మామిడి.. ‘పుల్లన’

ABN , First Publish Date - 2022-04-10T08:12:48+05:30 IST

ఉక్కపోతతో ఉడుకెత్తించే వేసవిలో పెద్ద ఊరట ‘రారాజు’. కంటికింపుగా కనిపించే పచ్చటి ఛాయ, చవులూరించే రుచి దాని స్వంతం.

మామిడి.. ‘పుల్లన’

  • 25 శాతం తగ్గనున్న దిగుబడి.. పెరగనున్న డిమాండ్‌
  • ధరలు ఆకాశాన్నంటే సూచనలు
  • రైతుకు దక్కేది అంతంతే..!
  • ఈ ఏడాదైనా ఎగుమతులు పెరిగేనా?
  • ఆందోళనలో మామిడి రైతు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉక్కపోతతో ఉడుకెత్తించే వేసవిలో పెద్ద ఊరట ‘రారాజు’. కంటికింపుగా కనిపించే పచ్చటి ఛాయ, చవులూరించే రుచి దాని స్వంతం. గరిష్ఠంగా మూడు నెలలు మాత్రమే అందుబాటులో ఉండి నోరూరించే ఆ మధురఫలం మామిడి... తినాలనుకునే వారికి ఈ ఏడాది చుక్కలు చూపించే అవకాశం ఉంది. ప్రతికూల వాతావరణంతో దిగుబడి తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి రెండేళ్ల తరువాత అవకాశం చిక్కడం... వెరసి వినియోగదారులకు మామిడి తీపి... చేదెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నాణానికి మరోవైపు, మామిడి రైతుకు ఈ ఏడాదీ ప్రతికూలత తప్పేలా లేదు. గత రెండేళ్లుగా కొవిడ్‌ ప్రభావంతో ఎగుమతులు లేక రైతు నష్టపోయాడు. ఈఏడాది ప్రతికూల వాతావరణం కారణంగా మామిడి దిగుబడి 25 శాతం తగ్గే సూచనలున్నాయన్న ఉద్యాన శాఖ అధికారుల అంచనాలు రైతుకు గుబులుపుట్టిస్తున్నాయి. 


అధిక వర్షాలే ప్రధాన కారణం

రాష్ట్రంలో 9.25 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఏటా సగటున 35 - 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది 25ు పంట తగ్గితే.. 30 లక్షల టన్నుల లోపే దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా. 2021లో వర్షాలు ఎక్కువ రోజులు కొనసాగాయి. దీంతో పూత తరుణంలో అవసరమైన బెట్ట వాతావరణం లేకుండాపోయింది. ఏటా డిసెంబరులో పూత మొదలయ్యే సమయానికి రెండు నెలల ముందు నేల బెట్ట ఉండాలి. కానీ అటు రాయలసీమ, ఇటు దక్షిణ కోస్తాలో వర్షాలు ఎక్కువ పడటం వల్ల తేమ ఎక్కువగా ఉండి పూత ఆలస్యమైంది. ఉత్తర కోస్తాలో పూత వచ్చాక కూడా వాన జల్లులు పడ్డాయి. దీంతో పూత రాలిపోయింది. కొన్ని చోట్ల పొగ మంచు, తేనె బంక, మంగుతో పూత పాడైపోతుండగా, మరికొన్ని చోట్ల తామర పురుగు ఆశించింది. మిర్చి పంటను నాశనం చేసిన నల్ల తామర పురుగూ అక్కడక్కడా కనిపిస్తోంది. పై కారణాలన్నీ కలగలసి మామిడి దిగుబడిపైనా, నాణ్యతపైనా ప్రభావం చూపిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 


ఆరంభంలో తక్కువగానే ఉన్నా...

ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో మామిడి పంట కోతకు వస్తోంది. నున్న మార్కెట్‌కు తక్కువ మొత్తంలోనైనా కాయలు వస్తున్నాయి. ప్రస్తుతం టన్ను బంగినపల్లి మామిడి ధర రూ.60 నుంచి రూ.80 వేలు పలుకుతోంది. సాధారణంగా తొలి కాపు టన్ను రూ.90 వేల వరకూ ఉంటుంది. తోతాపురి రకమైతే రూ.30-40 వేల దాకా పలుకుతుంది. ఇదే నున్న మార్కెట్‌లో గతేడాది నాణ్యమైన బంగినపల్లి రకం టన్ను గరిష్ఠంగా రూ.70 వేలు, రెండో రకం టన్ను రూ.50 వేలు లోపు పలికింది. నిరుడు చిత్తూరు జల్లాలో తోతాపురి రకం టన్ను రూ.20 వేలు మాత్రమే పలికింది. తొలి పంట ధర ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నట్లు అనిపిస్తున్నా ఈ ఏడాది దిగుబడి తగ్గుతుందన్న అంచనాల నేపథ్యంలో ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. దీనివల్ల చిన్న రైతులకు లాభాలు వచ్చే అవకాశం తక్కువే. సాధారణంగా పెద్ద రైతులే తోటల్ని కౌలుకు తీసుకోవడం లేదా పంటను తక్కువ ధరకు తీసుకుని, మార్కెట్‌ చేసుకోవడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువగా దళారులు వీళ్లందరినీ మేనేజ్‌ చేసి, అలువసొలువగా కొని, ఎక్కువ రేటుకు ఎగుమతి చేయడం అనాదిగా సాగుతూ ఉంది. దీంతో మార్కెట్లలో అధిక ధరకు అమ్ముడుపోయినా రైతుకు ఏ మేరకు లాభం చేకూరుతుందన్నది ప్రశ్నార్థకమే.


