AP News: ప్రధాని మోదీ, కేంద్రమంత్రి తోమర్‌లకు లేఖలు రాసిన నారా లోకేష్

ABN , First Publish Date - 2022-08-29T19:37:56+05:30 IST

ప్రధాని మోదీ, కేంద్రమంత్రి తోమర్‌లకు టీడీపీ జాతీయ కర్యదర్శి నారా లోకేష్ లేఖలు రాశారు.

AP News: ప్రధాని మోదీ, కేంద్రమంత్రి తోమర్‌లకు లేఖలు రాసిన నారా లోకేష్

అమరావతి (Amaravathi): రాష్ట్రంలో ఎరువులు, డీఏపీ (DAP) కృత్రిమ కొరతపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌ (Tomar)లకు విడివిడిగా లేఖలు రాసినట్లు టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించి రైతుల్ని ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన డీఏపీ సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. సహకార సంఘాలకు డీఏపీ సరఫరాలో కోత విధించి, ఆర్బీకేలకు మళ్లించామని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రధానికి ఫిర్యాదు చేశానన్నారు. రాష్ట్రంలో డీఏపీ, ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ఖరీఫ్ పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2.25 లక్షల టన్నుల డీఏపీని కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్, అసమర్థ విధానాలతో కృత్రిమ కొరత ఏర్పడిందన్నారు. కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డీఏపీ ఎరువుల్ని ఆదాయవనరుగా మార్చుకునేందుకు పంపిణీ విధానాన్ని మార్చేశారని ఆరోపించారు. సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయాల్సిన ఎరువుల్ని వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు మళ్లించిందని, అయితే ఆర్బీకేల్లో డీఏపీ అందుబాటులో ఉండట్లేదన్నారు. దీంతో రైతులు బహిరంగ మార్కెట్‌లో 50 కేజీల డీఏపీ బస్తాను రూ.300 వరకూ అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి డీఏపీ సరఫరా పెంచి కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్ నుంచి రైతుల్ని కాపాడాలని ఆ లేఖల్లో కోరినట్లు నారా లోకేష్ తెలిపారు.

Updated Date - 2022-08-29T19:37:56+05:30 IST