Margadarshi chits: మార్గదర్శి చిట్స్‌కు షోకాజ్‌ నోటీసులు!

ABN , First Publish Date - 2022-11-29T03:09:39+05:30 IST

రాష్ట్రంలో మార్గదర్శి చిట్స్‌లో ఆర్థిక లావాదేవీలపై జరిపిన ప్రాథమిక తనిఖీల్లో కొన్ని సందేహాలు, ఆర్థిక ఉల్లంఘనలు ఉన్నందున తదుపరి సమగ్ర విచారణ కోసం ఆ సంస్థకు వారం ..

Margadarshi chits: మార్గదర్శి చిట్స్‌కు షోకాజ్‌ నోటీసులు!

వారం పది రోజుల్లో ఇస్తాం

హైదరాబాద్‌ హెడ్డాఫీసులోనూ తనిఖీలు చేస్తాం

సోదాల్లో ఉల్లంఘనలు కనిపించాయి

అకౌంట్ల నిర్వహణ సరిగా లేదు... ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరుపుతాం

ఏ వివరాలూ చెప్పడం లేదు.. ఉల్లంఘనలపై చర్యలు తప్పవు

స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఐజీ రామకృష్ణ స్పష్టీకరణ

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మార్గదర్శి చిట్స్‌లో ఆర్థిక లావాదేవీలపై జరిపిన ప్రాథమిక తనిఖీల్లో కొన్ని సందేహాలు, ఆర్థిక ఉల్లంఘనలు ఉన్నందున తదుపరి సమగ్ర విచారణ కోసం ఆ సంస్థకు వారం పది రోజుల్లో షోకాజు నోటీసులు ఇస్తామని రాష్ట్ర స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఆ సంస్థ ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయన్నారు. మార్గదర్శి చిట్స్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణ స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సహకారంతో అక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మార్గదర్శి కార్యకలాపాల్లో నిధుల మళ్లింపు, ఇతర అంశాలపై అనుమానాలు ఉన్నాయని.. చిట్‌ వేసే వారి నుంచి తీసుకునే సొమ్ము వాటికి మాత్రమే వినియోగించాలని.. కానీ ఆ సొమ్ము వేరే వాటికి మళ్లించినట్లు గుర్తించామని తెలిపారు. ప్రత్యేక ఆడిటింగ్‌కు సిద్ధమవుతున్నామని.. ఫోర్సెనిక్‌ ఆడిటింగ్‌ నిర్వహిస్తామన్నారు.

ప్రజల నుంచి మార్గదర్శిపై కచ్చితమైన ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ‘మార్గదర్శి అకౌంట్ల నిర్వహణ సక్రమంగా లేనందున స్పెషల్‌ ఆడిట్‌ చేయాలని ఆదేశించాం. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తాం. అక్టోబరు 21న రాష్ట్రవ్యాప్తంగా 12 చిట్‌ ఫండ్‌ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించాం. అదేవిధంగా 31న మరో ఐదు సంస్థలపైన, ఈ నెల 15వ తేదీన మార్గదర్శికి చెందిన 18 యూనిట్లలో తనిఖీలు చేశాం. అయితే తనిఖీల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్గదర్శి శాఖల్లోని ఫోర్‌మెన్‌కు ఏమీ తెలియదు. ఏ ప్రశ్న అడిగినా హెడ్డాఫీసులో ఉంటాయని చెబుతున్నారు. డాక్యుమెంట్ల స్వాధీనం అంశానికి సంబంధించి సంతకం చేయమన్నా చేయలేదు. సెక్యూరిటీ రూపంలో డిపాజిట్లు తీసుకుంటున్నారు. సేకరిస్తున్న డబ్బు ఎక్కడ ఉందో తెలియడంలేదు. ఇది పూర్తిగా ప్రజలను మోసం చేయడమే. ప్రతి దానికీ ఒకే ఖాతా చూపిస్తున్నారు. ప్రతి చిట్‌కు మినిట్స్‌ రికార్డు చేయాలి. కానీ ఈ కంపెనీ ఈ వివరాలు నమోదు చేయడంలో విఫలమైంది. ప్రతి చిట్‌ వివరాలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు తెలియజేయాలి. ఈ వివరాలు ఇవ్వకపోవడం వల్ల నిధులు దుర్వినియోగమవుతున్నాయని భావించాల్సి వస్తోంది. బ్యాంకు ఖాతాల వివరాలు, చిట్‌ వివరాలు, పెట్టుబడులు, వ్యాపారాల వివరాలేమీ మాకు ఇవ్వలేదు. శాఖలేవీ మాకు సహకరించలేదు. చట్టబద్ధ పత్రాలు కూడా ఇవ్వడం లేదు. అందుకే ఆ సంస్థ ఆర్థిక పరిస్థితిపై నాకు అనుమానం కలుగుతోంది. డిపాజిట్లను ఉషోదయ, ఉషాకిరణ్‌ మూవీస్‌ తదితర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు తెలుస్తోంది. ప్రజాధనాన్ని వేరే అవసరాలకు ఉపయోగిస్తుంటే మేం చూస్తూ కూర్చోలేం. పబ్లిక్‌ మనీ ఇక్కడే డిపాజిట్‌ చేయాలి. మా కంట్రోల్లో ఉండాల్సిందే. చట్టబద్ధంగా రికార్డులు నిర్వహించడం లేదు. షోకాజ్‌ నోటీసులకు సమాధానం వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. ఉక్కుపిడికిలితో ఈ ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటాం’ అని ఐజీ స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-29T03:51:00+05:30 IST