ఉక్కు పీఎస్‌యూలను విలీనం చేయండి

ABN , First Publish Date - 2022-09-24T10:28:27+05:30 IST

ఉక్కు పీఎస్‌యూలను విలీనం చేయండి

ఉక్కు పీఎస్‌యూలను విలీనం చేయండి

ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవచ్చు

కిషన్‌రెడ్డితో ఉక్కు అధికారుల సంఘం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ రంగంలోని ఉక్కు కర్మాగారాలు సెయిల్‌, విశాఖలోని ఆర్‌ఐఎన్‌ఎల్‌, నగర్నార్‌లోని ఎన్‌ఎండీసీలను విలీనం చేయండి. అప్పుడే జాతీయ ఉక్కు విధానం 2030 నిర్దేశించిన 300 మిలియన్ల ఉక్కు ఉత్పత్తి లక్ష్యం దిశగా మన దేశం సాగుతుంది’’ అని ఉక్కు అధికారుల సంఘం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. విశాఖ ఉక్కు సమస్యల గురించి వివరించారు. 7.3 మిలియన్‌ టన్నుల సామ ర్థ్యం కలిగిన విశాఖ ఉక్కును, మూడు మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన నగర్నార్‌ ఎన్‌ఎండీసీ కర్మాగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తూ మరో పక్క సెయిల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని రాబోయే 10 సంవత్సరాల్లో లక్ష కోట్లు పైగా వెచ్చించి 10 మిలియన్‌ టన్నులకు విస్తరించడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని వివరించారు. రూ.30 - 35 వేల కోట్లు ప్రభుత్వానికి జమ చేసి విశాఖ ఉక్కును, ఎన్‌ఎండీసీ కర్మాగారాన్ని సెయిల్‌ టేకోవర్‌ చెయ్యడం ద్వారా తక్షణమే ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్‌ టన్నులకు పెరుగుతుందన్నారు. అదేసమయంలో విశాఖ ఉక్కు ద్వారా ఎగుమతులు పెంచుకోవచ్చని, సెయిల్‌కు అవసరమైన బొగ్గు దిగుమతుల నిర్వహణ సులభతరం అవుతుందని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు కర్మాగారాలూ ప్రభుత్వ రంగంలో కొనసాగటం ద్వారా నిరుద్యోగ సమస్య తీరుతుందని, వెనుక బడిన ఉత్తరాంధ్ర, ఛత్తీ్‌సగఢ్‌ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ఈ విలీనం వలన ఉక్కు ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గి ఉక్కు ధర అందుబాటులో ఉంటుందని, అలాగే ఒకే సంస్థ గొడుగులోకి రావడం వలన పాలనాపరమైన ఖర్చులు చాలా తగ్గుతాయని చెప్పారు. విస్తరణకు కేటాయించిన లక్ష కోట్లలో మిగిలిన రూ.70 వేల కోట్లతో బయ్యారం, కడప ఉక్కు కర్మాగారాలను దశల వారీగా నిర్మించ వచ్చునని వివరించారు. అధికారుల సూచనలు విన్న కిషన్‌రెడ్డి.. ఈ విషయాలన్నీ ఉక్కు, ఆర్థిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉక్కు అధికారుల సంఘ ప్రతినిధులు... నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆఫీసర్స్‌ సంఘం సెక్రెటరీ జనరల్‌ తోమర్‌ను కలిసి విశాఖ ఉక్కు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ప్రధాని, మంత్రుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఉక్కు అధికారుల సంఘం అధ్యక్షుడు కాటం చంద్రరావు, ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్‌, ఉపాధ్యక్షులు చండ్ర వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి నరసింహా అఖిల భారత ఉక్కు అధికారుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. సమస్యలపై చర్చించారు. విశాఖ ఉక్కు అధికారుల వేతన ఒప్పందం అమలు చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, స్టీల్‌ పీఎ్‌సయూలను విలీనం చేయాలని తీర్మానం చేశారు.


Read more