కదనోత్సాహం!

ABN , First Publish Date - 2022-05-30T08:54:57+05:30 IST

మహానాడు బహిరంగ సభ తెలుగుదేశం శ్రేణుల సమరోత్సాహాన్ని చాటిచెప్పింది. మూడేళ్లుగా జగన్‌ ప్రభుత్వం తమపై సాగిస్తున్న దాడులు,

కదనోత్సాహం!

మూడేళ్ల అణచివేతపై టీడీపీ శ్రేణుల ప్రతీకారేచ్ఛ!!

మహానాడు బహిరంగ సభకు మహా ప్రవాహం

లక్ష మంది వస్తారని తొలుత అంచనా

మూడు రెట్లు రావడంతో టీడీపీ నేతల్లో జోష్‌

భావి వ్యూహానికి చంద్రబాబు పదును

ప్రతి నెలా 2 పార్లమెంటు స్థానాల్లో టూరు

పది నెలల్లో అన్ని ఎంపీ స్థానాల్లో పర్యటన


మహానాడు బహిరంగ సభ తెలుగుదేశం శ్రేణుల సమరోత్సాహాన్ని చాటిచెప్పింది. మూడేళ్లుగా జగన్‌  ప్రభుత్వం తమపై సాగిస్తున్న దాడులు, అణచివేతలు, తప్పుడు కేసులకు ప్రతీకారంగానా అన్నట్లు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం పెద్దఎత్తున తరలి వచ్చారు. అన్ని వనరులూ  ఉండి కూడా మంత్రుల సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర కోసం జనాలను సమీకరించడానికి అధికార పక్షం నానా తిప్పలు పడితే.. తెలుగుదేశం సభకు జనవాహిని పోటెత్తడం టీడీపీ నేతల్లో ఆనందోత్సాహాలు నింపింది.



(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మహానాడు బహిరంగ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడం టీడీపీ నాయకులనే విస్మయపరుస్తోంది. ఇంత సక్సెస్‌ అవుతుందని వారు ఊహించనేలేదు. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో బహిరంగ సభ నిర్వహణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు మొదట ముందుకు రాలేదు. ఒక పెద్ద గుడారం వంటి నిర్మాణం చేసి 40-50 వేల మందితో ప్రతినిధుల సమావేశం నిర్వహిద్దామని వారు ప్రతిపాదించారు. కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అంగీకరించలేదు. ఎంత కష్టమైనా బహిరంగ సభ నిర్వహిద్దామంటూ ఆయన నాయకులను ఒప్పించారు. కృష్ణా గుంటూరు వంటి పెద్ద జిల్లా కాకపోవడంతో ఒంగోలులో బహిరంగ సభకు లక్ష మంది వస్తే బాగా జరిగినట్లు అవుతుందని లెక్కలు వేసుకున్నాయి. కానీ దానికి మూడు రెట్ల జన ప్రవాహం తరలిరావడం పార్టీ నేతలను ఉత్సాహంతో ఊపేసింది. ‘ప్రభుత్వం బస్సులు తీసుకోకుండా అడ్డుపడడం.. కార్లు ఇస్తే ఊరుకునేది లేదని రవాణా శాఖ అధికారులు ట్రావెల్స్‌ సంస్థలను బెదిరించడంతో ఈ సభ ఎలా జరుగుతుందా అని ఆందోళనచెందాం. కానీ ఎంతో దూరం నుంచి కూడా లారీలు, ట్రాక్టర్లలో సభకు వచ్చారు.


