మేనిఫెస్టోను మడతేశారు!

ABN , First Publish Date - 2022-07-31T08:04:01+05:30 IST

ఎన్నికల మేనిఫెస్టోపై వైసీపీ నేతలు నాలుకను అడ్డంగా మడతేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రులందరూ అదే బాటన నడుస్తున్నారు. తాజాగా మద్య నిషేధంపై సాక్షాత్తు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మరోసారి మేనిఫెస్టోను మడతపెట్టేశారు.

మేనిఫెస్టోను మడతేశారు!

మేనిఫెస్టోలో మద్య నిషేధమే లేదన్న మంత్రి అమర్‌

ధరలు స్టార్‌ హోటల్‌ స్థాయిలో పెంచి సామాన్యులకు దూరం చేస్తామని మాత్రమే చెప్పాం 

ఇదీ మంత్రి అమర్‌నాథ్‌ మాట..

ఎన్నికల ముందు, ఆ తర్వాత జగన్‌ చెప్పినదంతా తూచ్‌ 

అధికారంలోకి రాగానే నాలిక మడతపెట్టుడు షురూ..

షరా మామూలుగా బుకాయింపులు 


‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తాం’’

.... ఇదీ మేనిఫెస్టోలో వైసీపీ ఇచ్చిన వాగ్దానం అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఇప్పుడీ వాగ్దానం అటకెక్కింది. అసలు మా మేనిఫెస్టోలో మద్య నిషేధమే లేదని సాక్షాత్తూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బుకాయించేశారు. దీనిపై ఇప్పుడు దుమారం రేగుతోంది. భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా ప్రకటించుకున్న మేనిఫెస్టోను వైసీపీ నేతలే మడత పెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల మేనిఫెస్టోపై వైసీపీ నేతలు నాలుకను అడ్డంగా మడతేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రులందరూ అదే బాటన నడుస్తున్నారు. తాజాగా మద్య నిషేధంపై సాక్షాత్తు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మరోసారి మేనిఫెస్టోను మడతపెట్టేశారు. శనివారం విశాఖపట్నంలో మంత్రి మాట్లాడుతూ.. ‘‘మా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధమనే మాటే లేదు. మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఏదైనా చేయలేదంటే మీరు క్వశ్చన్‌ చేయండి. మేనిఫెస్టోలో మేం చెప్పిన మాట మద్యం రేట్లు పైవ్‌స్టార్‌ రేట్లకు మించి పెడతాం. ఎవరన్నా ముట్టుకుంటే షాక్‌ కొట్టే పరిస్థితి తీసుకొస్తాం అనే చెప్పాం. ఏ గవర్నమెంట్‌ ఆఫీసుకెళ్లినా మా మేనిఫెస్టో గోడలపై ఉంటుంది. దాన్ని చూసుకోండి... అందులో పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఉంటే మేం ఒప్పుకుంటాం’’ అని వ్యాఖ్యలు చేశారు. ఒక మంత్రి అడ్డగోలుగా ఇలా బుకాయించడం ఒక్క వైసీపీలోనే సాధ్యమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు మద్య నిషేధంపై వైఎస్‌ జగన్‌ తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కూడా మంత్రివర్యులు ఇలా బుకాయించడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 


దశలవారీ నియంత్రణ ఏమైందో? 

వైసీపీ మేనిఫెస్టోలో నవరత్నాల పథకాలతో పాటు మద్యపాన నిషేధం చేస్తామంటూ.... లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషంగా ప్రకటించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో మద్యపాన నిషేధంపై జగన్‌ మాట్లాడుతూ ‘‘దశల వారీగా మద్య నియంత్రణ చేపడతాం. ఒక్కటేసారి మద్యం ఆదాయాన్ని పూర్తిగా తీసేయలేం. మద్యంపై రెవెన్యూ తగ్గించుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించాలి. వచ్చే ఎన్నికల సమయానికి మద్యాన్ని పైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తాం. ఆ పని చేసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతాం. మేనిఫెస్టోలో ఏం చెప్పామో... దానిని భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తాం’’ అని స్పష్టం చేశారు. 


