Mandus Typhoon: వీడని ముసురు

ABN , First Publish Date - 2022-12-12T04:23:41+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ తీరం దాటి రెండు రోజులు దాటినా రాష్ట్రంలో దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. సముద్రం మీదుగా వస్తున్న తేమ మేఘాలతో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Mandus Typhoon: వీడని ముసురు

దక్షిణ కోస్తా, సీమలో తెరిపివ్వని వర్షాలు

నేడు కూడా విస్తారంగా వానలు: ఐఎండీ

కృష్ణా, పశ్చిమలో ధాన్యం రాశుల్లోకి, చేలల్లోకి నీరు.. ప్రకాశంలో లక్ష ఎకరాలు మునక

25 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పొగాకు తోటలు.. పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

కర్నూలులో మిరప, వరి, పత్తి రైతులకు కష్టం.. క్షేమంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులు

విశాఖపట్నం/ఒంగోలు/కర్నూలు(ఆంధ్రజ్యోతి)/భీమవరం రూరల్‌, డిసెంబరు 11: మాండస్‌ తుఫాన్‌ తీరం దాటి రెండు రోజులు దాటినా రాష్ట్రంలో దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. సముద్రం మీదుగా వస్తున్న తేమ మేఘాలతో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొంది. దీనికితోడు సముద్రం నుంచి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు వణుకుతున్నారు. రానున్న 24గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా (అక్కడక్కడా భారీగా), ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, శనివారం రాత్రి ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ పరిసరాల్లోకి ప్రవేశించి పూర్తిగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. ఇది సోమవారం కల్లా ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని, తరువాత దీని ప్రభావంతో 13న అక్కడ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం పశ్చిమ వాయవ్యంగా పయనించి పశ్చిమ తీరానికి దూరంగా వెళ్తుందని వెల్లడించింది.

గుండ్లకమ్మ 2 గేట్లు ఎత్తివేత

ప్రకాశం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు నీట మునిగాయి. రబీలో అధికంగా సాగుచేసే పొగాకు పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. సుమారు 25వేల ఎకరాల్లో పొగాకు తోటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మినుము, మిర్చి, పత్తి, శనగ, వరి తదితర పంటలు మరో 75వేల ఎకరాల్లో నీట మునిగాయి. పలు పంటల సాగుకు రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.15వేల నుంచి 50వేల వరకు ఖర్చు చేశారు. వర్షాల వల్ల జిల్లా రైతులు దాదాపు రూ.200కోట్ల మేర నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గుండ్లకమ్మ, ముసి, పాలేరు, మన్నేరు తదితర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిలకలేరు, దోర్నపువాగు, ఇతర పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అక్కడక్కడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుండ్లకమ్మకు ఎగువ నుంచి 4వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 2గేట్లు ఎత్తి 3,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అక్కడక్కడా ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఆదివారం కూడా వర్షం తె రిపినివ్వకుండా కురవడంతో పంటలు తుడిచిపెట్టుకు పోయాయని రైతులు ఆదేదన చెందుతున్నారు. కాగా, బాపట్ల జిల్లా వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు వారం క్రితం వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్నారు. అలల ఉధృతికి ఒడ్డుకు వచ్చే వీలు లేక శనివారం రాత్రింబవళ్లు లంగరు వేసుకొని సముద్రంలోనే ఉండిపోయారు. ఆదివారం ఉదయం అలల ఉధృతి కొద్దిగా తగ్గడంతో వారు కొత్తపట్నం వద్ద క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.

వరి, పత్తి పంటలకు నష్టం

ఖరీఫ్‌ పంటలు చేతికి వస్తూ, రబీ పైర్లు ఏపుగా పెరుగుతున్న తరుణంలో విరుచుకుపడిన తుఫాన్‌ రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి రైతులు అధికంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. కోత కోసి కుప్ప వేయని పొలాల్లో వరి పనలు తడిసిపోయాయి. అధిక వర్షం కురిసిన ప్రాంతాల్లో వరి పనలు నీట మునిగాయి. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో వరికంకులు నానిపోయి గింజ రంగు మారడంతోపాటు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట కోతకు వచ్చిన పొలాల్లో పైరు నేలవాలింది. కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కాయలు విచ్చుకుని తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి వానలకు తడిసిపోయి నల్లగా మారుతుందని, కాయల్లోకి నీరు చేరి కుళ్లిపోతాయని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-12T04:23:41+05:30 IST

Read more