ఇంత మందిని సొంత ఖర్చులతో తెచ్చే ఆర్థిక సామర్థ్యం పార్టీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు లేదు. ఏ ఊరి నాయకులు ఆ ఊరికి తామే ఏదో ఒక వాహనం సమకూర్చుకుని వచ్చేశారు. ఎండ వేడిమిని కూడా లెక్కచేయకుండా లక్షల సంఖ్యలో జనం రావడం చూసి మా కళ్లను మేమే నమ్మలేకపోయాం’ అని ప్రకాశం జిల్లా టీడీపీ ముఖ్యుడొకరు చెప్పారు. గత మూడేళ్లుగా టీడీపీ శ్రేణులు అనుభవించిన అవమానాలకు, అణచివేతకు ఇది ప్రతీకార బల ప్రదర్శన అని ఓ సీనియర్‌ నేత విశ్లేషించారు. అయితే ప్రజల్లో ప్రభుత్వం పట్ల విపరీతంగా పెరిగిన వ్యతిరేకత కూడా ఈ సభ విజయవంతానికి ప్రధాన కారణమని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. కేవలం టీడీపీ కార్యకర్తలు మాత్రమే వస్తే ఇన్ని లక్షల మంది కారని చెప్పారు. తమ గ్రామంలో వైసీపీకి చెందిన 30 మంది ఈ సభకు వచ్చారని ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం మండలంలోని మత్స్యకార గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కాటం రమేశ్‌ తెలిపారు. 


ఇక భయపడేది లేదు..

బహిరంగ సభ విజయవంతం కావడంతో శ్రేణుల్లో కదనోత్సాహం రగిల్చిందని టీడీపీ నేతలు అంటున్నారు. కేసులు, దాడులకు ఇకపై భయపడేది లేదని, పార్టీ పిలుపు ఇస్తే ఏ కార్యక్రమం కోసమైనా దూకడానికి సిద్ధంగా ఉన్నామని కింది స్థాయి నాయకులు బలంగా చెబుతున్నారు. శ్రేణుల్లో ఇక ముందు దూకుడు పెరుగుతుందని ఆ పార్టీ నాయకత్వం కూడా అంచనా వేస్తోంది. అయితే పోలీసులను కూడా సమష్టిగా ప్రతిఘటించడం ఖాయమని ఉన్నత స్థాయి నాయకులు చెబుతున్నారు.


లోక్‌సభ స్థానాల్లో బాబు పర్యటన

టీడీపీ శ్రేణుల్లో ఈ ఊపును కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రతి నెలా రెండు పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన పెట్టుకుని ఒక్కో జిల్లాలో మూడు రోజులు గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలా పది నెలల వ్యవధిలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఒంగోలు సభపై లోకేశ్‌ ముద్ర!

పార్టీ యువ నేత లోకేశ్‌ కూడా మరింత క్రియాశీలం కానున్నారు. ఒంగోలు మహానాడు విజయవంతానికి పూర్తి బాధ్యత తీసుకుని అందరినీ సమన్వయం చేసిన ఆయన.. తదుపరి అడుగులపై నాయకులతో చర్చిస్తున్నారు. ‘ఒంగోలు మహానాడు సభపై లోకేశ్‌ ముద్ర ఉంది. ఈసారి తానే బాధ్యత తీసుకుని బాగా చేయగలిగారు’ అని పార్టీ ముఖ్యుడొకరు చెప్పారు.


బస్సు యాత్ర కాదు.. రైలు యాత్ర చేయండి: లోకేశ్‌

వైసీపీ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ఆదివారం ట్విటర్‌లో ఆయన స్పందించారు. ‘‘తాడేపల్లి ప్యాలెస్‌ లోపల సజ్జల రెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి.. గేటు బయట బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు. ఆయన వద్ద అటెండరు నుంచి ఐఏఎస్‌ వరకూ ఒకే సామాజిక వర్గం. రెండు వేల కీలక పదవులు ఒకే సామాజిక వర్గానికి.. కుర్జీలు లేని పదవులు బీసీలకా? చెయ్యాల్సింది సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కాదు.. జగన్‌ ‘రెడ్డి’ సామాజిక రైలు యాత్ర. వాస్తవానికి రైలు కూడా సరిపోనన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి దక్కాయి’’ అని లోకేశ్‌ ఆరోపించారు. 



Updated Date - 2022-05-30T08:54:57+05:30 IST