ఎగుమతులు నామమాత్రమే!

రాష్ట్రం నుంచి అపెడా నేరుగా మామిడి ఎగుమతులు చేస్తోంది. ఇది సుమారుగా 1,000 టన్నుల వరకూ ఉంది. అత్యధికంగా వ్యాపారుల ద్వారా 10 వేల టన్నుల వరకు ఎగుమతి అవుతోంది. గత రెండేళ్లుగా కార్గో విమానాలు లేక విదేశాలకు ఎగుమతులు లేకుండాపోయాయి. విశాఖ పోర్టు నుంచి మాత్రమే కేవలం 300 టన్నులు ఇతర దేశాలకు పంపగలిగారు. వాస్తవంగా తూర్పు మధ్య దేశాలకు ఎగుమతి జరిగితేనే రాష్ట్ర మామిడి రైతులకు కొంత మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. భౌగోళిక గుర్తింపు పొందిన బంగినపల్లి రకం మామిడిని అమెరికా, చైనా, జపాన్‌, ఇంగ్లాండు, తూర్పు, మధ్య ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తే రైతుకు 20ు దాకా అదనపు ధర లభిస్తుంది. కానీ ఎగుమతులకు అవసరమైన మౌలిక వసతులు తగిన రీతిలో లేవు.


దీంతో ఎగుమతులు పుంజుకోవడం లేదు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (అపెడా) ఆమోదించిన ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌లు రాష్ట్రంలో 10 వరకూ ఉన్నాయి. వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌ (వీహెచ్‌టీ) ప్లాంట్లు గరివిడి, గోపాలపురం, పామర్రు, నూజివీడు, తిరుపతి, అనంతపురంలో ఉన్నాయి. ఇక్కడ ప్యాకింగ్‌ చేసిన మామిడి పండ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో 25 రైతు ఉత్పత్తి సంఘాలు మామిడిని ఎగుమతి చేస్తున్నాయి. కాగా, దేశంలో వివిధ ప్రాంతాలకు వేగంగా చేరవేసే అవకాశమున్న కిసాన్‌ రైళ్లు కూడా ముంబయి, ఢిల్లీకి మాత్రమే పరిమితమయ్యాయి. వీటిలో ఢిల్లీ మార్కెట్‌లో మామిడికి పెద్దగా ధర లభించడం లేదు. ఈ రైళ్లను దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తే మామిడి రైతుకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ కిసాన్‌ రైళ్లను ఎన్నింటిని నడుపుతారన్న దానిపై స్పష్టత లేదు. 


రకమేదైనా దేని డిమాండ్‌ దానికే

రాష్ట్రంలో బంగినపల్లి, తోతాపురి, చెరుకురసం, సువర్ణరేఖ, నీలం రకాల మామిడి అధికంగా సాగులో ఉంది. చిత్తూరు, తిరుపతి ప్రాంతంలో తోతాపురి... ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, వైఎ్‌సఆర్‌, ఎన్టీఆర్‌, కాకినాడ జిల్లాల్లో బంగినపల్లి రకం... ఉత్తరాంధ్ర జిల్లాల్లో సువర్ణరేఖ రకం మామిడి సాగు విరివిగా ఉంది. నిజానికి వీటిలో దేని డిమాండ్‌ దానికే ఉంటోంది.


నెలాఖరులో ఉత్పత్తిదారుల సదస్సు

ఈ నెలాఖరున విజయవాడలో ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలతో ఉద్యాన శాఖ ఒక సదస్సు నిర్వహించనున్నది. ఆ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌ ప్రతి పంటకు సంబంధించి ఆ ప్రాంత రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. నెలకు రెండుసార్లు సమీక్షలు నిర్వహించారు. ఇదే విధానంలో మామిడి ఉత్పత్తి, ఎగుమతులపైనా సమీక్ష చేయనున్నారు.

Read more