‘పెద్దల’ కనుసన్నల్లో మెడికల్‌ సీట్ల మాఫియా!

ABN , First Publish Date - 2022-04-24T09:53:58+05:30 IST

రాష్ట్రంలో మెడికల్‌ సీట్ల మాఫియా వెనుక ఎవరున్నారు? గుంటూరుకు సమీపంలోని..

‘పెద్దల’ కనుసన్నల్లో మెడికల్‌ సీట్ల మాఫియా!

గుంటూరు సమీపంలోని ప్రైవేటు కాలేజీలో 20 సీట్లు బ్లాక్‌

కీలక నేతల చేతుల్లోనే కాలేజీ నిర్వహణ

ఎన్టీఆర్‌ వర్సిటీ అధికారులకు తెలిసే జరిగిందా?

సమగ్ర విచారణకు తల్లిదండ్రుల డిమాండ్‌


(అమరావతి/విజయవాడ-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మెడికల్‌ సీట్ల మాఫియా వెనుక ఎవరున్నారు? గుంటూరుకు సమీపంలోని ఒకే మెడికల్‌ కాలేజీలో 20కి పైగా ఎంబీబీఎస్‌ సీట్ల బ్లాక్‌ వెనుక ఎవరి హస్తం ఉంది? ఇవీ.. ఇప్పుడు అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్నలు. ఈ నేపథ్యంలో.. మెడికల్‌ సీట్ల మాఫియా వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మాఫియాపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాం డ్లు కూడా వస్తున్నాయి. వాస్తవానికి మెడికల్‌ కౌన్సెలింగ్‌లో ఏ చిన్న తప్పులు దొర్లినా పెరిగిన సాంకేతికత కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇట్టే పసిగడుతున్నారు. వెంటనే వర్సిటీకి ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు మాఫియాకు చాన్స్‌ లేకుండా పోయింది. అయితే.. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు మాఫి యా చెలరేగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 ఎంబీబీఎస్‌ సీట్లు బ్లాక్‌ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఒక కాలేజీలో ఒక్క సీటు బ్లాక్‌ చేయాలన్నా.. ఆయా కాలేజీల యాజమాన్యం, వర్సిటీ అధికారుల సహకారం అవసరం. యాజమాన్యం సహకారం లేకుండా ఒక్క సీటు బ్లాక్‌ చేయడం కూడా కుదరదు. అలాంటిది ఒకే కాలేజీలో 20 సీట్లు బ్లాక్‌ చేయడం అంటే సాధారణ విషయం కాదని, ఎవరో వెనుక ఉన్నారని వైద్య వర్గాలు సందేహిస్తున్నాయి. గుంటూ రు సమీపంలోని ఓ ప్రైవేటు మెడికల్‌ కాలేజీని కొన్నాళ్ల కిందట ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఒక కంపెనీ హస్తగతం చేసుకుంది. ప్రభుత్వంలోని కొంత మంది పెద్దల కన్నుసన్నల్లో ప్రస్తుతం మెడికల్‌ కాలేజీ నిర్వహణ జరుగుతోంది. ఇప్పుడు అదే కాలేజీలో 20 ఎంబీబీఎస్‌ సీట్లు బ్లాక్‌ కావడం అనేక అనుమానాలు తావిస్తోంది. ప్రస్తుతం మెడికల్‌ సీట్లు చాలా ప్రియంగా మారాయి. ఒక్కో పీజీ సీటు రూ.2 కోట్ల వరకూ, ఎంబీబీఎస్‌ సీటు ఽకనీసంలో కనీసం కోటి రూపాయిల వరకూ పలుకుతున్నాయి. దీంతో అక్రమ మార్గంలో విద్యార్థుల డాక్టర్‌ లక్ష్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని రూ.కోట్లలో దోచుకునేందుకు 20 ఎంబీబీఎస్‌ సీట్లు బ్లాక్‌ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. బీ కేటగిరి నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తే ఏడాదికి రూ.12 లక్షల మాత్రమే వస్తాయి. సీ కేటగిరి(యాజమాన్య కోటా) సీట్లకు మాత్రం కాలేజీ యాజమాన్యం డిమాండ్‌ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తుంది. కొంత మంది వద్ద ఐదేళ్లకు సంబంధించిన ఫీజు అంటే దాదాపు కోటిన్నర రూపాయిలపైన ఒకేసారి కట్టించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. దీనిని పసిగట్టిన మాఫియా ఆ 20 సీట్లపై కన్నేసిందని వైద్య వర్గాలు అంటున్నాయి.


అందుకే ఆపారా?

గుంటూరు సమీపంలోని ప్రైవేటు కాలేజీ.. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తోంది కాబట్టి, వారి అనుమతితోనే 20 సీట్లు బ్లాక్‌ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఎంబీబీఎస్‌ సీట్ల కోసం తల్లిదండ్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అవసరాన్ని బట్టి పెద్దల సిఫారసులు కూడా కోరుతుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి నుంచి డబ్బులు పిండేందుకు అధికార పార్టీకి చెందిన పెద్దల ఒత్తిడి మేరకు సీట్లు బ్లాక్‌ చేశారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక ఎన్టీఆర్‌ వర్సిటీ వీసీ ప్రభుత్వానికి వీరాభిమానిగా మారారనే పేరుంది. రిజిస్ట్రార్‌ సైతం అంతే అనే మాట వినిపిస్తుంది. దీంతో సదరు ‘బ్లాక్‌’ వ్యవహారం వీరికి తెలియకుండా ఉంటుందా? అనే చర్చ కూడా నడుస్తోంది.  


పీజీ సీట్లలోనూ అవతవకలు 

ఎంబీబీఎస్‌ సీట్లలోనే కాదు.. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటికి సంబంధించి పలువురు అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో అడ్మిషన్ల కోసం వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునేందుకు వర్సిటీ ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చింది. తొలి దశ కౌన్సెలింగ్‌లో మేనేజ్‌మెంట్‌ కోటా కింద సీట్లు పొందిన వారు.. కేటాయించిన కాలేజీల్లో చేరకపోతే.. తర్వాత నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అనుమతించరు. అయితే, ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది.. చేరని అభ్యర్థులు 13 మందిని రెండో కౌన్సెలింగ్‌కు అనుమతించారని పలువురు అభ్యర్థులు లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. ఇలా చేయడం వల్ల మెరిట్‌ విద్యార్థులు నష్టపోవాల్సివస్తుందని ఆవేదన చెందుతున్నారు.


వర్సిటీ అధికారులను అరెస్ట్‌ చేయాలి

ఏపీ మెడికోస్‌ పేరెంట్స్‌ సంఘం డిమాండ్‌ 


గుంటూరు(మెడికల్‌), ఏప్రిల్‌ 23: ఎంబీబీఎస్‌ ప్రవేశాల కోసం విద్యార్థులు పెట్టుకున్న వన్‌టైమ్‌ ఆప్షన్‌ను అక్రమంగా తొలగించిన హెల్త్‌ యూనివర్సిటీ సెలక్షన్‌ కమిటీ సభ్యులను అరెస్టు చేయాలని ఏపీ మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. శనివారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఎంబీబీఎస్‌  తొలి విడత అడ్మిషన్స్‌ తర్వాత అభ్యర్ఠుల ఆప్షన్స్‌లో కొన్నింటిని వర్సిటీ అధికారులు అక్రమంగా తొలగించారని, బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Read more