ఆది నుంచీ అదే దారి 

వైసీపీ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పుడో మడతపెట్టారు. అధికారానికి ముందు ప్రతి ఎన్నికల సభలో 25మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామంటూ బీరాలు పలికారు. ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన తర్వాత నాలుక మడతేశారు. మన ఖర్మ కొద్దీ కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిందని, వారికి మన అవసరం లేదని చెప్పారు. అయినా కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని అంటూ వైసీపీ మేనిఫెస్టోను మొదటిసారిగా మడతపెట్టారు. ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలో తాను ఇల్లు కట్టుకున్నానని, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాత్రం అద్దె ఇంట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెప్పుకున్నారు.


ఎన్నికల తర్వాత నాలుకను మరోసారి మడతేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు కావాలని, అంత డబ్బు మన దగ్గర లేదంటూ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సీపీఎస్‌ రద్దు విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం అలాంటి బుకాయింపే చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికల ముందు జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారు. అయితే సీపీఎస్‌ రద్దు విషయంలో జగన్‌కు అవగాహన లేక హామీ ఇచ్చారని, అది సాధ్యం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు నాలుకను అడ్డంగా మడతేశారు. 


మద్య నిషేధం మా మేనిఫెస్టోలో లేదు

కావాలంటే మేనిఫెస్టో పరిశీలించుకోండి..

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బుకాయింపు 

విశాఖపట్నం, జూలై 30(ఆంధ్రజ్యోతి): ‘మద్య నిషేధం అనేది మా మానిఫెస్టోలో లేదు. దశల వారీగా మద్యం ధరలను స్టార్‌ హోటల్‌ స్థాయిలో పెంచి సామాన్యులకు దూరం చేసేలా చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పాం’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యనిషేధం అంశం తమ మేనిఫెస్టోలోనే లేదని, కావాలంటే పరిశీలించుకోవచ్చని సవాల్‌ చేశారు. దశల వారీగా మద్య నిషేధం అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి గుర్తుచేయగా ‘మీది తెలుగు పేపరే కదా... మా మేనిఫెస్టో కూడా తెలుగులోనే పెట్టాం... కాబట్టి అర్థం చేసుకోండి’ అంటూ బుకాయించడం మీడియా ప్రతినిధులను సైతం అవాక్కయ్యేలా చేసింది. మద్యం దుకాణాలను దశల వారీగా తగ్గిస్తామని చెప్పామని, ఆ మేరకు ఇప్పటికే 20 శాతం తగ్గించేశామన్నారు. అలాగే స్టార్‌ హోటల్‌ స్థాయిలో మద్యం ధరలను పెంచేసి సామాన్యులకు అందకుండా చేస్తామని చెప్పామని, ఆ ప్రకారం ధరలు కూడా పెంచామన్నారు. మద్యం విక్రయాలు తగ్గినప్పటికీ, ధరలు పెంచడం వల్ల విక్రయాలు పెరిగాయనే అభిప్రాయం కొంతమందిలో ఉందన్నారు. బార్లు మాత్రం గతంలో మాదిరిగానే ఉన్నాయని, వాటిని తమ ప్రభుత్వం పెంచలేదన్నారు. 


మద్య నిషేధాన్ని తుంగలో తొక్కేశారు: జవహర్‌  

అధికారంలోకి రావడానికి మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేసిన జగన్‌రెడ్డి ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కేశారని మాజీ మంత్రి జవహర్‌ విమర్శించారు. జగన్‌కు ప్రధాన ఆదాయ వనరు అయిన మద్యం అమ్మకాలపై వస్తున్న డబ్బును తాడేపల్లిలోని అంతఃపురంలో దాచుకోవడానికి ఖాళీలేక తన అనుచరగణానికి, సామంతరాజులకు కట్టబెట్టేందుకు బార్‌ పాలసీకి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాల ద్వారా గంటకు రూ.10 కోట్లు, రోజుకు రూ. 240 కోట్లు ఆదాయం వస్తోందని, ఈ డబ్బంతా ఎటుపోతోందని ప్రశ్నించారు. బార్ల ద్వారా జగన్‌ ప్రభుత్వానికి రూ.92 కోట్లు వస్తుంటే, దీనికంటే మూడురెట్లు లైసెన్సుదారుల వద్ద ఆయన అనుయాయుల వసూలు చేశారని ఆరోపించారు. కృష్ణాజిల్లాలో పాత బార్‌ యజమానులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బెదిరించారని చెప్పారు. ప్రస్తుత మద్యం టెండర్లను రద్దు చేసి సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తే జగన్‌ అవినీతి బయటపడుతుందని చెప్పారు. 

Read more