ఈ పథకాలని మోదీ అభివర్ణించారు. 


దేశం కార్మికులకు అవసరమైన సందర్భంలో మద్దతుగా నిలిచిందని, అదే సమయంలో కరోనా సంక్షోభం నుంచీ దేశాన్ని గట్టెక్కించేందకు కార్మికులు తమ పూర్తి శక్తియుక్తులను వెచ్చించారన్నారు. దాని ఫలితంగానే నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మరోసారి ఆవిర్భవించిందన్నారు. ఈ ఘనత అధికశాతం కార్మికులకే దక్కుతుందన్నారు. కార్మిక శక్తికి భద్రత కల్పించడంలో ఇ-శ్రమ్‌ పోర్టల్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఏడాది కాలంలోనే దేశంలోని 400 ప్రాంతాలకు చెందిన 28 కోట్లమంది కార్మికులు పోర్టల్‌లో నమోదయ్యారన్నారు. ఇది ప్రత్యేకించి భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, గృహ పనివారికి బాగా మేలు చేసిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పోర్టళ్ళను ఇ-శ్రమ్‌ పోర్టల్‌తో అనుసంధానించుకోవాలని రాష్ట్రాల కార్మిక శాఖా మంత్రులను ఈ సందర్భంగా ప్రధాని అభ్యర్థించారు. బానిస మనస్తత్వాన్ని ప్రతిబించించే ఒకనాటి కార్మిక చట్టాలను రద్దు చేయడంలో గత ఎనిమిదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం గొప్ప చొరవ చూపిందని మోదీ తెలిపారు. 

Read more