ఇక మొబైల్‌ రికవరీ ఈజీ

ABN , First Publish Date - 2022-09-19T10:03:00+05:30 IST

ఒకప్పుడు మొబైల్‌ అవసరం.. నేడు అత్యవసరం! ఆ ఫోన్‌ చోరీకి గురైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అదృష్టం ఉంటే దొరుకుతుంది.. లేదంటే లేదని అనుకుంటాం. కానీ ఫోన్‌ దొరకలేదన్న బాధ మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.

ఇక మొబైల్‌ రికవరీ ఈజీ

అందుబాటులోకి లాస్డ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సర్వీస్‌


కర్నూలు, సెప్టెంబరు 18: ఒకప్పుడు మొబైల్‌ అవసరం.. నేడు అత్యవసరం! ఆ ఫోన్‌ చోరీకి గురైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అదృష్టం ఉంటే దొరుకుతుంది.. లేదంటే లేదని అనుకుంటాం. కానీ ఫోన్‌ దొరకలేదన్న బాధ మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఇకపై అలా చింతించాల్సిన పనిలేదని కర్నూలు ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ అంటున్నారు. కర్నూలు జిల్లాలో ‘లాస్డ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సర్వీస్‌’ అనే వినూత్న సేవకు శ్రీకారం చుట్టిన ఆయన ఫోన్‌ పోయిందని ఫిర్యాదు అందిన నెలరోజుల్లోగా దాన్ని వెతికి పట్టుకుని బాధితులకు అప్పగిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా పోలీసులు 564 మొబైల్‌ ఫోన్లు ఒకేసారి రికవరీ చేశారు. స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పరేడ్‌ గ్రౌండులో ఆదివారం మొబైల్‌ రికవరీ మేళా ఏర్పాటు చేసి బాధితులకు ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ మాట్లాడుతూ.. ‘ఇక మీదట మీరు పోగొట్టుకున్న సెల్‌ ఫోన్‌ను కనిపెట్టే బాధ్యత మాది. ఎలాంటి రుసుము వసూలు చేయకుండానే ఫోన్‌ రికవరీ చేసి అప్పగిస్తాం’ అని అన్నారు.


ఇది ఎలా పని చేస్తుందంటే..

కర్నూల్‌పోలీ్‌స.ఇన్‌ అనే వెబ్‌సైట్‌కి వెళ్లి లాస్డ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సర్వీస్‌ లింక్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో మీ పేరు, అడ్రస్‌ వివరాలతోపాటు మీ మొబైల్‌ పోయిన తేదీ, ప్రదేశం, ఫోన్‌ నంబర్‌, ఐఎంఈఐ నంబర్‌ తదితర వివరాలు ఎంటర్‌ చేయాలి. జిల్లాలోని ఏ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఫోన్‌ పోయిందో అందులో పొందుపర్చాలి. ఆ వివరాల ఆధారంగా మిగిలిన పని పోలీసులు చూసుకుంటారు. మీ మొబైల్‌ను ట్రాక్‌ చేసి నెల రోజుల్లో ఫోన్‌ను రికవరీ చేసి ఆ సమాచారం మీకు అందిస్తారు. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న, చోరీకి గురైనవారు మీసేవ, సచివాలయాలకు వెళ్లి ఇలాంటి సేవలు వినియోగించుకోవచ్చు.

Read more