అర్ధరాత్రి దాటేదాకా సుదీర్ఘ చర్చలు

ABN , First Publish Date - 2022-02-05T07:56:03+05:30 IST

అర్ధరాత్రి దాటేదాకా సుదీర్ఘ చర్చలు

అర్ధరాత్రి దాటేదాకా సుదీర్ఘ చర్చలు

అన్ని అంశాలపైనా చర్చించాం

ఆందోళన విరమించాలని కోరాం

నేడూ చర్చలు: బొత్స, సజ్జల

తొలిసారి సీఎస్‌ సహా పూర్తి కమిటీ

సానుకూల వాతావరణంలో చర్చలు

ఆశాజనకంగా జరిగాయి.. కానీ

సహాయ నిరాకరణ యథాతథం: నేతలు


అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య శుక్రవారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ‘చలో విజయవాడ’ తర్వాత మారిన సర్కారు ‘మూడ్‌’ ఈ చర్చల్లో స్పష్టంగా కనిపించింది. సీఎస్‌ సహా మంత్రుల కమిటీ మొత్తం తొలిసారి చర్చల్లో పాల్గొనడం గమనార్హం. ఆరు గంటలపాటు సాగిన ఈ చర్చల్లో ఉద్యోగ నేతల ఎదుట కమిటీ కొన్ని ప్రతిపాదనలు ఉంచగా, కొన్నింటితో నేతలు విభేదించారు. కొన్ని విషయాలపై మాత్రం అంగీకారం తెలిపారు. ఉద్యోగ నేతలవైపు నుంచి ముందుపెట్టిన డిమాండ్లలో కొన్నింటి పట్ల సానుకూలంగా ప్రభుత్వం స్పందించింది. శనివారం కూడా చర్చలను కొనసాగించి.. మిగతా డిమాండ్లపైనా దృష్టి సారిద్దామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో చర్చలను ముగించుకుని అటు మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల; ఇటు ఉద్యోగ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి బయటకు వచ్చి విడివిడిగా మీడియాతో మాట్లాడారు. చర్చలు సానుకూల వాతావరణంలో ఆశాజనకంగా సాగాయని నేతలు పేర్కొన్నారు. తొలిసారి సీఎస్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారని వెల్లడించారు. ఈ చర్చల్లో ఒక్కొక్క అంశాన్ని తాము ప్రభుత్వం ముందు ఉంచగా, కమిటీ తన ప్రాధాన్యాలను తమకు వివరించిందని చెప్పారు. శనివారం జరిగే చర్చల్లో పీఆర్సీ అంశం దాదాపు కొలిక్కి వస్తుందనే ఆశాభావాన్ని నేతలంతా వ్యక్తం చేశారు. అన్ని అంశాలపైనా సానుకూలంగా చర్చించినట్టు బొత్స, సజ్జల చెప్పారు. ఫిట్‌మెంట్‌, ఐఆర్‌ రికవరీ, హెచ్‌ఆర్‌ఏ సహా పలు అంశాలపై చర్చించినట్టు వివరించారు. శనివారం కూడా చర్చలు కొనసాగిస్తామని, ఉద్యోగుల అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.  అయితే.. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ నేతలు ఈ సమావేశంలో గట్టిగా కోరినట్టు తెలిసింది. దీనిపై మాట్లాడదాం.. మాట్లాడదాం.. అంటూ మంత్రుల కమిటీ దాటవేత ధోరణి ప్రదర్శించింది. తాజా చర్చల నేపథ్యంలో ఆందోళనను, సమ్మెను విరమించాలని కమిటీ సభ్యులు కోరగా, దానిపై తమ నిర్ణయం తెలిపేందుకు ఉద్యోగ నేతలూ నిరాకరించారు. విలేకరులతో మాట్లాడే సమయంలో ముందు ప్రకటించిన తమ సహాయ నిరాకరణ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. మంత్రుల కమిటీకి సమావేశంలో కూడా ఇదే విషయం స్పష్టంగా చెప్పినట్టు వారు వెల్లడించారు. 

Updated Date - 2022-02-05T07:56:03+05:30 IST