పాఠశాలల విలీనం ఆపాలి

ABN , First Publish Date - 2022-07-18T09:07:31+05:30 IST

పాఠశాలల విలీనం ఆపాలి

పాఠశాలల విలీనం ఆపాలి

ఉపాధ్యాయల ఎమ్మెల్సీల డిమాండ్‌

25 నుంచి బస్సుయాత్ర

విజయవాడ (గవర్నర్‌పేట), జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేస్తూ లక్షలమంది పేద, పసిపిల్లల్ని ఊరుబడి నుంచి సాగనంపాలని చూస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు తరలిపోయారని అన్నారు. విలీన ప్రక్రియ, ఇతర విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్లతో పాఠశాలల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, వై.శ్రీనివాసులురెడ్డి, ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జీ, విద్యారంగ విశ్లేషకులు గుంటుపల్లి శ్రీనివాస్‌, విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ డి. రమేష్‌ పట్నాయక్‌, ఉన్నత విద్య పరిరక్షణ సమితి కన్వీనర్‌ డాక్టర్‌ బి.రాజగోపాల్‌ తదితరులు ప్రసంగించారు.  తమ స్కూళ్లను తరలించవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని లక్ష్మణరావు అన్నారు. విలీన ప్రక్రియను నిలుపుచేసే వరకు పోరాటం కొనసాగించాలని, పాఠశాలల్ని కాపాడుకునే విధంగా ప్రజలతో కలిసి కార్యాచరణ రూపొందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలంతా కలిసి ఈ నెల 25 నుంచి 31 వరకు బస్సు యాత్ర చేపట్టాలని సదస్సులో తీర్మానించారు. యూడీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌. వెంకటేశ్వర్లు, ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read more