Mangalagiri: నారా లోకేశ్ దెబ్బకు వైసీపీలో గుబులు

ABN , First Publish Date - 2022-08-18T02:52:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో అతి ముఖ్యమైన నియోజకవర్గాల్లో మంగళగిరి (Mangalagiri) ఒకటి. సీఎం నివాస ప్రాంతంతో...

Mangalagiri: నారా లోకేశ్ దెబ్బకు వైసీపీలో గుబులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అతి ముఖ్యమైన నియోజకవర్గాల్లో మంగళగిరి (Mangalagiri) ఒకటి. సీఎం నివాస ప్రాంతంతో పాటు రాజధాని విస్తరించి ఉంది.ఇదే మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రాతినిధ్యం వహించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ టీడీపీ (Tdp) అభ్యర్థిగా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత.. వైసీపీ నుంచి నారా లోకేష్ తీవ్రమైన విమర్శలు, హేలనలు ఎదుర్కొన్నారు. అయితే ఈసారి నారా లోకేష్ మంగళగిరిని చాలెంజ్‌గా తీసుకున్నారట. వచ్చే ఎన్నికల్లో గెలిచి అందరి నోళ్లు మూయించాలని ధృడ సంకల్పంతో ఉన్నారట. దీంతో నిత్యం మంగళగిరిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత సిబ్బందిని మంగళగిరిలోనే ఉంచి పార్టీ కార్యకర్తల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి అవసరాలు తీరుస్తున్నారు. 


అంతేకాదు.. ఆరోగ్య సంజీవిని పేరుతో ఓ మెడికల్ వాహనం తయారు చేయించి నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. లోకేష్ స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఈ వాహనం.. మంగళగిరిలోని ప్రతీ గ్రామం తిరిగి ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ప్రాథమిక వైద్యం అందిస్తుంది. దీంతోపాటు.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు.. స్త్రీ శక్తి పేరుతో ట్రైలరింగ్‌ ఉచిత శిక్షణ కార్యక్రమాలు, కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక ప్రతీ గ్రామంలో పెళ్ళిళ్లు చేసుకునే పేదలకు లోకేష్ పెళ్లి కానుక పేరుతో ఆర్థిక సాయం అందజేస్తున్నారు. చిరు వ్యాపారాలు చేసుకునే వారికి తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇలా.. ఉచిత సేవలు అందిస్తూ ప్రజల్లో పట్టు సాధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచి తీరాలని చూస్తున్న లోకేష్... ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారట. 



ఇదిలావుంటే... నారా లోకేష్‌ దూకుడును గమనించిన వైసీపీకి టెన్షన్‌ పట్టుకుందట. ఓటు బ్యాంక్ రాజకీయాలపై వైసీపీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టిందట. మంగళగిరిలో చేనేత సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన చిల్లపల్లి మోహన్‌రావుకు ఏపీ ఆఫ్కో ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత.. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయితే.. టీడీపీలో ఉన్న మురుగుడు హనుమంతరావును కనీసం వైసీపీలో చేర్చుకోకుండానే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై స్వంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అయ్యాయట.


తాజాగా మరో టీడీపీ నేత గంజి చిరంజీవికి వైసీపీ గాలం వేసింది. ఆయన.. ఇటీవల టీడీపీకి రాజీనామా చేయగా.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. గంజి చిరంజీవి 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 12 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే టీడీపీ హయాంలో గంజి చిరంజీవికి మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. చేనేత సామాజికవర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు కూడా వైసీపీలో కీలక పదవి ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.


ఇక.. వరుసగా చేనేత సామాజికవర్గానికి చెందిన ముఖ్య నేతలకు పదవులు ఆశ చూపించి పార్టీలో చేర్చుకుంటూ వైసీపీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరలేపడం మంగళగిరిలో హాట్‌ టాపిక్‌గా మారుతోంది. ఇది చాలదన్నట్లు.. ప్రస్తుతం మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కూడా చేనేతలకు ఇవ్వాలని వైసీపీ పెద్దలు చూస్తున్నారట. మొత్తంగా నారా లోకేష్‌ దెబ్బకు మంగళగిరి వైసీపీలో గుబులు రేపుతోంది. లోకేష్‌.. ప్రజా బలం పెంచుకుంటూ ముందుకెళ్తుంటే వైసీపీ నేతలు మాత్రం కుల, ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. మంగళగిరి పాలిటిక్స్‌.. ఇప్పుడే ఇలా ఉంటే.. వచ్చే ఎన్నికల నాటికి ఇంకెలా ఉంటాయో చూడాలి మరి...



Updated Date - 2022-08-18T02:52:36+05:30 IST